పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· దేశంలోని ఎరువుల మొత్తం నిల్వలు సంతృప్తికరం... ప్రధాన ఎరువుల గరిష్ఠ రిటైల్ ధరల్లో మార్పు లేదు
· హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల నుంచి మే, జూన్ నెలల్లో భారతీయ ఓడరేవులకు చేరుకోవడానికి వీలుగా సుమారు 13.5 ఎల్‌ఎంటీల డీఏపీ, 7 ఎల్‌ఎంటీల ఎన్‌పీకే ఎరువులను సేకరించిన ప్రభుత్వం
· నిన్న పరిశ్రమ వ్యాప్తంగా దాదాపు 99 శాతానికి పెరిగిన ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు
· గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 1.90 లక్షల 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయం
· 2026 మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు 7.37 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా... మరొక 2.76 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటు... కొత్తగా నమోదు చేసుకున్న 7.76 లక్షల మంది వినియోగదారులు
· గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి గత 96 గంటల్లో వచ్చిన 61 మందితో కలిపి ఇప్పటివరకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న 3,217 మందికి పైగా భారతీయ నావికులు
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం
· అక్కడి భారతీయ రాయబార కార్యాలయాలు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి కాన్సులర్ సహాయాన్ని అందించడంతో పాటు భారత్‌కు తిరిగి రావాలనుకునే వారి అభ్యర్థనలను త్వరితగతిన పరిశీలిస్తూ సహాయం అందిస్తోన్న ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 5:52PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని అందించే చర్యలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జాతీయ మీడియా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- విమానయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు.. ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని అందించారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కూడా ఎరువుల నిల్వ, లభ్యతకు సంబంధించిన తాజా విషయాలను ఈ సమావేశంలో వెల్లడించింది.
ఎరువుల నిల్వల పరిస్థితి, లభ్యత
· దేశంలో మొత్తం ఎరువుల నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి.
· 2026 ఖరీఫ్ సీజన్ కోసం 390.54 ఎల్ఎంటీల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ (డీఏ-ఎఫ్‌డబ్ల్యూ) అంచనా వేసింది. ఇవాల్టి వరకు సుమారు 200.98 ఎల్ఎంటీ (51 శాతం కంటే ఎక్కువ) నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇది సాధారణంగా ఉండే స్థాయి కంటే 33 శాతం ఎక్కువ. మెరుగైన ప్రభుత్వ ప్రణాళిక, ముందస్తు నిల్వ, సమర్థవంతమైన రవాణా నిర్వహణకు ఇది నిదర్శనంగా ఉంది.
· ప్రధాన ఎరువుల గరిష్ఠ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
· యుద్ధం తర్వాత ఎరువుల దేశీయ ఉత్పత్తి, దిగుమతి( లక్షల టన్నులలో):
|
ఎరువు
|
సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి
|
సంక్షోభం తర్వాత భారత ఓడరేవులకు వచ్చిన దిగుమతులు
|
|
యూరియా
|
52.1
|
13.29
|
|
డీఏపీ
|
7.03
|
0.88
|
|
ఎన్‌పీకేలు
|
17.33
|
4.09
|
|
ఎస్‌ఎస్‌పీ
|
9.76
|
0
|
|
ఎంఓపీ
|
0
|
3.49
|
|
మొత్తం
|
86.2
|
21.8
|
· సంక్షోభం తలెత్తిన తర్వాత దేశీయ ఎరువుల ఉత్పత్తి 86.2 ఎల్‌ఎంటీగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఉత్పత్తి 93 ఎల్‌ఎంటీలుగా ఉంది. సంక్షోభం నెలకొన్న తర్వాత దాదాపు 108 ఎల్‌ఎంటీల ఎరువులు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.
· మే, జూన్ నెలల్లో భారతీయ ఓడరేవులకు చేరుకోవడానికి వీలుగా హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల నుంచి సుమారు 13.5 ఎల్‌ఎంటీల డీఏపీ, 7 ఎల్‌ఎంటీల ఎన్‌పీకే ఎరువులను భారత్ కొనుగోలు చేసింది.
· టీఎస్‌పీ, అమ్మోనియం సల్ఫేట్ కోసం గ్లోబల్ టెండర్- భారతీయ ఎరువుల కంపెనీలు సంయుక్తంగా 4 ఎల్‌ఎంటీల టీఎస్‌పీ, 3 ఎల్‌ఎంటీల అమ్మోనియం సల్ఫేట్ కొనుగోలు కోసం ఒక సమగ్ర అంతర్జాతీయ టెండర్‌ను జారీ చేశాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉండే సీజన్‌లో తగినంత లభ్యతను నిర్ధారించడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.
· అమ్మోనియా, సల్ఫర్ కోసం గ్లోబల్ టెండర్- భారతీయ ఎరువుల కంపెనీలు సంయుక్తంగా 5.36 ఎల్‌ఎంటీల అమ్మోనియా, 5.94 ఎల్‌ఎంటీల సల్ఫర్ కొనుగోలు కోసం ఒక సమగ్ర అంతర్జాతీయ టెండర్‌ను జారీ చేశాయి. ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉండే సీజన్‌లో తగినంత లభ్యత ఉండేలా చూసుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.
· యూరియా, పీ-కే ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల లభ్యతను ఎరువుల శాఖ క్రమంతప్పకుండా సమీక్షిస్తోంది.
· కంపెనీలు సమర్పించే అన్ని సబ్సిడీ బిల్లులను ఎరువుల శాఖ (డీఓఎఫ్) వారం వారం క్రమంతప్పకుండా చెల్లిస్తోంది.
· దేశంలో ఎరువుల తగినంత లభ్యతను నిర్ధారించడానికి ఇప్పటివరకు 'ఉన్నతాధికార మంత్రుల బృందం' (ఈజీఓఎస్) 9 సమావేశాలను నిర్వహించింది. ఎరువుల లభ్యతలో ఎదురైన చాలా సమస్యలను ఈ బృందం విజయవంతంగా పరిష్కరించింది.
· భారతదేశపు ఎరువుల భద్రత చక్కటి నిర్వహణలో పటిష్ఠతతో స్థిరంగా ఉంది. అన్ని ప్రధాన ఎరువుల లభ్యత వాటి అవసరానికి మించి అందుబాటులో ఉంటోంది.
ఇంధన సరఫరా, లభ్యత
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.. ఇంధన సరఫరా విషయంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాలు:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
· వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
· ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
· పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
· ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్పీజీ, గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
· వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
· ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
· 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 6950 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు.
· దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు, అక్రమ నిల్వలు- నల్లబజారు విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారులు గత 4 రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 2,800 పెట్రోల్ బంకులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
· ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 428 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 80 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.
ఎల్‌పీజీ సరఫరా
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి:
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
· ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు 99 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 95 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు డీఏసీ వస్తుంది.
· గత 4 రోజుల్లో దాదాపు 1.69 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు గాను సుమారు 1.72 కోట్ల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ అయ్యాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా... కేటాయింపు చర్యలు
· సంస్కరణ-అనుసంధానిత 10 శాతం కేటాయింపు సహా మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి మునుపటికి స్థాయిలో సుమారు 70 శాతానికి పెంచారు.
· గత నాలుగు రోజుల్లో సుమారు 1.9 లక్షల మేర 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
· దేశంలో ఏప్రిల్ 3 నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి 13,800కి పైగా అవగాహన శిబిరాలను నిర్వహించి, సుమారు 2.22 లక్షల దాకా సిలిండర్లను విక్రయించాయి.
· నిన్న ఒక్క రోజునే 98 శిబిరాల నిర్వహణ ద్వారా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు దాదాపు 2,229 దాకా అమ్ముడయ్యాయి.
· ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో నియమించిన త్రిసభ్య కమిటీ నిరంతరం రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సంప్రదిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్పీజీ విక్రయ ప్రణాళికను ఖరారు చేస్తుంది.
· ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటిదాకా 1,08,753 టన్నుల వాణిజ్య ఎల్పీజీ విక్రయించారు.
· గడచిన నాలుగు రోజుల్లోనే 25,204 టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీని విక్రయించారు.
· గత నాలుగు రోజుల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సుమారు 888 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని విక్రయించాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· డీ-పీఎన్జీ, సీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
· సీజీడీ నెట్వర్క్ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థల కోసం పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.
· ఐజీఎల్, ఎమ్జీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
· నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్లైన్లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
· డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
· పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.
· ఎమ్వోఈఎఫ్సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్‌పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
· మార్చి 2026 నుంచి, సుమారు 7.37 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్సరఫరా ప్రారంభమైంది. అదనంగా 2.76 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 10.13 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్ల కోసం సుమారు 7.76 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
· 17.05.2026 వరకు 58,100 కంటే ఎక్కువ మంది పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు నిల్వలు, రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి.
· గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్కు పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3 & సీ4 స్ట్రీమ్‌ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలనూ భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతించింది.
· ఔషధ రంగం, రసాయనాలు-పెట్రో కెమికల్స్ విభాగం, పరిశ్రమలకు ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య విభాగం ద్వారా అందిన అభ్యర్థనల ఆధారంగా... ఔషధ, రసాయన రంగ కంపెనీలకు ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1120 మెట్రిక్ టన్నుల కేటాయింపు చేశారు.
· 2026 మే 1వ తేదీ నుంచి ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు 8,730 మెట్రిక్ టన్నులకు పైగా సీ3-సీ4 మాలిక్యుల్స్ (ప్రొపైలీన్, బ్యూటైలీన్లతో కూడినవి), 3,420 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు
· దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్లెట్లు యధావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను అధిక ధరల నుంచి ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
· 15.05.2026 తేదీ గల గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 23 నుంచి రూ. 16.50 కు, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 33 నుంచి రూ. 16 కు తగ్గించింది. అంతేకాకుండా పెట్రోల్పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 3 గా విధించింది.
· దేశంలోని అన్ని పెట్రోలు పంపుల్లో పెట్రోలు, డీజిలు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
· పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది విషయాలను పేర్కొన్నది:
· నౌకా తాజా సమాచారం: మార్షల్ దీవుల జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక 'సైమి'... 19,965 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కు రవాణా చేస్తోంది. అందులో 21 మంది విదేశీ సిబ్బంది ఉన్నారు. ఈ నౌక 2026 మే 13న 'స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్'ను సురక్షితంగా దాటింది. ఇది మే 16 అర్దరాత్రి కాండ్లా రేవుకు చేరుకుంది. ప్రస్తుతానికి మొత్తం సరుకును దించడం పూర్తి అయ్యింది.
· నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,, భారత రాయబార కార్యాలయాలు,సముద్రయాన భాగస్వాములతో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 96 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలు లేదా భారతీయ సిబ్బందితో కూడిన విదేశీ నౌకలకు సంబంధించి ఎటువంటి సంఘటన జరగలేదు.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి 9702 కాల్లు, 21,312 కంటే ఎక్కువ ఈమెయిళ్లను నిర్వహించింది. గత 96 గంటల్లో 436 కాల్లు, 996 ఈమెయిళ్లూ అందాయి.
· డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 96 గంటల్లో స్వదేశానికి వచ్చిన 61 మంది సహా... ఇప్పటివరకు మొత్తం 3217 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.
· దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
· గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది:
· పరస్పర సమాచార మార్పిడి, మరింత మెరుగైన చర్యల కోసం... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
· విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయి. భారతీయ పౌరులు, వారి కుటుంబాల సందేహాలను నివృత్తి చేస్తున్నాయి.
· భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24x7 హెల్ప్లైన్లను నిర్వహిస్తున్నాయి. భారత పౌరులకు సకాలంలో, చురుగ్గా సేవలందిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతోనూ అవి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయులకు సాయమందించేలా తీసుకుంటున్న వివిధ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
· స్థానిక భారతీయులతో భారతీయ రాయబార కార్యాలయాలు చురుగ్గా మమేకమై ఉన్నాయి. ఈ ప్రాంతంలోని వివిధ భారతీయ సమాజ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ కంపెనీలతో ఈ ఆందోళనలను పరిష్కరించడం కోసం నిరంతరం చర్చిస్తున్నాయి.
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాయబార కార్యాలయాలు వారికి పూర్తి సహాయాన్ని అందిస్తున్నాయి. స్థానిక అధికారులు, సంస్థలతో సమన్వయం, కాన్సులర్ సాయాన్ని అందించడం, వారు భారత్కు తిరిగి రావాలన్న అభ్యర్థనలకు సాయమందించడం వంటివి చేస్తున్నారు.
· ఈ ప్రాంతం నుంచి భారత్లోని వివిధ ప్రదేశాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తంగా విమానయాన పరిస్థితి మెరుగుపడుతోంది.
· యూఏఈ గగనతలం తెరిచి ఉంది. భారత్, యూఏఈ విమానయాన సంస్థలు అక్కడి నుంచి భారత్లోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతున్నాయి.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని వివిధ ప్రాంతాలకు విమాన సేవలు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఖతార్ ఎయిర్వేస్ సంస్థలు ఖతార్ నుంచి భారత్లోని వివిధ ప్రదేశాలకు విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
· కువైట్ గగనతలం తెరిచి ఉంది. కువైట్ నుంచి భారత్కు జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ విమానాలను నడుపుతున్నాయి.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, గల్ఫ్ ఎయిర్ సంస్థలు బహ్రెయిన్ నుంచి భారత్లోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతున్నాయి.
· ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. వివిధ ప్రాంతాలకు పరిమిత విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారత్కు తదుపరి ప్రయాణం కోసం దీనిని ఉపయోగించవచ్చు.
· ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్కు ప్రయాణించవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో వెనక్కి రావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఇప్పటివరకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం.. భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,551 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్లేందుకు సౌకర్యం కల్పించింది.
· ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్కు ప్రయాణించకుండా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది మరియు ఇప్పటికే అక్కడ ఉన్నవారిని భారత రాయబార కార్యాలయం మద్దతుతో తిరిగి రావాలని కోరింది. ఇప్పటివరకు, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,551 మంది భారత పౌరులు ఇరాన్ నుండి బయటకు రావడానికి సౌకర్యం కల్పించింది.
· ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతం నుంచి గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు తిరిగిప్రారంభమయ్యాయి. భారత్కు తదుపరి ప్రయాణం కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2262638)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam