ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు రహిత విద్యాసంస్థల పైలట్ అప్లికేషన్‌ను ప్రారంభించిన కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ
పొగాకు ఉత్పత్తుల నమూనాల సేకరణ కోసం ప్రామాణిక కార్యాచరణ విధానం విడుదల
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 2:08PM by PIB Hyderabad
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (డబ్ల్యూఎన్‌టీడీ) 2026 సందర్భంగా పొగాకు రహిత విద్యాసంస్థల (టీఎఫ్ఈఐ) పైలట్ అప్లికేషన్‌ను న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ ప్రారంభించారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాతీయ సదస్సులో దీనిని ప్రారంభించారు. పొగాకు, నికోటిన్ వ్యసనం వల్ల కలిగే భయంకరమైన ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, పర్యావరణ నష్టాల నుంచి ప్రస్తుత, రాబోయే తరాలను రక్షించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
టీఎఫ్‌ఈఐ అనేది, దేశంలోని పాఠశాలలు, కళాశాల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం కోసం తీసుకువచ్చిన ఒక డిజిటల్ కార్యక్రమం.
ఈ అప్లికేషన్‌ను కింది అంశాలను సులభతరం చేయడానికి రూపొందించారు.
· విద్యా సంస్థల స్వీయ-అంచనా, నివేదికలు..
· టీఎఫ్‌ఈఐ మార్గదర్శకాలను సరిగా పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించడం..
· పొగాకు నియంత్రణకు సంబంధించిన బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయడం..
· విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించడం
· విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం అవగాహన, చైతన్య కార్యక్రమాలు...
· పొగాకు రహిత క్యాంపస్ చర్యల అమలును బలోపేతం చేయడం..
ఈ డిజిటల్ వేదికలో ఉండే ప్రామాణిక పర్యవేక్షణ, నివేదికలు, నిబంధనల పరిశీలన పద్ధతులు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, విద్యాసంస్థలకు, అధికారులకు ఎంతగానో సహాయపడతాయి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే పిల్లలు, యువతకు ఆరోగ్యకరమైన, పొగాకు లేని వాతావరణం లభిస్తుంది. మొదటి విడతగా (పైలట్ ప్రాజెక్ట్‌గా) ఈ అప్లికేషన్‌ను రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. యాప్ పనితీరును అంచనా వేయడానికి, నివేదికల పద్ధతులను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పొగాకు ఉత్పత్తుల నమూనాల సేకరణ కోసం ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని విడుదల చేసింది. మార్కెట్లో దొరికే పొగాకు ఉత్పత్తులపై నిఘాను పెంచడానికి, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడటానికి, వాటి నాణ్యతను పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. పొగాకు ఉత్పత్తుల పరీక్షల్లో ఎలాంటి తప్పులు లేకుండా నమ్మకంగా జరగడం కోసం ఈ నమూనాలను ఎలా సేకరించాలి, ఎలా భద్రపరచాలి, ఎలా రవాణా చేయాలి, వాటికి సంబంధించిన పత్రాలను ఎలా నిర్వహించాలనే విషయాలపై ఈ ఎస్‌ఓపీలో నిబంధనలను పొందుపరిచారు.
సభను ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ మాట్లాడుతూ... ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ముఖ్య ఉద్దేశమైన ‘‘ఆకర్షణల ముసుగు తొలగిద్దాం-నికోటిన్, పొగాకు వ్యసనాన్ని అడ్డుకుందాం’’అనేది యువతను, రాబోయే తరాలను పొగాకు, నికోటిన్ వ్యసనం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో చాలా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను యువతకు ఆకర్షణీయంగా కనిపించేలా కంపెనీలు రూపొందించి చేసి మార్కెటింగ్ చేస్తున్నాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఆకర్షణీయమైన రుచులు, రంగురంగుల ప్యాకేజింగ్, పొగాకు పేరు నేరుగా వాడకుండా పరోక్ష ప్రకటనలు, సోషల్ మీడియా, డిజిటల్ వేదికలపై చూపే రంగుల ప్రపంచంతో యువతను ఆకర్షిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యూహాల వల్ల పొగాకు, నికోటిన్ వాడకంపై యువతలో ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే యువత ఎల్లప్పుడూ నిజాలు తెలుసుకుని, అప్రమత్తంగా ఉంటూ, పొగాకు ఉత్పత్తులను పూర్తిగా తిరస్కరించేలా వారిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ఆమె తెలిపారు.
నికోటిన్, పొగాకు వ్యసనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న సమగ్ర వ్యూహంలో భాగంగా నేడు ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలు చాలా కీలకమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
పొగాకు ఉత్పత్తుల నమూనాల సేకరణ కొరకు విడుదల చేసిన ప్రామాణిక కార్యాచరణ విధానం గురించి ఆమె మాట్లాడుతూ.. పొగాకు నియంత్రణ ప్రయత్నాలలో చట్టపరమైన, నిబంధనల అమలు యంత్రాంగాలను బలోపేతం చేయడం చాలా కీలకమైన భాగమని పేర్కొన్నారు. పొగాకు నియంత్రణ చట్టాలు సమర్థవంతంగా అమలు కావాలన్నా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నా.. శాస్త్రీయ పద్ధతిలో నమూనాలను సేకరించడం, సరైన పద్ధతిలో వాటిని పరీక్షించడం, సేకరణ నుంచి పరీక్షల వరకు ప్రతి దశలోనూ పారదర్శకత లోపించకుండా చూసుకోవడం చాలా అవసరమని చెప్పారు. ఈ ఎస్‌ఓపీ అనేది నిబంధనలను ఒకేలా మార్చడానికి సహాయపడుతుందని, నియంత్రణ, అమలు ప్రయత్నాలను బలోపేతం చేయడంలో రాష్ట్రాలకు, క్షేత్రస్థాయిలో పనిచేసే సంస్థలకు అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
పొగాకు రహిత విద్యాసంస్థల పైలట్ అప్లికేషన్ ప్రారంభం గురించి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలలు, ఆయుష్ సంస్థలు, ఎన్‌సీడీ క్లినిక్‌లు, ఇతర ఆరోగ్య కేంద్రాలలో 2,000కి పైగా పొగాకు అలవాటును మార్పించే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చేశారు. విద్యాసంస్థలు, కళాశాల ప్రాంగణంలో పొగాకు రహిత పద్ధతులను అవలంబించేలా, వాటిని నిరంతరం కొనసాగించేలా ప్రోత్సహించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ పైలట్ దశలో యాప్‌ను చురుగ్గా ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి తమ సలహాలు, సూచనలను అందించాలని భాగస్వామ్య సంస్థలను, అధికారులను ఆమె కోరారు.
పొగాకు వాడకం వల్ల క్యాన్సర్లు, గుండె జబ్బులు, పక్షవాతం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, అనేక ఇతర అంటువ్యాధులు కాని రోగాలు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దేశంలో సంభవించే మరణాలకు, వైకల్యాలకు ఈ వ్యాధులే ప్రధాన కారణమని ఆమె చెప్పారు.
దేశవ్యాప్తంగా పొగాకు నియంత్రణ కార్యక్రమాలను బలోపేతం చేయడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అమలు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు , పౌర సమాజ సంస్థలు, సామాజిక కార్యకర్తలు చేస్తున్న నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను ఆమె అభినందించారు. రాబోయే తరాలను పొగాకు, నికోటిన్ వ్యసనం నుంచి రక్షించడంలో భాగస్వాములందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆధారాలతో కూడిన పొగాకు నియంత్రణ విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో, కొత్తగా వస్తున్న నికోటిన్, పొగాకు ఉత్పత్తుల నుంచి యువతను రక్షించడంలో భారత్ నిరంతర నాయకత్వ పాత్రను సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రభాకర్ ప్రముఖంగా ప్రస్తావించారు.
పిల్లలను, టీనేజర్లను, యువతను పొగాకు, నికోటిన్ వ్యసనం బారిన పడకుండా రక్షించడం కోసం భారత్ పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నట్లు డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎల్ స్వస్తిచరణ్ తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ‘‘ఆకర్షణల ముసుగు తొలగిద్దాం-నికోటిన్, పొగాకు వ్యసనాన్ని అడ్డుకుందాం’’ ప్రధానాంశానికి అనుగుణంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2026ను నిర్వహించారు. అనేదానికి అనుగుణంగా ఉంది. ఆకర్షణీయమైన రుచులు, రంగురంగుల ప్యాకేజింగ్, డిజిటల్ మార్కెటింగ్, తప్పుదోవ పట్టించే ప్రచారాల ద్వారా యువతను ఆకర్షించడానికి పొగాకు, నికోటిన్ సంస్థలు రోజురోజుకూ మారుస్తున్న కొత్త ఎత్తగడలపై ఈ ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా పొగాకు రహిత, ఆరోగ్యకరమైన భారత్‌ను నిర్మించడం కోసం అందరితో ‘‘పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ’’ చేయించారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఈ పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేసే సదుపాయాన్ని కూడా కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కల్పించింది. ఈ ప్రతిజ్ఞను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఇందులో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రోత్సహించాలని భాగస్వామ్య మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను, అధికారులను మంత్రిత్వ శాఖ కోరింది.
యువతను భాగస్వామ్యం చేయడానికి, వారిలో అవగాహన పెంచే కార్యక్రమాలలో భాగంగా పొగాకు వాడకం, నికోటిన్ వ్యసనం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను వివరిస్తూ న్యూఢిల్లీకి చెందిన హృదయ్ సంస్థ సహకారంతో పాఠశాల విద్యార్థులు ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పొగాకు నియంత్రణ రంగంలో పనిచేస్తున్న ఉన్నత ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు , వైద్య నిపుణులు , స్వచ్ఛంద సంస్థలు, ఇతర కీలక ప్రతినిధులు పాల్గొన్నారు.
‘పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ’ చేసేందుకు పై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి
ప్రామాణిక నిర్వహణ విధానాలను ఈ కింది లింక్ ద్వారా పొందవచ్చు: https://ntcp.mohfw.gov.in/assets/document/Guideline-manuals/Sample%20Collection%20and%20Management%20Draft%209.pdf
***
(రిలీజ్ ఐడి: 2266833)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11