శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్‌లో విస్తరిస్తున్న డేటా సెంటర్ రంగంలో ఒక లక్ష ఇంజినీరింగ్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా: డాక్టర్ జితేంద్ర సింగ్
‘‘డేటా సెంటర్ ప్రధాన ఆర్థిక వ్యవస్థ’’లో ప్రపంచానికి నాయకత్వం వహించగల స్థితిలో భారత్’’..
పరిశ్రమతో కలిసి ముందుకు నడవడానికి ప్రభుత్వం సిద్ధం: డాక్టర్ జితేంద్ర సింగ్
భారత్ ఇక ఎంతమాత్రం విదేశాల విజయగాథల కోసం ఎదురుచూడట్లేదు..
ఇవాళ అగ్రగామి సాంకేతికతలలో భారత్‌తో చేతులు కలపాలని ప్రపంచం కోరుకుంటోందన్న కేంద్ర మంత్రి
కృత్రిమ మేధ, క్వాంటమ్, స్వచ్ఛ ఇంధన రంగాలు భారత సాంకేతికతలో ఓ కొత్త విప్లవానికి దారితీస్తాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
22 MAY 2026 3:53PM by PIB Hyderabad
భారత్ ఒక కీలక దశలో అడుగుపెడుతోందని, ఈ దశలో కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ సాంకేతికతలు, నవ తరం డిజిటల్ మాధ్యమ సేవలు రాబోయే కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని నిర్దేశించనున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సైన్సు, టెక్నాలజీ, భూ విజ్ఞానశాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు శక్తి , అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. ఇతర దేశాల్లో నూతన ఆవిష్కరణల కోసం భారత్ వేచి ఉండేందుకు బదులు, ప్రపంచమే సాంకేతిక భాగస్వామ్యాల్ని నెలకొల్పుకోవడానికి భారత్‌తో కలిసి పనిచేయాలని తపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. విధానపరమైన సంస్కరణలు, ప్రయివేటు రంగ భాగస్వామ్యం, స్వచ్ఛ శక్తి ఏకీకరణ, శరవేగంగా పురోగమిస్తున్న నూతన ఆవిష్కరణల విస్తారిత అనుబంధ వ్యవస్థల మద్దతుతో విశ్వసనీయ గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా పేరు తెచ్చుకోవడానికి
భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని ఆయన అన్నారు.
ఏఎమ్‌సీహెచ్ఏఎమ్ ఇండియా ఏర్పాటు చేసిన వార్షిక నాయకత్వ శిఖరాగ్ర సదస్సులో ‘‘భవిష్యత్తు అవసరాలకు దీటుగా భారత్ డేటా కేంద్రాలను తీర్చిదిద్దడం: దృఢతర సరఫరా వ్యవస్థలూ, అవకాశాల’’పై నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ కీలకోపన్యాసాన్ని ఇచ్చారు. భారత్ డేటా ప్రధాన ఆర్థిక వ్యవస్థను ఇకపై ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే చూడకుండా దేశానికి లభించిన ఓ వ్యూహాత్మక అవకాశంగా చూడాలని, ఈ అవకాశం రాబోయే దశాబ్దాల్లో పెట్టుబడి, ఉపాధికల్పన, ఇంధన వ్యవస్థలతో పాటు భౌగోళికంగానూ, రాజకీయంగానూ పోటీతత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.
భారత్‌లో డేటా సెంటర్ సామర్థ్యం 1.5 గిగావాట్ స్థాయి నుంచి 2030 కల్లా సుమారు 6.5 గిగావాట్ కు వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న విస్తరణ పనులతో కృత్రిమ మేధా సంబంధిత వ్యవస్థలు, కూలింగ్ సాంకేతికతలు, స్మార్ట్ గ్రిడ్లు, పునరుత్పాదక ఇంధన ఏకీకరణ, ఉన్నత స్థాయి డిజిటల్ సేవల వ్యవస్థ వంటి రంగాల్లో దాదాపు ఒక లక్ష ఇంజినీరింగ్ ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారని ఆయన అన్నారు. కృత్రిమ మేధ, 6జీ, సెమీకండక్టర్లు, డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు సేవలను అందిస్తున్న వ్యవస్థ.. వీటన్నిటి దన్నుతో శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతున్న భారత విస్తారిత అనుబంధ వ్యవస్థ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులతో పాటు సాంకేతిక సహకారాన్ని కూడా ఇదివరకు ఎప్పుడూ చూడనంత స్థాయిలో అందుకోవడానికి అనువైన అవకాశాల్ని కల్పిస్తోందని మంత్రి అన్నారు.
డేటా కేంద్రాలు ‘‘చమురు ప్రధాన ఆర్థిక వ్యవస్థకు తరువాతివి’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ వర్ణించారు. భవిష్యత్తులో డేటా నియంత్రణ, డిజిటల్ సేవల లభ్యత వ్యవస్థ, భద్రమైన సాంకేతిక విస్తారిత అనుబంధ వ్యవస్థలపై అత్యధిక స్థాయిలో శ్రద్ధాసక్తులు వ్యక్తం అవుతాయని ఆయన చెప్పారు. హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు, కోలొకేషన్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలను పూర్తిగా సద్వినియోగపరుచుకోవడానికి ప్రభుత్వం, ప్రయివేటు పరిశ్రమలు, మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థలు, టెలికమ్ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన రంగంపై ఆసక్తి ఉన్న వర్గాలతో పాటు పరిశోధన సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొంటూ ఒక ఏకీకృత జాతీయ విధానాన్ని భారత్ అనుసరించి తీరాలని ఆయన స్పష్టం చేశారు.
వేగంగా మార్పు చెందుతున్న ప్రపంచ సాంకేతిక ముఖచిత్రాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, అనేక కీలక రంగాల్లో సాంకేతిక చోటుచేసుకున్న పురోగతి పరంగా చూస్తే అగ్రగామి దేశాలకు దీటుగా భారత్ ప్రస్తుతం నిలిచిందన్నారు. జాతీయ క్వాంటమ్ మిషన్‌ను ఒక ఉదాహరణగా ఆయన చెబుతూ భారత్ నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా లక్ష్యాన్ని అనుకున్న కాలంలో సగం కన్నా తక్కువ వ్యవధి లోపలే సాధించిందన్నారు. ఎనిమిది సంవత్సరాల్లో 2,000 కిలోమీటర్ల సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ సంబంధిత మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసుకోవాలనుకొని, కేవలం మూడేళ్లలో 1,000 కి.మీ.ని దాటిందని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం భారత్‌ను భవిష్యత్కాల సాంకేతికత, వ్యూహాత్మక పరిశ్రమలకు సన్నద్ధపరిచే దిశగా అనేక సాహసిక, పరివర్తనాత్మక నిర్ణయాల్ని తీసుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. క్లౌడ్ ఆధారిత సేవల్ని అందించే విదేశీ సంస్థలకు పన్నులకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు ప్రకటించడం, జాతీయ పరిశోధన సంస్థ, సెమీకండక్టర్ మిషన్‌లతో పాటు అంతరిక్షం, పరమాణు ఇంధనం వంటి రంగాల్లో ప్రయివేటు సంస్థలు పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించడం వంటి విషయాల్ని మంత్రి ప్రస్తావించారు. ఈ సంస్కరణల్లో చాలావరకు సంస్కరణల్ని పరిశీలనకు స్వీకరించడమే కొన్నేళ్ల కిందట ఊహకు అందని విషయంగా భావించారని, అయితే భారత్ భావి ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక నాయకత్వానికి కీలకమైన రంగాల్లో త్వరత్వరగా ముందుకు సాగిపోయేందుకు కావలసిన రాజకీయ సంకల్పాన్ని చాటుకొందని ఆయన అన్నారు.
ప్రభుత్వం సాంకేతిక ప్రగతికి మాత్రమే మార్గాన్ని సుగమం చేయడం లేదని, పరిశ్రమ భాగస్వామ్యాన్ని వేగిరపరచడానికి వీలుగా తగిన ప్రణాళికల్ని కూడా రూపొందిస్తోందని మంత్రి చెప్పారు. ప్రయివేటు రంగంలో నూతన ఆవిష్కరణలు, డీప్-టెక్ సంబంధిత పరిశోధనల్ని ప్రోత్సహించే దిశగా ఇటీవల చేపట్టిన కొన్ని కార్యక్రమాలను ఆయన ఉదాహరిస్తూ సైన్స్, టెక్నాలజీ రంగం రూపేణా ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక రంగం కూడా దేశ నిర్మాణంలో సమాన భాగస్వాములుగా పనిచేస్తున్న ఒక సరికొత్త యుగానికి భారత్ సాక్షిగా నిలుస్తోందన్నారు.
డేటా సెంటర్ రంగంలో భారత భావి అభివృద్ధి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆ అంశాల్లో.. ఆటుపోట్లను తట్టుకుని నిలిచే సరఫరా వ్యవస్థలు, సుస్థిర ప్రాతిపదికన పనిచేయగలిగిన ఇంధన వ్యవస్థ, ఉన్నత టెలికమ్ అనుసంధానం, సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ, స్మార్ట్ కూలింగ్ సేవలతో పాటు అన్ని రంగాలకీ ఏకీకృత విధాన మద్దతు వంటివి భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. దేశంలో విధానపరమైన మద్దతు, ప్రయివేటు రంగ భాగస్వామ్యం.. వీటి మధ్య సామరస్యం అంతకంతకూ పెరుగుతూ, ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా ఆధారపడదగ్గ డిజిటల్ సేవల లభ్యత గల దేశాల్లో ఒకటిగా భారత్ మారగలిగేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పరిచిందని ఆయన అన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2264470)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7