ప్రధాన మంత్రి కార్యాలయం
రవీంద్రనాథ్ ఠాగూర్ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక బహుమతులను ఇచ్చిపుచ్చుకున్న భారత్, స్వీడన్ ప్రధానులు
నాడు పోస్టు చేయడమైనది:
17 MAY 2026 11:18PM by PIB Hyderabad
నోబెల్ బహుమతి గ్రహీత, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని స్మరించుకుంటూ స్వీడన్ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు.
స్వీడన్ ప్రధాని క్రిస్టెర్సన్ అందించిన బహుమతిలో ఒక పెట్టె ఉంది. అందులో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వహస్తాలతో రాసిన రెండు నీతివాక్యాల (ఎపిగ్రామ్స్) ప్రతిరూపాలు, వాటి గురించిన చిన్న వివరణాత్మక పాఠ్యం, 1921లో ఉప్సలా విశ్వవిద్యాలయ సందర్శన సందర్భంగా గురుదేవ్ ఠాగూర్ దిగిన ఒక ఛాయాచిత్రం ఉన్నాయి. ఇటీవల స్వీడిష్ నేషనల్ ఆర్కైవ్స్‌లో కనుగొన్న ఈ అసలు ప్రతులను, 1921, 1926లలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వీడన్ పర్యటించిన సమయంలో స్వయంగా రాశారు.
ప్రధానమంత్రి శ్రీ మోదీ స్వీడన్ ప్రధానికి రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల సంకలనాన్ని, శాంతినేతన్ నుంచి ప్రత్యేకంగా హస్తకళతో తయారుచేసిన ఒక బ్యాగ్ ను బహుమతిగా ఇచ్చారు. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించి వారిని బలోపేతం చేయడం కోసం గురుదేవ్ ఎంపిక చేసిన నమూనాలతో ఈ బ్యాగ్ ను రూపొందించారు. కళ అనేది కేవలం ప్రదర్శనశాలలకే పరిమితం కాకూడదని, రోజువారీ వస్తువులకు జీవం పోస్తూ, మేధోపరమైన ఆలోచనలకు, నిత్య జీవిత వినియోగానికి మధ్య వారధిగా నిలవాలనే ఠాగూర్ తత్వాన్ని ఈ బ్యాగ్ ప్రతిబింబిస్తుంది.
1913లో నోబెల్ బహుమతిని అందుకోవడానికి గురుదేవ్ ఠాగూర్ స్వీడన్ వెళ్ళలేకపోయినప్పటికీ, 1921లో ఆయన స్వీడన్‌ను సందర్శించినప్పుడు ఐదవ రాజు గుస్తావ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ బహుమతులు భారత్, స్వీడన్ దేశాల మధ్య ఉన్న ఉమ్మడి సాంస్కృతిక, మేధోపరమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ చిరస్మరణీయ వారసత్వానికి నివాళి అర్పిస్తాయి. ఈ బహుమతుల మార్పిడి, 1926లో గురుదేవ్ స్వీడన్‌లో చేసిన చారిత్రక పర్యటన శతాబ్ది ఉత్సవాల సందర్భంతో కలసి రావడం విశేషం.
***
(రిలీజ్ ఐడి: 2262218)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11