వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఒట్టావాలో శ్రీ పీయూష్ గోయల్ ఉన్నత స్థాయి చర్చలు... భారత్-కెనడా సీఈపీఏ ఒప్పందాన్ని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ
సీఈపీఏ చర్చలను వేగవంతం చేయటానికి, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు కెనడాకు వెళ్తున్న భారీ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీీయూష్ గోయల్
శ్రీ పీయూష్ గోయల్, కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మధ్య జరిగిన చర్చల్లో సీఈపీఏ ఒప్పందాన్ని 2026 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించిన భారత్, కెనడా
ఆహార భద్రత, అగ్రి-టెక్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కెనడా వ్యవసాయ శాఖ మంత్రి హీత్ మెక్‌డొనాల్డ్‌తో శ్రీ పీయూష్ గోయల్ చర్చలు
భారత్-కెనడా వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై శ్రీ పీయూష్ గోయల్, కెనడా విదేశాంగ మంత్రి శ్రీమతి అనితా ఆనంద్ చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 10:54AM by PIB Hyderabad
భారత-కెనడా ఆర్థిక సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు వేస్తూ.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కెనడాలోని ఒట్టావా పర్యటనకు వెళ్లారు. 100కు పైగా కంపెనీల పరిశ్రమల అధిపతులతో ఇప్పటివరకు కెనడాకు వెళ్లిన అతిపెద్ద భారత వాణిజ్య ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించడమే మే 25న ఒట్టావా.. 26, 27 తేదీల్లో టొరంటో నగరాల్లో సాగే మూడు రోజుల పర్యటన ముఖ్య ఉద్దేశం. భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కోసం ప్రస్తుత చర్చలను వేగవంతం చేయటంపై ఈ పర్యటన దృష్టి సారిస్తుంది.
మొదటి రోజు ఒట్టావా పర్యటన సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, వ్యవసాయం, వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కెనడా సీనియర్ నేతలు, మంత్రులతో శ్రీ గోయల్ వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు.
కెనడా ప్రధానమంత్రి గౌరవ మార్క్ కార్నీని కలిసిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరఫున కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ప్రధానమంత్రి కార్నీ భారత్ పర్యటనను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆ పర్యటన భారత్-కెనడా భాగస్వామ్యానికి నూతనోత్తేజాన్ని, నూతన విశ్వాసాన్ని అందించిందన్నారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయటంపై ఇరుపక్షాలు భవిష్యత్ కార్యాచరణతో కూడిన చర్చలు జరిపారు. భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశంతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గేమ్ ఛేంజర్ అవుతుందని, ఇది భారీ నూతన మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని ప్రధానమంత్రి కార్నీ స్పష్టం చేశారు. సమతుల్య, వాణిజ్యపరంగా అర్థవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పట్ల ఇరుపక్షాలు నిబద్ధతను వెల్లడించాయి. ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ రెండు దేశాల వాణిజ్యానికి, పౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఒప్పందాన్ని రూపొందించేందుకు కృషి చేయాలని ఆయా దేశాల బృందాలను ఆదేశించాయి.
భారత్-కెనడా సీఈపీఏ చర్చలను ముందుకు తీసుకెళ్లటంపై కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి శ్రీ మణీందర్ సిద్ధూతో శ్రీ పీయూష్ గోయల్ నిర్మాణాత్మక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మంత్రులు ఇప్పటివరకు పూర్తయిన చర్చల ఫలితాలను సమీక్షించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై భవిష్యత్తు అవకాశాలను గుర్తించారు. 2026 చివరి నాటికి సమతుల్యమైన, పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని ముగించాలన్న నిర్ణయాన్ని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి.
ప్రతిపాదిత సీఈపీఏ.. ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే కాక, ఉభయదేశాల వాణిజ్యానికి, పౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను చేకూరుస్తూ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.
కెనడా వ్యవసాయ, అగ్రి-ఫుడ్ శాఖ మంత్రి గౌరవ శ్రీ హీత్ మెక్‌డొనాల్డ్‌తో జరిగిన నిర్ణయాత్మక సమావేశంలో.. ఆహార భద్రత, సుస్థిరత, వ్యవసాయ సాంకేతికతలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ వ్యవసాయ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై చర్చలు జరిగాయి. ఆహార శుద్ధి రంగంలో పరస్పర సహకారానికి అర్ధవంతమైన అవకాశాలను ఇరుపక్షాలు అన్వేషించాయి. ఇటువంటి సహకారం భారతదేశ రైతులు, ఉత్పత్తిదారుల ఆదాయాలను పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుందని, రెండు దేశాల మధ్య వ్యవసాయ అనుసంధానాన్ని మరింత పెంపొందించేందుకు దోహదపడుతుందని స్పష్టం చేశారు.
కెనడా విదేశాంగ మంత్రి శ్రీమతి అనితా ఆనంద్‌తో శ్రీ పీయూష్ గోయల్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. భారత్-కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యానికి వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక అనుసంధానతల ప్రాముఖ్యతను తెలియజేశారు. భారత్‌లో విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రవాణా, డిజిటల్ మౌలిక సదుపాయాలు, వినియోగదారుల రంగాలు.. కెనడా దీర్ఘకాలిక పెట్టుబడులకు, మరింత సహకారానికి గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయని మంత్రి అన్నారు. ఆర్థిక, వ్యూహాత్మక కోణాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే నిబద్ధతను ఇరుపక్షాలు స్పష్టం చేశాయి.
ఒట్టావాలో మొదటి రోజు పర్యటనను శ్రీ పీయూష్ గోయల్ విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి శ్రీ మణీందర్ సిద్ధూ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశ అద్భుతమైన వృద్ధి ప్రయాణాన్ని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు, వృద్ధి చెందుతున్న కార్యాచరణ స్ఫూర్తి, విస్తృతమైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, విస్తరిస్తున్న మార్కెట్ అవకాశాలే ఈ వృద్ధికి శక్తి అని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేయటంలో ప్రవాస భారతీయులు అందిస్తున్న విశేష సహకారాన్ని శ్రీ పీయూష్ గోయల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మే 26, 27 తేదీల్లో టొరంటోలో పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశాలు, బీ2బీ చర్చలతో క్రియాశీల కార్యక్రమానికి శ్రీ పీయూష్ గోయల్ ప్రాతినిధ్యం వహించనున్నారు. మంత్రిత్వ శాఖల స్థాయిలోని నిర్ణయాలను, ప్రాధాన్యత గల రంగాల్లో నిర్దిష్టమైన వాణిజ్య భాగస్వామ్యాలుగా మార్చటమే దీని లక్ష్యం.
మార్చి 2026లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసి నిర్దేశించిన కార్యాచరణను ఈ పర్యటన ముందుకు తీసుకెళ్తుంది. 2025 మధ్యకాలం నుంచి ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి చర్చలను ఇది మరింత పటిష్ఠం చేస్తుంది.
మార్చి 2025లో విధి విధానాల పత్రంపై సంతకాలు జరిగినప్పటి నుంచి సీఈపీఏ చర్చలు అత్యంత వేగంగా ముందుకు సాగాయి. మార్చి 2026లో మొదటి విడత ఆన్‌లైన్ చర్చలు జరగ్గా.. మే 8, 2026 నాటికి రెండో విడత చర్చలు ముగిశాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యటనతో పాటు ప్రస్తుతం మే 25 నుంచి 29 వరకు ఒట్టావాలో సాంకేతికపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పట్ల ఇరుపక్షాలు ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధిని, వేగాన్ని ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి.
ఇరుపక్షాలు విస్తృతమైన అవకాశాలను పెంచుకునేందుకు.. ఇంధనం, గనుల తవ్వకం, ఆటోమొబైల్స్, ఔషధ రంగం, టెలి కమ్యూనికేషన్స్, కృత్రిమ మేథ, తోలు, వస్త్ర పరిశ్రమలతో సహా వివిధ రంగాలకు చెందిన 100 మందికి పైగా పరిశ్రమల అగ్రనేతల ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లింది.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 8.5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు విస్తరించాలని ఇరుదేశాల ప్రభుత్వాలు ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2265355)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8