నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
తైపీ క్యాపిటల్ కప్ - 2026లో మెరిసిన భారత బృందం
వర్ధమాన, పారిశ్రామిక చోదక నైపుణ్యాల్లో రెండు రజత పతకాలు, మూడు ప్రతిభా పురస్కారాలు కైవసం
15 దేశాల పోటీదారులతో తలపడి ప్రతిభ చాటిన నిపుణులైన యువ భారత చాంపియన్లు
प्रविष्टि तिथि:
29 MAY 2026 6:29PM by PIB Hyderabad
తైవాన్‌లోని తైపీ నగరంలో 2026 మే 26 నుంచి 28 వరకు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక తైపీ క్యాపిటల్ కప్ 2026 అంతర్జాతీయ పోటీల్లో వివిధ విభాగాల్లో రెండు రజత పతకాలు, మూడు ప్రతిభా పురస్కారాలను గెలుచుకుని.. భారత జట్టు దేశం గర్వించేలా చేసింది. ఐరోపా, ఆసియా, అమెరికా, ఓషియానియాల్లోని 15 దేశాలకు చెందిన నిపుణులైన ప్రపంచ స్థాయి యువతతో పోటీపడి.. భారత బృందం తమ అసాధారణ సాంకేతిక ప్రతిభను చాటింది. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలకు కేంద్రంగా రోజురోజుకూ పెరుగుతున్న భారత ప్రతిష్ఠను ఈ విజయం స్పష్టం చేసింది.
తీవ్రమైన పోటీ నెలకొన్న అయిదు అత్యున్నత నైపుణ్య విభాగాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మన పోటీదారులు.. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న, పరిశ్రమలకు ఎంతో కీలకమైన రంగాల్లో అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భారత నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ సామర్థ్యాలను చాటడమే కాకుండా, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండేలా ప్రతిభావంతులను తీర్చిదిద్దడంలో దేశ అంకితభావానికి ఇది నిదర్శనం.
దేశ యువతకు ఎప్పటిక్పపుడు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, పరిశ్రమల అవసరాలకు తగిన అనుభవం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అవకాశాలను అందిస్తున్న కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతా మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్‌డీసీ) భారత బృందానికి పూర్తి సహకారాన్ని అందించాయి.
తైపీ క్యాపిటల్ కప్ - 2026లో భారత బృందం సాధించిన విజయాలు:
· ముస్కాన్ – చిత్రలేఖనం, అలంకరణలో రజత పతకం
· శ్రీ అర్జున్ సుమతీ విజయభాస్కర్ – మొబైల్ అప్లికేషన్ల అభివృద్ధిలో రజత పతకం
· శ్రీ మహమ్మద్ మఫాజ్ పూనైకన్నన్ రబీ అహ్మద్ – సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల అభివృద్ధిలో ప్రతిభా పురస్కారం
· శ్రీ సురేశ్ కుమార్ గణేశన్ మీనా – డిజిటల్ నిర్మాణంలో ప్రతిభా పురస్కారం
· శ్రీ ఎండీ. సెరాజ్ – ఆటోమొబైల్ సాంకేతికతలో ప్రతిభా పురస్కారం
రజత పతక విజేతలు 8,000 తైవాన్ డాలర్ల చొప్పున నగదు బహుమతిని అందుకోగా, ప్రతిభా పురస్కార గ్రహీతలకు 5,000 తైవాన్ డాలర్ల చొప్పున అందించారు.
‘‘తైపీ క్యాపిటల్ కప్ - 2026లో భారత బృందం కనబరిచిన ప్రతిభ.. దేశ యువతలో ఉన్న ఆత్మవిశ్వాసానికి, సామర్థ్యానికి, పట్టుదలకు ప్రతీక. ఇది దేశానికి గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులతో పోటీపడి.. భారతీయ నైపుణ్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో సరిసమానంగా నిలబడగలవని మన విజేతలు నిరూపించారు. పతకాలు సాధించడమే కాకుండా.. మన పోటీదారులకు అంతర్జాతీయ ప్రమాణాలను పరిచయం చేస్తూ, మున్ముందు ‘వరల్డ్ స్కిల్స్ షాంఘై 2026’ వంటి మరిన్ని పెద్ద సవాళ్లనూ ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేసే విలువైన శిక్షణ క్షేత్రాలుగా ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయి. అంతర్జాతీయంగా పోటీపడగల, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని నిర్మించాలన్న మన సంకల్పాన్ని ఇలాంటి ప్రతి విజయమూ మరింత బలోపేతం చేస్తుంది. నిపుణులైన, సాధికారులైన యువత ముందుండి నడిపేలా మన ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది’’ అంటూ కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ (స్వతంత్ర హోదా), విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి విజేతలను అభినందించారు.
భారత బృందాన్ని, వారి మార్గదర్శకులను అభినందిస్తూ.. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘‘తైపీ క్యాపిటల్ కప్ 2026లో భారత బృందం విజయం.. దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థ రోజురోజుకూ సాధిస్తున్న పురోగతికీ, మన యువత ప్రపంచ స్థాయి సామర్థ్యానికీ నిదర్శనం. ఈ అద్భుతమైన విజయానికిగాను పోటీదారులు, నిపుణులు, మార్గదర్శకులకు అభినందనలు. అలాగే అంతర్జాతీయంగా పోటీపడగల ప్రతిభావంతులను తీర్చిదిద్దడంలో నిరంతరం మద్దతు అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వాలకు, పారిశ్రామిక భాగస్వాములకు, శిక్షణ సంస్థలకు కృతజ్ఞతలు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలు అత్యుత్తమ ప్రతిభను కనబరిచేలా స్ఫూర్తినిస్తాయి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలకు నిలయంగా ఎదిగే దిశగా భారత్ ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తాయి’’ అన్నారు.
అనుభవజ్ఞులైన నిపుణులు, మార్గదర్శకుల పర్యవేక్షణలో భారత బృందం ఈ పోటీల్లో పాల్గొన్నది. ఈ అంతర్జాతీయ వేదికను సద్వినియోగం చేసుకునేలా పోటీదారులను సన్నద్ధులను చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు. ఈ నిపుణుల బృందంలో శ్రీ అంకుర్ శర్మ (మొబైల్ అప్లికేషన్ల అభివృద్ధి), శ్రీ అనికేత్ కుమార్ పాఠక్ (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల అభివృద్ధి), శ్రీమతి సౌమ్య ద్వివేది (చిత్రలేఖనం, అలంకరణ), శ్రీ ప్రసన్న ప్రకాశ్ సామెల్ (ఆటోమొబైల్ సాంకేతికత), శ్రీ షిజు శశిధరన్ (డిజిటల్ కన్స్ట్రక్షన్) ఉన్నారు.
మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్, కియా మోటార్స్, బిమ్‌ల్యాబ్స్ గ్లోబల్, జేకే సిమెంట్స్ వారి వైపీఎస్‌వీఈఎఫ్‌తోపాటు పలు ప్రముఖ సంస్థలు పారిశ్రామిక భాగస్వాములుగా భారత జట్టు సన్నాహక ప్రయాణానికి సహకారాన్ని అందించాయి. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారి శిక్షణ.. మన యువతకు బలమైన నైపుణ్య శిక్షణ వ్యవస్థను అందించాయి. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులతో పోటీపడేలా భారత బృందాన్ని సమర్థంగా తీర్చిదిద్దడమే కాకుండా, నైపుణ్య రంగంలో భారత అద్భుత పురోగతిని అంతర్జాతీయ వేదికపై చాటింది.
నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు ప్రపంచస్థాయి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో.. తైపీ క్యాపిటల్ కప్ - 2026లో సాధించిన ఈ విజయం కీలకమైన మైలురాయి. వరల్డ్‌స్కిల్స్ షాంఘై - 2026 సహా, విస్తృతమైన అంతర్జాతీయ నైపుణ్య పోటీల నేపథ్యంలో.. ఒక విలువైన సన్నాహక వేదికగా ఈ పోటీ నిలిచింది. వృత్తి విద్యా రంగంలో ఉన్నతిని, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన శిక్షణను, భవిష్యత్ సన్నద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించడంలో భారత్ అంకితభావాన్ని స్పష్టం చేసింది.
వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా భారత్ తన నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిరంతరం బలోపేతం చేసుకుంటున్న తరుణంలో.. నైపుణ్యాలకు ఉన్న సానుకూల మార్పులను తీసుకురాగల శక్తిని ఇలాంటి అద్భుత విజయాలు స్పష్టంగా చాటుతున్నాయి. ఈ నైపుణ్యాలు యువతకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. అంతర్జాతీయ పోటీలో దేశ యువతను అగ్రభాగాన నిలబెడుతున్నాయి.
***
(रिलीज़ आईडी: 2267154)
आगंतुक पटल : 25