రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్త నిత్యావసరాల లభ్యత.. సరఫరా వ్యవస్థ పునరుత్థానంపై రక్షణమంత్రి నేతృత్వంలోని మంత్రుల అనధికార బృందం (ఐజీఓఎం) సమీక్ష


ఇంధన సరఫరా పరిస్థితులు సాధారణం... ఆందోళనతో అధిక కొనుగోళ్లు చేయవద్దని దేశ ప్రజలకు రక్షణ మంత్రి సూచన

నిత్యావసర వస్తువుల లభ్యతకు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రకటన
సంక్లిష్ట సమయాల్లో ప్రధాని మోదీ అద్భుత నాయకత్వానికి ‘ఐజీఓఎం’ కృతజ్ఞతలు

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 7:54PM by PIB Hyderabad

పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు తన నేతృత్వంలోని మంత్రుల అనధికార బృందం (ఐజీఓఎం) 6వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజురోజుకూ మారుతున్న పరిణామాలపై చర్చించడంతోపాటు పరిస్థితులను నిభాయించడంలో సంసిద్ధత, ప్రతిస్పందన చర్యలను సమీక్షించింది. రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్, పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, వినియోగదారు వ్యవహారాలు-ఆహారం-ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కార్మిక-ఉపాధి, యువజన వ్యవహారాలు-క్రీడల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ మన్సుఖ్ మాండవీయ, శాస్త్ర-సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేశంలో నిత్యావసర వస్తువుల లభ్యత, సరఫరా వ్యవస్థ పటిష్టంపై ‘ఐజీఓఎం’ సమీక్షించింది. అన్నిరకాల వస్తు సరఫరా సాధారణంగానే ఉందని, ఎలాంటి కొరత లేకుండా నిత్యావసరాలు లభించేలా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని పేర్కొంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ విషయంలో భయాందోళనలకు గురై అధిక కొనుగోళ్లు చేయవద్దని రక్షణ శాఖ మంత్రి సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్‌ ద్వారా ప్రజలకు సూచించారు. ప్రపంచవ్యాప్త అంతరాయాల ప్రభావం ప్రజలపై కనిష్ట స్థాయిలో ఉండేవిధంగా సంక్లిష్ట సమయాల్లో అద్భుత నాయకత్వంతో దూరదృష్టి చూపినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా ‘ఐజీఓఎం’ కృతజ్ఞతలు తెలిపింది.

రోజురోజుకూ మారుతున్న పరిణామాల దృష్ట్యా దేశ సన్నద్ధతను బలోపేతం చేసేందుకు నిరంతర కృషి చేయాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా  దేశంలో ఆహార ధరలు స్థిరంగా కొనసాగేలా చూడాలని, రైతులకు ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలు తగినంతగా అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలు సరిపడా ఉన్నాయని, అధికారులు ‘ఐజీఓఎం’కు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఇంధన వినియోగం 243.2 టన్నులు కాగా, 258.1 టన్నుల వార్షిక స్థాపిత సామర్థ్యంతో భారత్‌ ప్రపంచంలో 4వ అతిపెద్ద రిఫైనరీగా నిలిచిందని చెప్పారు. ఏటా సుమారు 61.5 టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి కూడా చేస్తున్నామని, డిమాండ్-సరఫరాలో ఎటువంటి అంతరం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వరంగ చమురు విక్రయ కంపెనీలు పూర్తి అంతర్జాతీయ ధర భారాన్ని చిల్లర ధరకు జోడించడం లేదని, తద్వారా రోజుకు రూ.550 కోట్లదాకా  నష్టాన్ని భరిస్తున్నాయని చెప్పారు. చిల్లర వినియోగార్థం మాత్రమే ప్రభుత్వం ఈ రక్షణ కల్పించిందని తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య డీజిల్ విషయంలో స్థిరమైన విధానం కింద అంతర్జాతీయ ధరలనే అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక కొనుగోలుదారులు తమకు నిర్దేశించిన దానికి బదులుగా రక్షిత ధర సౌలభ్యాన్ని పొందడం కోసం చిల్లర వినియోగదారుల ముసుగులో కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా కొందరు డీలర్లు కూడా బ్లాక్ మార్కెటింగ్ వంటి పోకడలకు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. దీంతో కేంద్ర మంత్రిత్వ శాఖతోపాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, ఈ సంక్షోభ సమయంలో పారిశ్రామిక సంస్థలు నిర్దేశిత చట్రాన్ని అనుసరించేలా పారిశ్రామిక సంఘాలను కూడా ఈ చర్యల్లో భాగస్వాములను చేస్తున్నారు.

దేశంలో ఎరువుల నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రుల బృందానికి అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు ఎరువుల అవసరాన్ని వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ 390.54 లక్షల టన్నులుగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమాచారం ప్రకారం సుమారు 200.47 లక్షల టన్నులు (51 శాతానికి పైగా) అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది 33 శాతం సాధారణ స్థాయి కన్నా గణనీయంగా అధికం. మెరుగైన ప్రణాళికతో ముందు జాగ్రత్తలు తీసుకుంటూ నిల్వల నిర్వహణ సహా సమర్థ రవాణా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుండటాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

ఉత్పత్తి

సంక్షోభానంతర దేశీయ ఉత్పాదన

భారత రేవులకు చేరిన దిగుమతులు

యూరియా

59.51

13.60

డీఏపీ

8.26

0.88

‘ఎన్‌పీకే’లు

19.38

5.65

ఎస్‌ఎస్‌ఎఫ్‌

11.24

0

ఎంఓపీ

0

3.83

మొత్తం

98.39

23.96

సంక్షోభం అనంతర కాలంలో దిగుమతులు సహా దేశీయ ఉత్పాదన ద్వారా సాధారణ లభ్యతకు అదనంగా సుమారు 122.4 లక్షల టన్నుల మేర నిల్వ చేసుకున్నాం. మరోవైపు మే, జూన్ నెలల కాలంలో భారత ఓడరేవులకు రానున్న నిల్వల్లో భాగంగా భారత్‌ దాదాపు 15 లక్షల టన్నుల (టీఎస్‌పీ సహా) డీఏపీ, 10 లక్షల టన్నుల (ఎఎస్‌ సహా) ఎన్‌పీకే ఎరువుల నిల్వల విషయంలో సురక్షిత స్థితిలో ఉంది. ఎరువుల గరిష్ఠ వినియోగ కాలంలో తగినంత లభ్యతకు ఈ నిల్వలు భరోసా ఇస్తాయి. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులు.. యూరియా, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువుల లభ్యతపైనా ఎరువుల మంత్రిత్వశాఖ క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది. కంపెనీలు సమర్పించే అన్ని సబ్సిడీ బిల్లులపై వారానికోసారి క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తోంది.

ఎరువుల లభ్యతకు భరోసా దిశగా కార్యదర్శుల సాధికార బృందం ఇప్పటిదాకా పది సార్లు సమావేశమై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా లభ్యత సంబంధిత అనేక సవాళ్లను పరిష్కరించడమే కాకుండా దేశ ఎరువుల భద్రతను పటిష్ఠంగా, స్థిరంగా నిర్వహిస్తోంది. మొత్తం మీద అన్ని అవసరాలకు మించి ప్రధాన ఎరువుల లభ్యతకు పూర్తి భరోసా ఇస్తోంది.

ఇక ‘ఎంఎస్‌ఎంఈ’లలో నిర్వహణ మూలధనం దిశగా ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతున్న ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 5.0’పై పారిశ్రామిక సంఘాలు... ప్రత్యేకించి ‘ఎంఎస్‌ఎంఈ’లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినట్లు అధికారులు మంత్రుల బృందానికి తెలిపారు.


***


(రిలీజ్ ఐడి: 2266296) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Kannada