వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల విషయంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలపై రూ.7 లక్షల జరిమానా విధించిన సీసీపీఏ
మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు హాజరైన కోర్సులకు సంబంధించి కీలక సమాచారాన్ని దాచిన సంస్థ
కోచింగ్ సేవల ఎంపిక కోసం వినియోగదారులకు కచ్చితమైన సమాచారాన్ని పొందే హక్కు ఉందని పునరుద్ఘాటించిన సీసీపీఏ
प्रविष्टि तिथि:
30 MAY 2026 1:24PM by PIB Hyderabad
వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019ని ఉల్లంఘిస్తూ... కీలక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు పాల్పడిన వజీరామ్ అండ్ రవి ఐఏఎస్ స్టడీ సెంటర్ ఎల్‌ఎల్‌పీపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) రూ. 7,00,000 జరిమానా విధిస్తూ తుది ఉత్తర్వు జారీ చేసింది. ఒక వర్గంగా వినియోగదారుల హక్కులను పరిరక్షించి, ప్రోత్సహించడానికి... వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019లోని నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా వస్తువులు, సేవలకు సంబంధించి తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ప్రధాన కమిషనర్ శ్రీమతి నిధి ఖరే, కమిషనర్ శ్రీ అనుపమ్ మిశ్రాల నేతృత్వంలో... 'వజీరామ్ అండ్ రవి ఐఏఎస్ స్టడీ సెంటర్ ఎల్ఎల్‌పీ' పై ఈ ఉత్తర్వును జారీ చేశారు. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)-2023లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు, ఛాయాచిత్రాలు, విజయాలను ఆ కోచింగ్ సంస్థ ప్రముఖంగా వాడుకుంటూనే, ఆ అభ్యర్థులు ఎంచుకున్న నిర్దిష్ట కోర్సులకు సంబంధించిన కీలక సమాచారాన్ని మాత్రం దాచిపెడుతూ అతిశయోక్తి ప్రకటనలు చేసిందని గుర్తించిన మీదట ఈ ఉత్తర్వును జారీ చేశారు.
యూపీఎస్ఈ సీఎస్ఈ-2023 ఫలితాల ప్రకటన తరువాత ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్ (www.vajiramandravi.com)లో కింది విషయాలను ప్రచురించారు:
i. "మొదటి 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు సాధించింది వజీరామ్ & రవికి చెందినవారే"
ii. "మొదటి 50 ర్యాంకుల్లో 37 ర్యాంకులు సాధించింది వజీరామ్ & రవికి చెందినవారే."
iii. "వాస్తవం: ప్రతి సంవత్సరం, యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికయ్యే అధికారుల్లో 30 శాతానికి పైగా విద్యార్థులు 'వజీరామ్ & రవి'కి చెందినవారే."
వివరణాత్మక విచారణ అనంతరం, సీసీపీఏ కింది అంశాలను గమనించింది:
|
క్రమ సంఖ్య
|
సంస్థ చెప్పినది
|
సీసీపీఏ కనుగొన్నది
|
|
1.
|
"మొదటి 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు సాధించింది వజీరామ్ & రవికి చెందినవారే"
|
ఈ 8 మంది అభ్యర్థుల్లో ఏడుగురు కేవలం ఉచిత ఇంటర్వ్యూ మార్గదర్శక కార్యక్రమంలో మాత్రమే చేరారు.
|
|
2.
|
"మొదటి 50 ర్యాంకుల్లో 37 ర్యాంకులు సాధించింది వజీరామ్ & రవికి చెందినవారే."
|
ఈ 37 మంది అభ్యర్థులలో 29 మంది కేవలం ఉచిత ఇంటర్వ్యూ మార్గదర్శక కార్యక్రమంలో మాత్రమే చేరారు.
|
|
3.
|
"వాస్తవం: ప్రతి సంవత్సరం, యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికయ్యే అధికారుల్లో 30 శాతానికి పైగా విద్యార్థులు 'వజీరామ్ & రవి'కి చెందినవారే."
|
- 2021లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 86.36% మంది ఇంటర్వ్యూ మార్గదర్శక కార్యక్రమంలో చేరినవారే.
- 2022లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 78.31% మంది ఇంటర్వ్యూ మార్గదర్శక కార్యక్రమంలో చేరినవారే.
- 2023లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 97.56% మంది ఇంటర్వ్యూ మార్గదర్శక కార్యక్రమంలో చేరినవారే.
- 2024లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 71.69% మంది ఇంటర్వ్యూ మార్గదర్శక కార్యక్రమంలో చేరినవారే.
|
పైన పేర్కొన్న ముఖ్యమైన సమాచారం ఏదీ ఈ సంవత్సరాల్లో ఏ ఒక్కదానిలోనూ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించలేదు.
యూపీఎస్‌సీ సీఎస్ఈ ప్రిలిమినరీ, మెయిన్స్ దశలు రెండింటినీ ఒక అభ్యర్థి సొంతంగా క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఐజీపీ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుందని సీసీపీఏ పేర్కొంది. ఈ రెండు అత్యంత కఠినమైన పోటీ దశల్లో సంస్థ అందించిన విద్యాపరమైన సహకారం ఏమీలేదు. సమగ్రమైన, డబ్బు చెల్లించి చేయించుకునే కోచింగ్ ప్రోగ్రామ్‌ల ప్రకటనలతో పాటు... వారు ఎంచుకున్న నిర్దిష్ట కోర్సు గురించి ఎటువంటి సమాచారం వెల్లడించకుండా, అటువంటి అభ్యర్థులను ప్రముఖంగా ప్రదర్శిస్తూ, ఈ అభ్యర్థులు తమ పూర్తి-నిడివి కోచింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా వచ్చినవారేననే తప్పుడు అభిప్రాయాన్ని సంస్థ కల్పించింది.
విజయవంతమైన అభ్యర్థులు పూర్తి నిడివి గల తరగతి గది కార్యక్రమాలు, ఐచ్ఛిక సబ్జెక్ట్ కోచింగ్, టెస్ట్ సిరీస్ లేదా స్వల్పకాలిక ఉచిత ఇంటర్వ్యూ మార్గదర్శక కార్యక్రమాల్లో దేనికి హాజరయ్యారు అనే విషయాలు సహా... వారు ఎంచుకున్న నిర్దిష్ట కోర్సుల వివరాలను వెల్లడించకపోవడం చట్టం ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటన కిందకు వస్తుందని సీసీపీఏ గమనించింది. ఇది భావి వినియోగదారులకు సమాచారంతో కూడిన ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడాన్ని నిషేధించే వినియోగదారుల రక్షణ చట్టం-2019లోని సెక్షన్ 2(28)(iv) కింద "తప్పుదోవ పట్టించే ప్రకటన" నిర్వచనం పరిధిలోకి వివాదాస్పద ప్రకటనలూ వస్తాయని సీసీపీఏ నిర్ధారించింది. ఈ ప్రవర్తన చట్టంలోని సెక్షన్ 2(9)ను కూడా ఉల్లంఘించినట్లు తేలింది. ఇది వినియోగదారులకు సమాచారం తెలుసుకునే హక్కును కల్పిస్తుంది.
విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, కోచింగ్ రంగంలో పారదర్శకతను నిర్ధారించడం కోసం తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వ్యాపార పద్ధతులపై సీసీపీఏ ఇప్పటివరకు కోచింగ్ సంస్థలకు 60కి పైగా నోటీసులను జారీ చేసింది. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ), ఐఐటీ-జేఈఈ, ఎన్ఈఈటీ (నీట్), ఆర్‌బీఐ, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందించే సంస్థలపై సదరు ఉల్లంఘనల కోసం ఇప్పటివరకు సీసీపీఏ రూ.1.46 కోట్లకు పైగా జరిమానాలను విధించింది.
(తుది ఉత్తర్వులను ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు: https://jagograhakjago.gov.in/CCPA_Orders/index.html).
(रिलीज़ आईडी: 2267161)
आगंतुक पटल : 52