పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్థానిక చర్యలతో ప్రపంచ ప్రభావం’ ఇతివృత్తంతో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 2026 నిర్వహణ...


జీవవైవిధ్య పరిరక్షణకు, ప్రజా భాగస్వామ్య చర్యలకు కట్టుబడి ఉన్నట్లు భారత్‌ వెల్లడి

జీవవైవిధ్య పరిరక్షణలో స్థానిక చర్యలు, ఏబీఎస్ విధానాలు, సామాజిక భాగస్వామ్య ప్రాధాన్యతను వివరించిన కేంద్ర పర్యావరణ మంత్రి

ప్రాజెక్ట్ చీతా ద్వారా ఆవాసాల పరిరక్షణ, శాస్త్రీయ వన్యప్రాణుల నిర్వహణ, పరిరక్షణ ప్రయత్నాల్లో సామాజిక భాగస్వామ్యం బలోపేతం: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 1:15PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి నేడు భోపాల్‌లోని భారతీయ అటవీ నిర్వహణ సంస్థ (ఐఐఎఫ్‌ఎం)లో జరిగిన ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 2026’ జాతీయ స్థాయి వేడుకలతోపాటు చిరుత సంరక్షణపై జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ‘ప్రపంచ ప్రభావం కోసం స్థానిక చర్యలు’ అంశంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది జీవవైవిధ్య పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పునరుద్ధరణ పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది.

 

ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ(ఎన్‌బీఏ),అంతర్జాతీయ వన్యమృగాల సంరక్షణ కూటమి (ఐబీసీఏ)లతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్, మధ్యప్రదేశ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ దిలీప్ అహిర్వార్ తదితర ప్రముఖులు  పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఎన్‌బీఏ, ఐబీసీఏ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు, జీవవైవిధ్య నిర్వహణ కమిటీల సభ్యులు, పరిశోధకులు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

సమావేశాన్ని ఉద్దేశించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ... దేశంలో పులుల రాష్ట్రంగా  గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్, దేశంలోనే జీవవైవిధ్య పరిరక్షణకు, వన్యప్రాణుల రక్షణకు ఒక ప్రధాన కేంద్రంగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి, పర్యావరణ భద్రతకు అండగా నిలిచే అడవులు, చిత్తడి నేలలు, నదీ పర్యావరణ వ్యవస్థలతో కూడిన రాష్ట్రంలోని గొప్ప పర్యావరణ వైవిధ్యాన్ని ఆయన ప్రస్తావించారు.

 

మధ్యప్రదేశ్‌లో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడాన్నిదేశ వన్యప్రాణి పరిరక్షణ ప్రయాణంలో కీలక విజయమని, ఇది పర్యావరణ పునరుద్ధరణకు, జీవవైవిధ్య పునరుజ్జీవనానికి ఒక ప్రతీకని అభివర్ణించారు. ‘ప్రాజెక్ట్ చీతా’ ద్వారా వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణ, శాస్త్రీయ వన్యప్రాణుల నిర్వహణ , పరిరక్షణ ప్రయత్నాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యాయని తెలిపారు.

 

జీవవైవిధ్య నిర్వహణ కమిటీలు, ప్రజల జీవవైవిధ్య రిజిస్టర్ల తయారీ ద్వారా మధ్యప్రదేశ్  జీవ వైవిధ్య పాలనను బలోపేతం చేయడంలో గణనీయమైన చర్యలు తీసుకుందని డాక్టర్ మోహన్‌ యాదవ్‌ పేర్కొన్నారు. దీని ద్వారా జీవ వనరులను పరిరక్షించుకోవడానికి స్థానిక ప్రజలకు సాధికారత లభించిందని అన్నారు.

 

కేంద్రమంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 2026 ఇతివృత్తమైన ‘స్థానిక చర్యలతో ప్రపంచ ప్రభావం’.. పర్యావరణ స్థిరత్వాన్ని, పర్యావరణ భద్రతను సాధించడం కోసం స్థానిక సంస్థలను, ప్రజలను బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యతను వివరిస్తుందని పేర్కొన్నారు. బలమైన స్థానిక చర్యలు, సామాజిక భాగస్వామ్యం, స్థిరమైన జీవనశైలి ద్వారా మాత్రమే అర్థవంతమైన ప్రపంచ ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన చెప్పారు.

 

ప్రపంచంలోని అత్యధిక జీవవైవిధ్యం కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌లో హిమాలయాలు, అడవుల నుంచి చిత్తడి నేలలు, గడ్డి మైదానాలు, ఎడారులు, తీరప్రాంత, సముద్ర పర్యావరణ వ్యవస్థల వరకు విభిన్న జీవావరణ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని సంపన్న జీవవైవిధ్య వారసత్వాన్ని, సంప్రదాయ పర్యావరణ విజ్ఞాన వ్యవస్థలను ఆయన ప్రస్తావించారు. పవిత్ర వనాలు , దేశీయ రకాలు, స్థానిక వంగడాలు, స్థానిక సంరక్షణ పద్ధతుల వంటి సామూహిక పరిరక్షణ సంప్రదాయాలు మనుషులకు, ప్రకృతికి మధ్య ఉన్న లోతైన సాంస్కృతిక, పర్యావరణ సంబంధాన్ని చాటిచెబుతున్నాయని తెలిపారు. 

 

పరిరక్షణ ఆలోచనా విధానం కేవలం ఏదో ఒక నిర్దిష్ట జీవజాతిపై మాత్రమే దృష్టి పెట్టే స్థాయి నుంచి మొత్తం జీవరాశుల పరిధిని, పరస్పరం అనసంధానించిన జీవావరణ వ్యవస్థలను రక్షించే స్థాయికి విస్తరించిందని మంత్రి పేర్కొన్నారు. మొక్కలు, జంతువులు  ఒంటరిగా మనుగడ సాగించలేవని, అవి సంక్లిష్టమైన, పరస్పరాధారిత పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఎక్కువగా గుర్తిస్తున్నారని చెప్పారు. సమగ్ర జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ద్వారా వాతావరణ మార్పులు వంటి సవాళ్లను తట్టుకునే ప్రకృతి స్థితిస్థాపకత, అనుకూలత మరింత బలోపేతమవుతాయని స్పష్టం చేశారు.

 

జీవవైవిధ్య సదస్సు, కున్మింగ్ మాంట్రియల్ ప్రపంచ జీవవైవిధ్య ఒప్పందం అమలు పట్ల భారత్‌ నిబద్ధతను శ్రీ యాదవ్ మరోసారి పునరుద్ఘాటించారు.జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు, జీవవైవిధ్య నిర్వహణ కమిటీల ద్వారా బలమైన, వికేంద్రీకృత సంస్థాగత పటిష్టతను జీవవైవిధ్య చట్టం 2002 ఏర్పరిచిందని ఆయన పేర్కొన్నారు.

 

జీవవైవిధ్య చట్టం, దాని నిబంధనలు, నియామకాల్లో ఇటీవల చేసిన సవరణలు పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయని, వ్యాపార సౌలభ్యాన్ని సులభతరం చేస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. దీనివల్ల స్థానిక వర్గాలకు పరిశ్రమల నుంచి తగిన ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. అందుబాటు, ప్రయోజనాల పంపిణీ విధానం ద్వారా సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ... దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు దాదాపు రూ.145 కోట్లు విడుదలయ్యాయని, దీనివల్ల సుమారు 11,000 జీవవైవిధ్య నిర్వహణ కమిటీలు లబ్ధి పొందాయని వెల్లడించారు. ఈ ఏబీఎస్ ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం ద్వారా గ్రామ స్థాయిలోని బీఎంసీలను మరింత ప్రోత్సహించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని మంత్రి కోరారు. ఇది జీవవైవిధ్య పరిరక్షణ దిశగా పనిచేయడానికి మరింతగా పటిష్టపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఖండం నుంచి మరో ఖండానికి ఒక పెద్ద మాంసాహార జంతువును తరలిస్తూ 2022లో ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ చీతా’ ప్రయాణం... పర్యావరణ పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణ, గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవనం పట్ల భారత్‌కు ఉన్న బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోందని శ్రీ యాదవ్ పేర్కొన్నారు. దేశ వాతావరణానికి చిరుతలు విజయవంతంగా అలవాటు పడటం, ఇక్కడ సంతానోత్పత్తి చేయడం, దీర్ఘకాలిక జంతు జాతుల పునరుద్దరణ, సహజ ఆవాసాల పునరుద్ధరణ ప్రయత్నాల్లో ప్రోత్సాహకరమైన పురోగతిని సూచిస్తున్నాయని అన్నారు. 

 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ... ఆహార భద్రత, నీటి భద్రత, ప్రజల జీవనోపాధి, వాతావరణ స్థితిస్థాపకత, స్థిరమైన అభివృద్ధితో జీవవైవిధ్య పరిరక్షణ  అంతర్గతంగా ముడిపడి ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిన పర్యావరణం కోసం జీవనశైలి(లైఫ్)తో పాటు, భారతీయ సంప్రదాయ పర్యావరణ వివేకం, పర్యావరణ హిత జీవనశైలి ప్రాధాన్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అన్ని రకాల చర్యలకు జీవవైవిధ్యంపై జరిగే చర్చలే పునాది అని స్పష్టం చేశారు.

 

జీవవైవిధ్య పర్యవేక్షణ, పర్యావరణ పునరుద్ధరణ, సుస్థిర వనరుల సేకరణ, పరిరక్షణ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిరక్షణ సంస్థలు, స్థానిక సమాజాల పాత్రను ఈ కార్యక్రమం ప్రస్తావించింది.

 

ఈ సందర్భంగా ఈ కింది ప్రచురణలు, కొత్త కార్యక్రమాలు, ప్రచార విధానాలను విడుదల చేశారు:

 

ఎ. ప్రత్యేకంగా రూపొందించిన మైస్టాంప్

 

బీ. సీబీడీకి సమర్పించిన 7వ జాతీయ నివేదిక ఆధారంగా భారత జీవ వైవిధ్య నివేదిక 2026: ముఖ్యాంశాలు

 

సీ. నాగోయా ప్రోటోకాల్‌పై భారత తొలి జాతీయ నివేదిక ఆధారంగా ఏబీఎస్ అమలులో భారత పురోగతి: ముఖ్యాంశాలు

 

డీ. ఏబీఎస్ ఎండ్-టు-ఎండ్ పోర్టల్

 

ఈ. అందుబాటు, ప్రయోజనాల పంపిణీపై రూపొందించిన చిత్రం

 

ఎఫ్. అమర్‌కంటక్ జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంపై రూపొందించిన చిత్రం

 

జీ. మధ్యప్రదేశ్‌లోని పవిత్ర వనాల పరిరక్షణపై రూపొందించిన చిత్రం

 

 

ఈ ప్రధాన కార్యక్రమానికి అనుబంధంగా వివిధ రాష్ట్రాల జీవవైవిధ్య బోర్డులు, జీవవైవిధ్య నిర్వహణ కమిటీలు, వివిధ ప్రభుత్వ అనుబంధ విభాగాలు తాము సాధించిన విజయాలను, వినూత్న కార్యక్రమాలను, జీవ ఆధారిత ఉత్పత్తులను ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ప్రదర్శించాయి. అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి, సమాజ నేతృత్వంలోని పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, జీవవైవిధ్య ఆధారిత సుస్థిర జీవనోపాధిని ప్రముఖంగా చాటడానికి ఈ ప్రదర్శన ఒక విలువైన వేదికగా నిలిచింది. ఇదే సందర్భంలో భోపాల్‌లోని ఐఐఎఫ్ఎమ్‌ ప్రాంగణంలో రాష్ట్ర అటవీ శాఖకు చెందిన 20 ద్విచక్ర వాహనాలను,వన్యప్రాణుల రక్షణ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

 

****


(రిలీజ్ ఐడి: 2264468) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Urdu , Bengali , Bengali-TR , English , हिन्दी , Gujarati , Tamil , Kannada