నిషేధిత నికోటిన్ ఉత్పత్తుల అక్రమ దిగుమతులపై చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ-సిగరెట్ (వేప్) స్మగ్లింగ్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) బహిర్గతం చేసింది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ఓడరేవులు, విమానాశ్రయాలు, ఐసీడీల్లో ఆపరేషన్లను చేపట్టి వీటిని వెలుగులోకి తీసుకొచ్చింది.
కస్టమ్స్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి అసత్యాలతో కూడిన ప్రమాణ పత్రాలను సమర్పించి దిగుమతి చేసుకున్న వివిధ అనుమానస్పద సామగ్రిని ఖచ్చితమైన సమాచారం ఆధారంగా డీఆర్ఐ నిఘా ఉంచి, గుర్తించింది. వీటిని పరీక్షించి రూ.120 కోట్లకు పైగా విలువైన దాదాపుగా 3,00,000 ఎలక్ట్రానిక్ సిగరెట్లు/వేప్‌లు స్వాధీనం చేసుకుంది. వీటిలో వివిధ బ్రాండ్లు, ఫ్లేవర్లు, రకాలకు చెందిన ఈ-సిగరెట్లు ఉన్నాయి.
ప్రతి దాడిలోనూ స్వాధీనం చేసుకున్న నిషేధిత ఈ-సిగరెట్లను ఫర్నీచర్, మెటల్ చెయిర్ విడి భాగాలు వంటి వస్తువుల మాటున దాచి చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేసినట్లు తేలింది.
ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పౌరులను ముప్పు నుంచి రక్షించేందుకు ఎలక్ట్రానిక్స్ సిగరెట్లు (ఉత్పత్తి, తయారీ, ఎగుమతి, దిగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ప్రకటనలు) నిషేధ చట్టం-2019 ప్రకారం ఎలక్ట్రానిక్ సిగరెట్లను, అన్ని ఎలక్ట్రానిక్స్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ (ఈఎన్‌డీఎస్)లను భారత్‌లో పూర్తిగా నిషేధించారు.