గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీ జీ రామ్ జీ చట్టం- 2025 అమలుకు సంబంధించి రాష్ట్రాల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించిన గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి


వీబీ జీ రామ్ జీ చట్టం 2026 జూలై 1న అమల్లోకి వచ్చేంతవరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిరంతరాయంగా అమలు చేసేందుకు, ఉపాధి లభ్యతను నిర్ధారించడానికి 2026 జూన్ నెలకు 45 కోట్లకు పైగా పనిదినాలకు సరిపడా కార్మిక బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిత్వ శాఖ

నిరంతరంగా నిధులు లభించేలా చూసుకోవటంతో పాటు పనులను చేపట్టడం కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ విభాగాలకు రూ. 26,971 కోట్ల ప్రధాన నిధుల మంజూరు

గ్రామీణ కుటుంబాలకు నిరంతర ఉపాధి అవకాశాలు ఉండేలా చూసుకునేందుకు 2026 జూలై 1న వీబీ జీ రామ్ జీ చట్టం అమల్లోకి వచ్చేంతవరకు సజావుగా కొనసాగనున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

నాడు పోస్టు చేయడమైనది: 23 MAY 2026 6:00PM by PIB Hyderabad

వీబీ జీ రామ్ జీ చట్టం- 2025 అమలు, కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ (డీఓఆర్‌డీ) కార్యదర్శి శ్రీ రోహిత్ కాన్సల్ అధ్యక్షతన ఈ రోజు ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు,  రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నుంచి వీబీ జీ రామ్ జీ చట్టం పరిధిలోని ఫ్రేమ్‌వర్క్‌లోకి  సజావుగా మారడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపడుతున్న ముందస్తు చర్యల పురోగతిని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్షించారు. ఈ చట్టం అమలు తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగేలా  చూసేందుకు అన్ని కీలకమైన ముందస్తు ఏర్పాట్లను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

నూతన  ఫ్రేమ్‌వర్క్ అమలుకు అవసరమైన వివిధ రాష్ట్ర స్థాయి ఏర్పాట్లు వంటి ముందస్తు చర్యలను ఈ సమావేశంలో భాగంగా సమీక్షించారు. వీటిలో రాష్ట్ర వీజీ జీ రామ్ జీ పథకం నోటిఫికేషన్ సిద్ధం చేయడం, ఈ చట్టం కింద రాష్ట్ర నిర్దిష్ట నిబంధనలను రూపొందించడం.. డీబీటీ- స్పర్శ్, ఎస్ఎన్ఏ-స్పర్శ్ కోసం సాంకేతిక అనుసంధానం చేయడం.. భాగస్వామ్య ప్రణాళికా విధానం ద్వారా గ్రామసభ ఆమోదించిన పనుల జాబితాను 'యుక్తధార' పోర్టల్ ద్వారా సిద్ధం చేయడం వంటి అంశాలతో పాటు ఇతర అవసరమైన ఆర్థిక, సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లు ఉన్నాయి. జూలై 1వ తేదీ నుంచి వీబీ జీ రామ్ జీ చట్టం అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ నిబంధనలను రూపొందించుకోవాలని, తగిన ఆర్థిక కేటాయింపులను నిర్ధారించుకోవాలని కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. నూతన ఫ్రేమ్‌వర్క్‌లోకి సజావుగా మారడానికి వీలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను సకాలంలో చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేశారు.

2026 జూలై 1 కంటే ముందే అన్ని ముందస్తు పనులను సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు, సాంకేతిక బృందాలతో సహా భాగస్వాములందరి మధ్య సన్నిహిత సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని శ్రీ రోహిత్ కాన్సల్ ప్రముఖంగా ప్రస్తావించారు.  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌) నుంచి వీబీ జీ రామ్ జీ చట్టానికి మారడం అనేది గ్రామీణ ఉపాధి, జీవనోపాధి వ్యవస్థలో ఒక ప్రధాన సంస్కరణ అని.. అందువల్ల కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో సమన్వయ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

వీబీ జీ రామ్ జీ చట్టం- 2025 అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన వివిధ ముందస్తు చర్యలను కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గ్రామీణాభివృద్ధి శాఖ (డీఓఆర్‌డీ) కార్యదర్శి తెలియజేశారు. ఈ నేపథ్యంలో వీబీ జీ రామ్ జీ కింద అనుమతించదగిన పనుల తాత్కాలిక జాబితాను అభిప్రాయాలు, సూచనల కోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించారు. స్థానిక అవసరాల ఆధారంగా అదనపు పనులను ప్రతిపాదించాలని కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. వీటిని వీబీ జీ రామ్ జీ చట్టం- 2025లోని షెడ్యూల్ I కింద కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.

వీబీ జీ రామ్ జీ చట్టం- 2025 కింద రూపొందించిన వివిధ ముసాయిదా నిబంధనలను 22.05.2026న విడుదల చేసినట్లు తెలిపిన మంత్రిత్వ శాఖ.. వాటిని తుది రూపంలోకి తీసుకురావడానికి ముందు 30 రోజుల పాటు విస్తృతంగా ప్రజా సంప్రదింపులు చేపట్టేందుకు ఈ-గెజిట్ లో ప్రచురించినట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేసింది. ఆ నిబంధనల జాబితా ఈ విధంగా ఉంది:

• విబీ జీ రామ్ జీ సెంట్రల్ గ్రామీణ్ రోజ్‌గార్ గ్యారంటీ కౌన్సిల్ నిబంధనలు- 2026

• వీబీ జీ రామ్ జీ వేతనాల చెల్లింపు, నిరుద్యోగ భృతి విధాన నిబంధనలు- 2026

• వీబీ జీ రామ్ జీ ప్రమాణబద్ధ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు చేసే ఖర్చులు, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో పథకం ఖర్చుల విధానం, ప్రక్రియ నిబంధనలు- 2026

• వీబీ జీ రామ్ జీ జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ నిబంధనలు- 2026

• వీబీ జీ రామ్ జీ ఫిర్యాదుల పరిష్కార నిబంధనలు- 2026

• వీబీ జీ రామ్ జీ పరిపాలనా ఖర్చుల నిబంధనలు- 2026

• వీబీ జీ రామ్ జీ కింద తాత్కాలిక లేదా ప్రాంతీయ నిబంధనలు- 2026

• వీబీ జీ రామ్ జీ ప్రమాణబద్ధ కేటాయింపుల కొరకు ఆబ్జెక్టివ్ పారామితుల నిబంధనలు- 2026

నూతన ఫ్రేమ్‌వర్క్ కింద ప్రణాళికలు, అమలును సులభతరం చేయడం కోసం గ్రామ పంచాయతీలను ఏ, బీ, సీ విభాగాలుగా వర్గీకరించే ఒక సూచనాత్మక ప్రణాళికను కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించారు. నిర్దిష్ట స్థానిక అవసరాలు, నిబంధనల ఆధారంగా ఈ వర్గీకరణ కోసం తగిన ప్రమాణాలను అవి స్వీకరించొచ్చని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

సన్నద్ధతను సమీక్షించడానికి, అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి, అమలుకు సంబంధించిన సమస్యలపై సంప్రదింపులను సులభతరం చేయడానికి, కొత్త ఫ్రేమ్ వర్క్ లోకి సజావుగా మారేలా చూసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రతి వారం క్రమం తప్పకుండా సంప్రదింపులు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

2026 జూలై 1న వీబీ జీ రామ్ జీ చట్టం అమల్లోకి వచ్చే వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌) కింద పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగించాలని శ్రీ రోహిత్‌ కాన్సల్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిరంతరంగా ఉపాధి కల్పనను నిర్ధారించడానికి, మెరుగైన నూతన ఫ్రేమ్‌వర్క్‌లోకి సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అంచనా డిమాండ్ ఆధారంగా 2026 జూన్ నెలకు తగిన కార్మిక బడ్జెట్‌ను ఆమోదించారు.

ఈ మార్పు కాలంలో అంతరాయం లేని నిధులు లభించేలా చూసుకోవటంతో పాటు పనుల కొనసాగింపును నిర్ధారించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలు, మెటీరియల్, పరిపాలన, సామాజిక ఆడిట్ యూనిట్ విభాగాల కొరకు రూ. 26,971 కోట్ల ప్రధాన నిధులను మంజూరు చేసినట్లు శ్రీ రోహిత్ కాన్సల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి డిమాండ్‌ను తగిన విధంగా తీర్చడం కోసం నిధులను సకాలంలో వినియోగించుకోవాలని, ప్రస్తుతం జరుగుతున్న పనులను సజావుగా పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

ముఖ్యంగా వ్యవసాయ పనులు లేని రోజుల్లో గ్రామీణ కుటుంబాలకు సకాలంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి క్షేత్రస్థాయిలో తగినన్ని పనులు ఉండేలా చూసుకోవాలని, ఉపాధి కోసం వచ్చే అన్ని వాస్తవ డిమాండ్ల విషయంలో పనులు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. గ్రామీణ కుటుంబాలకు సకాలంలో ఉపాధి అవకాశాలను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సంబంధిత అధికారులను కోరారు. నూతన ఫ్రేమ్‌వర్క్ ప్రారంభమవటానికి ముందే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌) కింద ప్రస్తుతం కొనసాగుతున్న పనులను సకాలంలో పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేశారు. అయితే 2026 జూన్ 30 నాటికి పూర్తికాకుండా కొనసాగుతున్న పనులను వీబీ జీ రామ్ జీ నిబంధనలకు అనుగుణంగా ఉంచుతూనే ఆ చట్టం పరిధిలోకి బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

మెరుగైన గ్రామీణ ఉపాధి, జీవనోపాధి ఫ్రేమ్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సజావుగా అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పని చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని శ్రీ రోహిత్ కాన్సల్ పునరుద్ఘాటించారు.


(రిలీజ్ ఐడి: 2264733) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Kannada , Malayalam