పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర వ్యాప్తంగా తగినంత మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 5:53PM by PIB Hyderabad

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మహారాష్ట్రవ్యాప్తంగా తగినంత మొత్తంలో ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ కంపెనీలు (బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్) వినియోగదారులకు తెలియజేశాయి. ఈ మేరకు మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ (చమురు పరిశ్రమ) శ్రీ మిహిర్ గణేష్ జోషి ప్రకటన వెలువరించారు. నిరంతరం ఇంధన సరఫరా ప్రక్రియలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని… ఎలాంటి అంతరాయం లేని సరఫరాను కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు, సరఫరా పరిస్థితి

పెట్రోల్ - డీజిల్

మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులతో పాటు చమురు కంపెనీల నిల్వ కేంద్రాల్లో కూడా తగినంత మొత్తంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భరోసా ఇచ్చాయి. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధనం లభించేలా చూసేందుకు పెట్రోల్ బంకుల్లోని నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు క్రమంతప్పకుండా పర్యవేక్షిస్తూ నిరంతరం కొత్త నిల్వలను పునరుద్ధరిస్తున్నాయి.

మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ డిమాండ్ ఒక్కసారిగా తీవ్రంగా పెరగడాన్ని గమనించాయి. ఈ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇంధనాన్ని పూర్తిగా సరఫరా చేశాయి. 2026 మే మొదటి పక్షం రోజుల్లో డీజిల్ డిమాండ్‌లో 19.66 శాతం, పెట్రోల్ డిమాండ్‌లో 20.39 శాతం వృద్ధి నమోదైంది. 2026 మే మొదటి పక్షం రోజుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 267 టీకేఎల్ పెట్రోల్, 502 టీకేఎల్ డీజిల్‌ సరఫరా అయింది. రాష్ట్రవ్యాప్తంగా సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నందున వినియోగదారులు ఆందోళనతో ముందస్తుగా కొనుగోళ్లు చేయొద్దని అభ్యర్థిస్తున్నారు. 

ఎల్‌పీజీ

మహారాష్ట్రలో ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (పీఎస్‌యూ ఓఎంసీ) పరిధిలో మొత్తం సుమారు 32,995 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయి. వినియోగదారులకు గ్యాస్ సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్న నిల్వలను కూడా క్రమం తప్పకుండా పునరుద్ధరిస్తున్నారు. 

గృహ వినియోగ ఎల్‌పీజీ:

గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల బుకింగ్‌ల ప్రకారం గ్యాస్ పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. అందరికీ సమానంగా సిలిండర్లు పంపిణీ అయ్యేలా చూసేందుకు బుకింగ్ వ్యవధిపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం రెండు బుకింగ్‌ల మధ్య పట్టణ వినియోగదారులకు 25 రోజులు, గ్రామీణ వినియోగదారులకు 45 రోజుల వ్యవధి ఉండాలి. ఎల్‌పీజీ రీఫిల్స్ ఎప్పటికప్పుడు నేరుగా వినియోగదారుల ఇళ్లకే పంపిణీ అవుతాయని చమురు కంపెనీలు భరోసా ఇచ్చాయి.

సురక్షితమైన, ధ్రువీకరించిన సరఫరాను నిర్ధారించడానికి 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ) వెరిఫికేషన్ అనేది తప్పనిసరి ప్రక్రియగా కొనసాగుతోంది. ప్రస్తుతం 90 శాతానికి పైగా ఎల్‌పీజీ రీఫిల్స్ డీఏసీ లేదా ఓటీపీ ధ్రువీకరణ ద్వారానే పంపిణీ అవుతున్నాయి. వినియోగదారులు సిలిండర్ బుకింగ్‌ల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని, అనవసరంగా ఎల్‌పీజీ షోరూమ్‌లకు వెళ్లొద్దని సూచించారు.

గృహేతర, వాణిజ్య ఎల్‌పీజీ

ఉద్రిక్తతలకు ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 60 శాతం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా అందుబాటులో ఉంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, స్మశానవాటికలు, సామాజిక సంరక్షణ సంస్థల వంటి ప్రాధాన్యత రంగాలకు మాత్రం 100 శాతం సరఫరా కొనసాగుతోంది. 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల రీఫిల్‌లను పంపిణీ చేస్తున్నారు. గత వారంలో సగటున రోజుకు సుమారు 23,000 ఎఫ్‌టీఎల్ సిలిండర్లను సరఫరా చేశారు. 

పీఎన్‌జీ

సరఫరా విషయంలో ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితి, పీఎన్‌జీ మౌలిక సదుపాయాలను విస్తరించాల్సిన అత్యవసర అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని నగరపాలక సంస్థలు, పీడబ్ల్యూడీ, నీటిపారుదల శాఖ, ఇతర సంబంధిత అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న 'సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్' (సీజీడీ) పైప్‌లైన్ పనులకు సంబంధించిన దరఖాస్తులకు మహారాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చి 27న 'మంజూరైనట్లుగా భావించే అనుమతి’ని (డీమ్డ్ పర్మిషన్) జారీ చేసింది.

మహారాష్ట్రలో ప్రస్తుతం సుమారు 44 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. ప్రపంచ ఇంధన అంతరాయాల నేపథ్యంలో పీఎన్‌జీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 24న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా.. రాష్ట్రవ్యాప్తంగా పీఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక 'ఫాస్ట్-ట్రాక్ విస్తరణ డ్రైవ్'ను ప్రారంభించింది. క్షేత్రస్థాయి అమలును సమీక్షించడానికి, నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసేందుకు మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్‌లతో (చమురు పరిశ్రమ) కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆహార - పౌర సరఫరాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి 2026 ఏప్రిల్ నుంచి వారానికోసారి రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో జిల్లా యంత్రాంగాలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలు పాల్గొంటున్నాయి.

నమోదిత హౌసింగ్ సొసైటీలతో పాటు ఇంకా నమోదు కాని లేదా ప్రతిపాదిత హౌసింగ్ సొసైటీల నుంచి కూడా పీఎన్‌జీ కనెక్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వ్యక్తిగత గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించిన భవనాల్లో నివసించే వారు కూడా వీలును బట్టి సామూహికంగా లేదా వ్యక్తిగతంగా దరఖాస్తులను సమర్పించొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలు, వాటి అధీకృత డిస్ట్రిబ్యూటర్లు ఏకకాలంలో విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

2026 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 94,220 కొత్త పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు. దేశంలోనే అత్యధిక కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా నిలిచింది. 

మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా సాగేలా చూసేందుకు, నల్లబజారు- అక్రమ నిల్వలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు క్రియాశీలక చర్యలు చేపట్టింది. తనిఖీలు, దాడులు నిర్వహించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో నిఘా, మొబైల్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగ గ్యాస్‌ను చట్టవిరుద్ధంగా ఉపయోగించటంతో పాటు అక్రమ నిల్వలు- నల్లబజారు విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై నిత్యావసరాల చట్టం- 1955 కింద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

2026 మే 17 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,494 దాడులు జరిగాయి. వీటిలో 4,449 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీలో అక్రమాలకు పాల్పడినందుకు 70 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 52 మందిని అరెస్టు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరా సజావుగా, క్రమం తప్పకుండా జరిగేలా చూసేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్), గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, సీజీడీ కంపెనీలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు.

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కిరోసిన్ పంపిణీ మహారాష్ట్రలో ప్రారంభమైంది. గడ్చిరోలి, గోందియా, నాసిక్, నాగ్‌పూర్, పాల్ఘర్, థానే, ధారాశివ్, సోలాపూర్, కొల్హాపూర్, ఛత్రపతి శంభాజీనగర్, బీడ్, రాయ్‌గఢ్ జిల్లాల్లో మొత్తం 268 కేఎల్ కిరోసిన్‌ పంపిణీ అయింది. 

పైన పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలెవరూ ఆందోళనతో ముందస్తు కొనుగోళ్లు లేదా పెట్రోలియం ఉత్పత్తులను అక్రమంగా నిల్వ చేయొద్దని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సరైన పద్ధతిలో సజావుగా సాగేలా కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2262642) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil