గనుల మంత్రిత్వ శాఖ
బెంగళూరు సమీక్షల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న మైనింగ్, అన్వేషణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించిన కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
బెంగళూరులో జీఎస్‌ఐ, ఎన్‌ఐఆర్‌ఎం, ఐబీఎం సంస్థల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించిన మంత్రి.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులు అందుకున్న కేందమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 3:09PM by PIB Hyderabad
భారతదేశ ఖనిజ భద్రతను, వ్యూహాత్మక వృద్ధి లక్ష్యాలను బలోపేతం చేయటానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, మిషన్ మోడ్ విధానాన్ని అవలంబించాలని మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని మైనింగ్, ఎక్స్‌ప్లోరేషన్ సంస్థలను సోమవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ఆదేశించారు.
"అన్ని సంస్థలు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలి. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యాలు ప్రతి సంస్థాగత ప్రక్రియకు పునాదిగా నిలిచేలా చూడాలి. ఈ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఏజెన్సీ నుంచి భారతదేశ ప్రజలు, భారత ప్రభుత్వం.. వేగం, జవాబుదారీతనం, స్పష్టమైన ఫలితాలను ఆశిస్తున్నాయి" అని కేంద్రమంత్రి అన్నారు. బెంగళూరులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), రిమోట్ సెన్సింగ్ అండ్ ఏరియల్ సర్వే (ఆర్‌ఎస్‌ఏఎస్) విభాగాల సీనియర్ అధికారులతో నిర్వహించిన వరుస ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయటం, శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయటం, స్థిరమైన మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించటం, వికసిత్ భారత్-2047 జాతీయ సంకల్పానికి అనుగుణంగా సంస్థాగత ప్రయత్నాలను ఒకే తాటిపైకి తీసుకురావటంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి.
సమావేశం సందర్భంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రాజెక్టులు, సాంకేతిక పురోగతులు, అన్వేషణ కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా అరుదైన భూ మూలకాలు (ఆర్‌ఈఈ), లిథియం, నికెల్, కోబాల్ట్, టంగ్స్టన్, వెనడియం, ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ (పీజీఈ) వంటి కీలక, వ్యూహాత్మక ఖనిజాల రంగానికి సంబంధించి సమీక్ష చేశారు. భారతదేశ ఖనిజ భద్రతను, వ్యూహాత్మక వృద్ధి లక్ష్యాలను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న వనరుల పెంపు, ఖనిజ నిర్ధారణ, శాస్త్రీయ సర్వేలు, గనుల సుస్థిరత, జియోస్పేషియల్ టెక్నాలజీలు, అధునాతన అన్వేషణ వ్యవస్థలపై మంత్రికి సమగ్ర నివేదికను సంబంధిత సంస్థలు సమర్పించాయి.
అధికారులను ఉద్దేశించి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడారు. "గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, దూరదృష్టితో భారత్ స్వావలంబన, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థ దిశగా దృఢంగా సాగుతోంది. భారతదేశ భవిష్యత్ వృద్ధి, పారిశ్రామిక విస్తరణ, వ్యూహాత్మక ఖనిజ భద్రతకు గనుల తవ్వకం, అన్వేషణ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి" అని అన్నారు.
అన్ని సంస్థలు స్పష్టమైన సమయపాలన, కొలవగల ఫలితాలు, మరింత జవాబుదారీతనంతో సమన్వయంతో మిషన్-మోడ్ విధానంలో పనిచేయాలని ఆదేశించారు.
భారతదేశ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేయటంలో అధునాతన సాంకేతికతలు, డేటా ఇంటిగ్రేషన్, శాస్త్రీయ ఆవిష్కరణల ప్రాముఖ్యతను మంత్రి స్పష్టం చేశారు.
"ఏఐ, రిమోట్ సెన్సింగ్, ఇంటిగ్రేటెడ్ జియోసైన్స్ అనలిటిక్స్, అధునాతన అన్వేషణ పద్ధతుల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థలపైనే ఖనిజ తవ్వకాల భవిష్యత్ ఆధారపడి ఉంది. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచేందుకు, వనరుల పరంగా సురక్షితంగా ఉండేలా చేసే దిశగా పరివర్తనలో మన సంస్థలు ముందుండాలి" అని ఆయన అన్నారు.
ఎంఎండీఆర్ సవరణ చట్టం-2015 ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల తర్వాత కర్ణాటక, గోవాలో ఖనిజ వనరులు గణనీయంగా పెరగటంతో పాటు బంగారం, రాగి, పీజీఈ, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. దీనితో పాటు దాదాపు 48,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తృత-స్థాయి థీమాటిక్ మ్యాపింగ్, ఏఐ, ఎంఎల్ ఆధారిత ఖనిజ అన్వేషణ, అధునాతన దశల తవ్వకాల ప్రాజెక్టులతో ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను కూడా జీఎస్ఐ వివరించింది.
జాతీయ ప్రాధాన్యత గల మౌలిక సదుపాయాలు, గనుల భద్రతా ప్రాజెక్టులకు అందించిన సహకారాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ప్రదర్శించింది. ఇందులో జలవిద్యుత్, మెట్రో రైల్, టన్నెల్ ఇంజనీరింగ్, భూకంప పర్యవేక్షణ, సున్నితమైన మౌలిక సదుపాయాల సమీపంలో నియంత్రిత పేలుళ్ల వంటి రంగాలున్నాయి. దీనితో పాటు వ్యూహాత్మక జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతుగా రాక్ మెకానిక్స్, ఇంజనీరింగ్ జియాలజీ (భూగర్భ శాస్త్రం), సూక్ష్మ భూకంపాల పర్యవేక్షణ, జియోటెక్నికల్ పరిష్కారాల్లోని సామర్థ్యాలను ఈ సంస్థ తెలియజేసింది.
పర్యావరణ పరిరక్షణ చర్యలు, వేలం వేసిన ఖనిజ బ్లాకులను అందుబాటులోకి తీసుకురావటం, శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత, ఖనిజ శుద్ధీకరణ, సుస్థిర గనుల విధానాల్లో సాధించిన పురోగతిని భారతీయ గనుల బ్యూరో సమీక్షించింది. జాతీయ కీలక ఖనిజాల మిషన్ ద్వారా ప్రస్తుతమున్న మైనింగ్ వ్యవస్థల నుంచి కీలకమైన ఖనిజాల సుసంపన్నత, వెలికితీత సామర్థ్యానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను ఐబీఎం సమర్పించింది.
నేషనల్ ఏరో-జియోఫిజికల్ మ్యాపింగ్ ప్రోగ్రాం (ఎన్ఏజీఎంపీ) ద్వారా సాధించిన పురోగతిని ఆర్‌ఎస్‌ఏఎస్ విభాగం సమర్పించింది. ఇందులో వైమానిక భూభౌతిక సర్వేలు, హైపర్‌స్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్, ఏఐ, ఎంఎల్ ఆధారిత ఖనిజ అన్వేషణ మ్యాపింగ్ వంటి అంశాలున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 6.5 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా ప్రాంతాన్ని కవర్ చేసినట్లు, ఏరో-జియోఫిజికల్ డేటాసెట్లను ఉపయోగించి 200కు పైగా ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను రూపొందించినట్లు ఈ సమీక్ష స్పష్టం చేసింది.
బెంగళూరు పర్యటనలో భాగంగా గౌరవ కేంద్రమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను సందర్శించి.. అక్కడి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన గురుకులాన్ని, ఎగ్జిబిషన్ సెంటర్‌ను సందర్శించారు. భారత సాంస్కృతిక వారసత్వానికి కట్టుబడి.. విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక అవగాహన, సామాజిక మార్పు కోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.
శ్రీ శ్రీ రవిశంకర్‌ను కేంద్రమంత్రి కలిసి, ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. "వికసిత్ భారత్-2047 దిశగా సాగుతున్న భారత అభివృద్ధి ప్రయాణం కేవలం ఆర్థిక పురోగతి, సాంకేతిక పురోభివృద్ధితో మాత్రమే కాక... ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక విలువలు, సమాజం పట్ల సామూహిక సేవాభావంతోనూ ముందుకు సాగాలి" అని శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు.
వికసిత్ భారత్-2047 విజన్‌కు అనుగుణంగా శాస్త్రీయ పురోగతి, సుస్థిరాభివృద్ధి, సాంస్కృతిక విలువలు, సంస్థాగత ప్రతిభ ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ పర్యటన ముగిసింది.
(రిలీజ్ ఐడి: 2265222)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7