వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ సన్నద్ధతను వేగవంతం చేసిన కేంద్రం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
భారత వ్యవసాయ భవితను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఖరీఫ్ సదస్సులో ఏకమైన ‘టీమ్ అగ్రికల్చర్’
ప్రతి రాష్ట్రానికీ విభిన్న వ్యవసాయ విధానం ఉన్నందున ప్రాంతీయ వ్యూహాలు తక్షణ అవసరం
చరిత్రాత్మకంగా 376 మిలియన్ టన్నులకు పైగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిన భారత్
ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్
పప్పుధాన్యాలు, నూనెగింజల రంగంలో స్వయం-సమృద్ధి సాధనకు ప్రాధాన్యం
వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం దాకా... కొత్త వ్యవసాయ రోడ్‌మ్యాప్ రూపొందించనున్న ఖరీఫ్ సదస్సు: శ్రీ చౌహాన్
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 5:23PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్‌లో ఖరీఫ్ సదస్సు-2026 గురించి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... దేశంలో ఆహార భద్రతను నిర్ధారించడం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, పౌరులకు పౌష్టికాహారాన్ని అందించడం కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాలుగా ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. జాతీయ ఖరీఫ్ ప్రచారం-2026 పై రెండు రోజుల వ్యవసాయ సదస్సును ఈ నెల 28, 29 తేదీల్లో న్యూఢిల్లీలోని పూసాలో గల ఎన్ఏఎస్‌సీ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్త వ్యవసాయ మంత్రులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో పాటు ఐసీఏఆర్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నాహాలపై ఈ రెండు రోజుల్లో సవివరమైన చర్చలు, సమీక్షలు నిర్వహిస్తారు.
ఖరీఫ్ సదస్సులో ఏకమైన ‘టీమ్ అగ్రికల్చర్’
ఈ ఖరీఫ్ సదస్సు 'టీమ్ అగ్రికల్చర్' మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని శ్రీ చౌహాన్ అన్నారు. 'టీమ్ అగ్రికల్చర్' అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదనీ... రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన భాగస్వాములందరూ ఇందులో భాగమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమనీ, రాష్ట్రాల చురుకైన భాగస్వామ్యంతోనే ఈ రంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. కేంద్రం మధ్యవర్తిగా, భాగస్వామిగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో ఖరీఫ్, రబీ పంటల సన్నాహాలు... నాణ్యమైన విత్తనాల లభ్యత, క్షేత్రస్థాయిలో వివిధ వ్యవసాయ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం వంటి అంశాలపై చర్చిస్తారని తెలిపారు.
ఈ సమావేశానికి ముందే రాష్ట్రాలతో వీడియో అనుసంధానం ద్వారా సమావేశాలు జరిగాయనీ, ఈ సమావేశాల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించామనీ కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంప్రదింపుల ఆధారంగా, రాష్ట్రాలు వారి సన్నద్ధతా ప్రణాళికలతో ఈ సమావేశానికి హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై కూలంకషంగా చర్చించడంతో పాటు, సమన్వయ ప్రయత్నాల ద్వారా ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలని ఆయన సూచించారు.
గతంలో ఈ సదస్సు ఒక రోజు కార్యక్రమంగా జరిగేది. దేశ పరిమాణం, వైవిధ్యం దృష్ట్యా ఒకే రోజులో సమగ్ర చర్చలు పూర్తి చేయడం సాధ్యపడలేదు. ఈ సంవత్సరం సదస్సు మొదటి రోజున వివిధ రాష్ట్రాల అధికారులు బృందాలుగా ఏర్పడి కూలంకషంగా చర్చలు జరుపుతుండగా... రెండో రోజున రాష్ట్ర వ్యవసాయ మంత్రులు ఈ చర్చల్లో పాల్గొంటారు.
విభిన్న వ్యవసాయ పరిస్థితుల కోసం ప్రాంతీయ స్థాయి చర్చలు ప్రారంభం
దేశానికి ఉన్న విస్తారమైన భౌగోళిక, వాతావరణ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని... ప్రభుత్వం జాతీయ వ్యవసాయ సదస్సుకు మించి సంప్రదింపుల ప్రక్రియను విస్తరించింది. ఇప్పుడు ప్రాంతీయ సదస్సులనూ నిర్వహించడం ప్రారంభించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. జైపూర్, లక్నో, భువనేశ్వర్లలో ఇప్పటికే మూడు ప్రాంతీయ సదస్సులు జరిగాయని ఆయన తెలియజేశారు. ఈశాన్య, దక్షిణ భారత్ కోసం మరో రెండు సదస్సులను ప్రతిపాదించగా... వాటి తేదీలనూ త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యవసాయ పద్ధతులు, వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారుతుంటాయనీ... అందుకే ప్రాంతీయ స్థాయి చర్చలు మరింత ఆచరణాత్మకంగా, ప్రభావవంతంగా ఉంటాయని శ్రీ చౌహాన్ అన్నారు. "రాష్ట్రాలతో చిన్న బృందాలుగా చర్చలు జరిపినప్పుడు... ప్రతి రాష్ట్రానికి సంబంధించిన నిర్దిష్ట సమస్యలు, అవసరాలపై వివరంగా చర్చించడం సాధ్యమవుతుంది" అని ఆయన అన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ-వాతావరణ మండలాల ఆధారంగా ప్రాంతీయ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఐసీఏఆర్ వర్గీకరణను ప్రస్తావిస్తూ... దేశాన్ని స్థూలంగా ఎనిమిది వ్యవసాయ-వాతావరణ మండలాలుగా విభజించవచ్చని ఆయన అన్నారు. "కేవలం ఐదు మండలాల ఆధారంగా కాకుండా, ఈ ఎనిమిది మండలాల ఆధారంగా ప్రాంతీయ సమావేశాలను నిర్వహించడం కోసమే మా ప్రయత్నం. తద్వారా వ్యవసాయ వ్యూహాలు, పథకాలు క్షేత్రస్థాయికి సమర్థంగా చేరతాయి" అని ఆయన జోడించారు. ఖరీఫ్ సమావేశానికి సంబంధించిన ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ సిద్ధం చేశామనీ, ఇందులో వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై విస్తృత చర్చలు ఉన్నాయని ఆయన తెలియజేశారు.
గోధుమ, వరి, మొక్కజొన్న, నూనెగింజల పంటల్లో రికార్డు స్థాయి ఉత్పత్తి
వ్యవసాయ రంగం సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ... రైతుల కృషి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానపరమైన మద్దతు, శాస్త్రీయ పరిశోధన, రాష్ట్రాల సహకారం వల్ల ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ గత రికార్డులన్నింటినీ అధిగమించిందని శ్రీ చౌహాన్ అన్నారు. "రైతుల కృషి, ప్రభుత్వ పథకాలు, కొత్తగా అభివృద్ధి చేసిన విత్తన వంగడాల వల్లే ఈ ఏడాది దేశం రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించిందని చెప్పడానికి వ్యవసాయ మంత్రిగా నాకు ఎంతో సంతృప్తిగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. 2025-26 సంవత్సరానికి భారత మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 376.563 మిలియన్ టన్నులకు చేరుకుందనీ, ఇది గత ఏడాది కంటే దాదాపు 18.8 మిలియన్ టన్నులు అధికమని కేంద్ర మంత్రి తెలిపారు. వరి ఉత్పత్తిలోనూ భారత్ సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. "వరి ఉత్పత్తి 154.024 మిలియన్ టన్నులకు చేరుకుంది. దీంతో భారత్ ఇప్పుడు చైనాను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచింది" అని ఆయన అన్నారు. గోధుమ ఉత్పత్తి 120.657 మిలియన్ టన్నులకు చేరుకోగా, మొక్కజొన్న ఉత్పత్తి 55.092 మిలియన్ టన్నులుగా నమోదైంది - ఈ రెండూ రికార్డు స్థాయిలేనని కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ వివరించారు.
నూనెగింజల ఉత్పత్తిలోనూ దేశం గణనీయ రికార్డులను సాధించిందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ ఏడాది నూనెగింజల ఉత్పత్తి 43.059 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. వేరుశనగ ఉత్పత్తి 13.074 మిలియన్ టన్నులకు చేరుకోగా, ఆవాల ఉత్పత్తి 13.768 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ రెండూ రికార్డు స్థాయిలో ఉన్నాయి. పప్పుధాన్యాల ఉత్పత్తి చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేసిందనీ, రాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుదలకు అత్యంత అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఖరీఫ్ వ్యూహంపై జాతీయ స్థాయి చర్చలు
పప్పుధాన్యాలు, నూనెగింజల కోసం ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేశామనీ, విత్తన నాణ్యతను మెరుగుపరచడం, విత్తన మార్పిడి రేట్లను పెంచడం, ప్రదర్శనలు, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై రాష్ట్రాలతో విస్తృతంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో ఉద్యానవన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీనికి అపారమైన సామర్థ్యం ఉందని శ్రీ చౌహాన్ అన్నారు. ఈ సదస్సులో ఉద్యానవన సమగ్ర అభివృద్ధి మిషన్, కాటన్ మిషన్‌పైనా చర్చలు జరుగుతాయన్నారు. వాతావరణ మార్పును వ్యవసాయానికి ఒక ప్రధాన సవాలుగా అభివర్ణిస్తూ... మారుతున్న వాతావరణ సరళి, అస్తవ్యస్తమైన వర్షపాతం వ్యవసాయ పరిస్థితులను వేగంగా మారుస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. “ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒకేసారి అధిక వర్షపాతం కురిసి, ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు పొడి వాతావరణం ఉంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని సురక్షితంగా, సుస్థిరంగా మార్చే చర్యలపై చర్చలు అవసరం” అని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయం, భూసార కార్డులు, ఎరువుల సమతుల్య వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. అవగాహన లోపం కారణంగా చాలా మంది రైతులు ఎరువులను అధికంగా వాడుతున్నారనీ, వాటిని సమతుల్యంగా వాడటం అత్యవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సమీకృత వ్యవసాయ నమూనాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. "దేశంలో వ్యవసాయ క్షేత్రాల పరిమాణం చిన్నది. అందువల్ల, పరిమిత భూమిలో రైతులు ఎలా అధిక ఆదాయం సంపాదించగలరనే దానిపై చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తాం" అని ఆయన అన్నారు.
వ్యవసాయానికి తగినంత ఆర్థిక సహాయం ప్రాముఖ్యతనూ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రైతులకు కేవలం పంట ఉత్పత్తికే కాకుండా... పంటల కోతల అనంతర నిర్వహణ, నష్ట నివారణకూ మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలవారీగా వ్యవసాయ రుణాల పంపిణీ అసమానంగా ఉందనీ, కొన్ని రాష్ట్రాలు ఇతర వాటి కంటే గణనీయంగా తక్కువ వ్యవసాయ రుణాలను పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, తగినంత పెట్టుబడి మూలధనం అందుబాటులో ఉంటే... వారు మెరుగైన వ్యవసాయ పద్ధతులను చేపట్టగలుగుతారు" అని శ్రీ చౌహాన్ వ్యాఖ్యానించారు.
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పీఎం-ఆశా పథకం, డిజిటల్ వ్యవసాయం, రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ), రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓలను) బలోపేతం వంటి అంశాలపైనా ఈ సదస్సులో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ చర్చల కోసం రాష్ట్రాలను వేర్వేరు బృందాలుగా విభజించారు. రోజంతా ఈ బృందాల మధ్య సవివరమైన చర్చలు జరుగుతాయి. మరుసటి రోజున, రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమక్షంలో వివిధ వ్యవసాయ అంశాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఖరీఫ్ పంట కాలానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక ఉమ్మడి వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తాయి. 'ఖేత్ బచావో అభియాన్' పైనా ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తామని శ్రీ చౌహాన్ తెలిపారు. సమష్టిగా నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహిత సమన్వయంతో పనిచేస్తాయని ఆయన జోడించారు.
***
(రిలీజ్ ఐడి: 2266420)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8