మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన సీబీఎస్ఈ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
విద్యార్థుల ప్రయోజనాలే మాకు ప్రధానం.. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తాం: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 7:09PM by PIB Hyderabad
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలను సమీక్షించడం కోసం న్యూఢిల్లీలోని సీబీఎస్ఈ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు.
పాఠశాల విద్యాశాఖ, అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, సీబీఎస్ఈ చైర్‌పర్సన్ శ్రీ రాహుల్ సింగ్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) సీనియర్ అధికారులు, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో, పారదర్శకంగా, విద్యార్థులతో మైత్రీపూర్వక ధోరణిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థి ప్రయోజనాలే కేంద్రంగా పరీక్షా విధానాన్ని నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వాస్తవిక ఆందోళనలన్నింటినీ త్వరితగతిన సమర్థంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పరీక్ష ఫలితాల అనంతర సేవల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఇందులో భాగంగా విద్యార్థుల సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడం, మూల్యాంకనం, పర్యవేక్షణ వ్యవస్థను మెరుగుపరచడం, సీబీఎస్ఈ డిజిటల్ వేదికలను ఆధునికీకరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటితోపాటు పరీక్షలకు సంబంధించిన సేవలను విద్యార్థులకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ సమీక్ష సాగింది.
ఈ ఏడాది దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారనీ, ఇందులో దాదాపు 98 లక్షల జవాబు పత్రాలు, దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలు ఉన్నాయని సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు దాదాపు 11 లక్షల స్కాన్ చేసిన జవాబు పత్రాలను పోర్టల్ ద్వారా పొందారని వారు తెలిపారు.
విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించిన శ్రీ ప్రధాన్.. ఈ విషయంలో ఎలాంటి లోపాలు లేదా వైఫల్యాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవస్థ లోపల, వెలుపల... ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
పరీక్షల అనంతర సేవలందించే పోర్టల్‌లో లాగిన్ యాక్సెస్ సమస్యలు, సర్వర్‌పై విపరీతమైన లోడ్, చెల్లింపులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నట్టు వచ్చిన నివేదికలను కూడా మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు.
అంతరాయం లేకుండా విద్యార్థులకు నిరంతర సేవలను అందించడం కోసం.. పోర్టల్ స్థిరత్వం, సర్వర్ సామర్థ్యం, లాగిన్ నిర్వహణ, పేమెంట్ గేట్‌వే అనుసంధాన ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను.. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు, డిజిటల్ వ్యవస్థల నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాంకేతిక బృందానికి అప్పగించారు.
విద్యా మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2266433)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12