ఆయుష్
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్న కోల్‌కతా.. ఈ ఏడాది ఇతివృత్తం “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా”
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్‌డౌన్ సందర్భంగా ఖజురహోలో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనలో పాల్గొన్న వేలాది మంది
యోగా సంగమ్ పోర్టల్, యోగా పార్క్ పోర్టల్, యోగా కొత్త టీషర్ట్ విడుదల
‘‘యోగా, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఖజురహోకు ఉంది’’ : శ్రీ ప్రతాపరావు జాదవ్
‘‘యోగా, ఖజురహో రెండూ దేశ సాంస్కృతిక వారసత్వానికి విడదీయరాని ప్రతీకలు’’: సీఎం డాక్టర్ మోహన్ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2026 11:25AM by PIB Hyderabad
2026 జూన్ 21న జరిగే ప్రధాన వేడుకలకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావ్ జాదవ్ నేడు ప్రకటించారు. ‘‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’’ అనేది ఈ సంవత్సరం యోగా దినోత్సవ ప్రధానాంశమని ఆయన వెల్లడించారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో, వయసు పైబడే కొద్దీ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేలా చేయడంలో యోగా పాత్రను తెలిపేలా ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని వెస్ట్రన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌లో నిర్వహించిన యోగా మహోత్సవం 2026 వేదికగా ఈ ప్రకటన చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకా 25 రోజుల సమయం ఉన్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ నిర్వహించిన ఈ సామూహిక యోగా ప్రదర్శనలో వేలాది మంది యోగా ప్రేమికులు పాల్గొని, అందరూ ఒకే రకమైన యోగాసనాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. దేశ సాంప్రదాయ వారసత్వం, ఆధ్యాత్మిక చైతన్యంతో ముడిపడి ఉన్న కోల్‌కతా నగరం ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. ఈ ఏడాది ముఖ్య ఉద్దేశమైన ‘‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’’.. వృద్ధాప్యంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగాకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగా భారతీయ ప్రాచీన జ్ఞానానికి ప్రతీక అని, ముందస్తు ఆరోగ్య సంరక్షణకు, సమతుల్య జీవనానికి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి చెప్పారు.
‘‘ఖజురహో నగరం తన సంపన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో భదేశ ప్రాచీన సంప్రదాయాలకు, ఆరోగ్య పద్ధతులకు మధ్య ఉన్న అనుసంధానాన్ని తెలియజేస్తుంది. ఈ నగరానికి యోగా, సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే అన్ని శక్తులు, అవకాశాలు ఉన్నాయి’’ అని తెలిపారు.

యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా నిరంతర ప్రచారం, ప్రజల భాగస్వామ్యం ద్వారా యోగాను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, పాఠశాలకు, కార్యాలయానికి, సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.ముందస్తు ఆరోగ్య రక్షణ ప్రాధాన్యతను వివరిస్తూ.. యోగాతో పాటు ఆయుష్ ఆహార్ వంటి కార్యక్రమాలు సమతుల్య పోషకాహారాన్ని, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని శ్రీ జాదవ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడానికి, ప్రజా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి యోగా సంగమ్ పోర్టల్ ను కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ తిరిగి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, సంస్థల్లో యోగా కోసం ప్రత్యేక స్థలాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే యోగా పార్క్ పోర్టల్ ను ప్రారంభించారు. యోగా, ఆరోగ్యం, సంపూర్ణ శ్రేయస్సు సందేశాన్ని చాటిచెప్పేలా సరికొత్తగా రూపొందించిన యోగా టీ షర్ట్‌ను ఆయన ఆవిష్కరించారు. యోగా 365 ప్రచారంలో భాగంగా నిర్వహించిన 100 రోజుల ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా పాల్గొని, యోగ్ మిత్ర ధృవీకరణ పత్రాన్ని పొందారని మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. తన వీడియో సందేశంలో మాట్లాడుతూ.. యోగా, ఖజురహో రెండూ దేశ సాంస్కృతిక వారసత్వానికి అత్యంత ముఖ్యమైన, విడదీయరాని ప్రతీకలని అభివర్ణించారు. నేటి యువత యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారని, ఇది మరింత ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ఎంతగానో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ ఆయుష్, సాంకేతిక, ఉన్నత విద్యాశాఖల మంత్రి శ్రీ ఇందర్ సింగ్ పర్మార్ మాట్లాడుతూ.. యోగా, ఆయుర్వేదం కేవలం పద్ధతులు మాత్రమే కావని, అవి భారత గొప్ప సంప్రదాయాల్లో భాగమైన ఒక జీవన విధానమని అన్నారు. విద్య, యోగా కలిసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించగలవని ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, దేవాదాయ శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర భవ్ సింగ్ లోధీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం దేశ సాంస్కృతిక చైతన్యాన్ని, మన నాగరికత విలువలను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో యోగా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, శ్రేయస్సును అందించే ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా అవతరించిందని ఖజురహో లోక్‌సభ ఎంపీ శ్రీ విష్ణు దత్ శర్మ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాలలో యోగాను ఆచరిస్తున్నారని తెలియజేశారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాష్ మాట్లాడుతూ.. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక సులభమైన, స్థిరమైన మార్గాన్ని అందిస్తుందని అన్నారు. పౌరులందరూ యోగ మిత్రులుగా మారాలని ఆమె కోరారు.యోగా ద్వారా ప్రపంచాన్ని ఏకం చేయడానికి 14 జూన్ 2026న జరిగే గిన్నిస్ ప్రపంచ రికార్డు ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి రాజ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ అరవింద్ పటేరియా, బిజావర్ ఎమ్మెల్యే శ్రీ రాజేష్ శుక్లా, ఛతర్‌పూర్ ఎమ్మెల్యే శ్రీమతి లలితా యాదవ్, మధ్యప్రదేశ్ ఆయుష్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శోభిత్ జైన్, ఛతర్‌పూర్ జిల్లా కలెక్టర్ శ్రీ పార్థ్ జైస్వాల్ (ఐఏఎస్), ఛతర్‌పూర్ ఎస్పీ శ్రీ రజత్ సక్లేచా, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారుజ
ఈ కార్యక్రమంలో మొరార్జీ జాతీయ యోగా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) కాశీనాథ్ సమగండి, సంస్థకు చెందిన యోగా శిక్షకుల నేతృత్వంలో జరిగిన సామూహిక యోగా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ప్రాంతం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది యోగా ప్రేమికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. యోగా ఆధారిత ఆరోగ్యం, ముందస్తు ఆరోగ్య రక్షణ వైపు దేశవ్యాప్తంగా వస్తున్న మార్పును ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.
సామూహిక యోగా ప్రోటోకాల్ అనేది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఒక ప్రామాణిక యోగాసనాల క్రమం. అన్ని వయసుల వారి శారీరక, మానసిక,భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న సన్నాహాల్లో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించాలనే ప్రభుత్వ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది.



***
(రిలీజ్ ఐడి: 2265806)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12