శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొత్త ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వ్యూహాత్మక శాస్త్ర, ఆవిష్కరణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్న భారత్, నార్వే
శుద్ధ ఇంధనం, తీరప్రాంత పవన శక్తి, సుస్థిరత, భౌగోళిక శాస్త్రాలు, విద్యాసంస్థల మధ్య సహకారాల్లో
అయిదు కీలక ఒప్పందాలపై నార్వేలో సంతకాలు చేసిన శాస్త్రీయ - పారిశ్రామిక పరిశోధన మండలి, కేంద్ర శాస్త్రీయ - పారిశ్రామిక పరిశోధన విభాగం
प्रविष्टि तिथि:
19 MAY 2026 12:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో.. శాస్త్ర సాంకేతిక రంగం, ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం.. భారత ప్రభుత్వ శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన విభాగం (డీఎస్ఐఆర్) సంస్థలు 2026 మే 18న ఓస్లో నగరంలో నార్వేకు చెందిన ప్రముఖ పరిశోధన, విద్య, పారిశ్రామిక సంస్థలతో వరుసగా పలు ముఖ్య ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్, డీఎస్ఐఆర్ సెక్రటరీ డాక్టర్ ఎన్. కలైసెల్వి నేతృత్వంలో.. భాగస్వామ్య నార్వేజియన్ సంస్థల సీనియర్ ప్రతినిధులతో కలిసి డీఎస్ఐఆర్/ సీఎస్ఐఆర్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిలో భారత్ - నార్వే సంబంధాలను విస్తృతం చేయడంతోపాటు.. సంస్థాగత భాగస్వామ్యాలు, అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వామ్యం, విద్యాపరమైన సహకారం, సుస్థిర వృద్ధి కార్యక్రమాలను పెంపొందించడం ఈ ఉమ్మడి భాగస్వామ్యాలు లక్ష్యం.
డీఎస్ఐఆర్/సీఎస్ఐఆర్ - నార్వే పరిశోధన మండలి (ఆర్సీఎన్) మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం.. పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించింది. ఈ ఒప్పందం ప్రకారం వాతావరణం, శుద్ధ ఇంధనం, సముద్రాలు, ఆరోగ్య రంగం సహా అంతర్జాతీయ సవాళ్లు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన అంశాల్లో ఉమ్మడి వర్క్‌షాప్‌లు, ఉమ్మడి పరిశోధన - అభివృద్ధి ప్రాజెక్టులు, శాస్త్రవేత్తలు, పరిశోధకుల పరస్పర పర్యటనలు, నిర్దిష్ట కార్యక్రమాల అమలు ఏర్పాట్లు, సమయానుకూల సమీక్ష విధానాలను చేపట్టాలని ప్రతిపాదించారు.
ఇరు సంస్థల మధ్య 2014లో కుదిరిన అవగాహన ఒప్పంద చట్రం ఆధారంగా.. నార్వేకు చెందిన ప్రముఖ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన స్టిఫ్టెల్సెన్ సింటెఫ్‌తో సహకార ఒప్పందంపైనా సీఎస్ఐఆర్ సంతకం చేసింది. జీవ ఆధారిత ప్రక్రియలు, పదార్థాలు, ఆవిష్కరణ హబ్‌లు, సముద్ర శక్తి (సముద్ర పవనాలతో విద్యుత్ సహా), హైబ్రిడ్ వ్యవస్థలు, కర్బన శోషణ, నిల్వ, వినియోగం, వ్యర్థాల పునరుద్ధరణ వంటి రంగాల్లో ఉమ్మడి పరిశోధన, ఆవిష్కరణల కార్యక్రమాల ద్వారా పునరావృత్త ఆర్థిక వ్యవస్థ, సుస్థిరత దిశగా పరివర్తనపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
సముద్ర ఇంధనం, సముద్రపు పవన ఇంధన రంగాలపైనా సీఎస్ఐఆర్, సింటెఫ్ అనుబంధ సంస్థల మధ్య ప్రాజెక్టు నిర్దిష్ట ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భారత్ నుంచి సీఎస్ఐఆర్ - స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్, సీఎస్ఐఆర్ - నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్, సీఎస్ఐఆర్ - నేషనల్ ఓషనోగ్రఫీ ఇనిస్టిట్యూట్, సీఎస్ఐఆర్ - ఫోర్త్ పారాడిగ్మ్ ఇనిస్టిట్యూట్ భాగస్వాములు కాగా.. నార్వే వైపు నుంచి సింటెఫ్ ఓషన్, సింటెఫ్ డిజిటల్, ఎఫ్ఎంఈ నార్త్విండ్, సింటెఫ్ కమ్యూనిటీ సంస్థలు పాల్గొంటున్నాయి. సముద్ర తీర పునరుత్పాదక ఇంధన సాంకేతికతల్లో దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ పునరుత్పాదక ఇంధన, కర్బన సమతౌల్య లక్ష్యాలకు సహకరించడం ఈ భాగస్వామ్య ముఖ్య ఉద్దేశం. నీటిపై తేలియాడే సముద్రపు పవన సాంకేతికతలు, విద్యుదుత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, సుస్థిరత, ఈసీజీ ప్రమాణాలు, ప్రామాణీకరణ, ప్రయోగాత్మక ప్రదర్శనలు, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధిపై ఈ ఉమ్మడి కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సీఎస్ఐఆర్ అందిస్తున్న నిధుల సాయం దాదాపు రూ. 3.41 కోట్లు.
‘‘పర్యావరణ హిత మార్పుల కోసం శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల సహకారం’’ శీర్షికతో ఒక ఉమ్మడి ఆసక్తుల ప్రకటనపై కూడా సీఎస్ఐఆర్, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్, నార్వేజియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలు సంతకాలు చేశాయి. సుస్థిరత, పునరావృత్త ఆర్థిక వ్యవస్థ, సముద్ర శాస్త్రం, సాంకేతికత, ఆరోగ్య రక్షణ, పౌర, మౌలిక సదుపాయాల ఇంజినీరింగ్ సాంకేతికతలపై ఈ ప్రకటన ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ సహకారంలో భాగంగా.. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర పర్యటనలు, ఉమ్మడి పరిశోధనలు, విద్యాపరమైన మార్పిడులు, సెమినార్లు, ఉమ్మడి విద్యా కార్యక్రమాలను చేపట్టాలని ప్రతిపాదించారు.
భారత్‌లో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భౌగోళిక శాస్త్ర ఆధారిత పరిష్కారాలను అందించడం కోసం శాస్త్రీయ, వాణిజ్య సహకారాన్ని నెలకొల్పే దిశగా.. సీఎస్ఐఆర్ - జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ, ఎమరాల్డ్ జియోమోడలింగ్ మధ్య అయిదేళ్ల అవగాహన ఒప్పందం మరో ముఖ్య పరిణామం. ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో భాగంగా ఉమ్మడి పరిశోధన - అభివృద్ధి ప్రాజెక్టులు, భూభౌతిక సర్వేల ప్రణాళిక, డేటా విశ్లేషణ, మోడలింగ్, సాంకేతిక సలహా మద్దతు, శాస్త్రీయ కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపట్టనున్నారు.
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో భారత్ - నార్వే సహకారంలో ఈ ఒప్పందాలు ఒక కీలక మైలురాయి. రెండు దేశాల మధ్య ఉమ్మడి పరిశోధన, ఆవిష్కరణల ఆధారిత సుస్థిరాభివృద్ధి, దీర్ఘకాలిక సంస్థాగత భాగస్వామ్యాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2263254)
आगंतुक पटल : 56