ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
రాజస్థాన్ లో తొలి సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటు
భీవాడీలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సహస్ర సెమీకండక్టర్స్
చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో భారతదేశంలోనే మొట్టమొదటి ప్లాంట్
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సెమీకండక్టర్ పరిశ్రమలోకి రాజస్థాన్ ప్రవేశించడాన్ని అభినందించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
సలార్‌పూర్‌లో ఎల్సినా అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను (ఈఎంసీ) కూడా ప్రారంభించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 6:13PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని భివాడీకి చెందిన ఖుష్ఖేరా పరిధిలోని సలార్‌పూర్‌లో ఎల్సినా అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌తో (ఈఎంసీ) పాటు సహస్ర సెమీకండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన 'సెమీకండక్టర్ ఏటీఎంపీ/ఓశాట్' ప్లాంట్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ.. కేంద్ర పర్యావరణ, అటవీ- వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్ల రంగంలో భారతదేశాన్ని ప్రపంచ ప్రధాన కేంద్రంగా మార్చే ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి దూరదృష్టితో కూడిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలే ఈ ప్రగతికి ప్రధాన చోదక శక్తులుగా నిలుస్తున్నాయి.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన శ్రీ అశ్వినీ వైష్ణవ్.. రాజస్థాన్ రాష్ట్రానికి ఇదొక చారిత్రాత్మక రోజని కొనియాడారు. భౌగోళిక రాజకీయ కోణంలో అంతర్జాతీయంగా అత్యంత వ్యూహాత్మకమైన సెమీకండక్టర్ పరిశ్రమలోకి రాజస్థాన్ అడుగుపెట్టడం విశేషమని ఆయన అన్నారు.
గడిచిన 12 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్ సాధించిన వేగవంతమైన పురోగతిని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ రంగంలో దేశీయ ఉత్పత్తి 6 రెట్లు పెరిగి దాదాపు రూ. 13 లక్షల కోట్లకు చేరుకుందని.. ఎగుమతులు కూడా సుమారు రూ. 4.24 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు భారతదేశపు అగ్రగామి ఎగుమతి వస్తువుగా అవతరించాయని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాలు రెండింటినీ ప్రత్యేక 'ఫోకస్ రంగాలు'గా గుర్తించడమే ఈ విజయానికి కారణమని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈసీఎంఎస్ (ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్), ఈఎంసీ (ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్), ఐఎస్ఎం (ఇండియా సెమీకండక్టర్ మిషన్), పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్) వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి క్రమబద్ధమైన విధానంలో అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2026 మార్చిలో 'రాజస్థాన్ సెమీకండక్టర్ విధానాన్ని' తీసుకొచ్చిందని చెప్పారు. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న జోన్‌ను ఒక భారీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. గతంలో భివాడీ ప్రాంతం ప్రధానంగా ఆటోమొబైల్ రంగానికి మాత్రమే ప్రసిద్ధి చెందిందని.. అయితే ఇప్పుడు ఇక్కడ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఎల్సినా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)
భివాడీలోని ఈ క్లస్టర్‌ను రూ. 46.09 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 50.3 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఈఎంసీ పథకం కింద రూ. 20.24 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.
ఈ క్లస్టర్‌ను ఎల్సినా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసింది. ఇది ఎల్సినా ఆధ్వర్యంలో పనిచేసే ఎంఎస్ఎంఈ పరిశ్రమల ప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఒక ప్రత్యేక సంస్థ.
ఈ క్లస్టర్‌లో అంతరాయం లేని విద్యుత్, నీటి సరఫరా, అంతర్గత రహదారులు, కేంద్రీకృత పరిపాలనా వసతులు, టెస్టింగ్- శిక్షణ కేంద్రాలతో పాటు స్మార్ట్ తరగతి గదులు, ల్యాబొరేటరీలతో కూడిన ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రం వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ క్లస్టర్ జాతీయ రాజధాని ప్రాంతానికి సమీపంలో మంచి రోడ్డు, రైలు, వైమానిక రవాణా అనుసంధానంతో వ్యూహాత్మకంగా ఏర్పాటైంది. ఈ అనుకూలతల కారణంగా ఈ క్లస్టర్ భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు.
ఈ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో (ఈఎంసీ) రూ. 1,200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు 20 కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఈ కంపెనీలు సెమీకండక్టర్ ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఎయిర్ కండిషనర్లు, ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికతలు, ఈవీ విడిభాగాలు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాలలో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ క్లస్టర్‌లో పదిహేను కంపెనీలు రూ. 900 కోట్లకు పైగా మొత్తం పెట్టుబడులతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇవి 2,700 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి.
ఈ క్లస్టర్‌లో ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన కంపెనీలలో ఐసాన్ ఫియెమ్ ఇండస్ట్రీస్, ఈ-ప్యాక్ డ్యూరబుల్, సహస్ర సెమీకండక్టర్, సహస్ర ఎలక్ట్రానిక్స్, వరద గ్రీన్ ఎనర్జీ, దుగ్గర్ పవర్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి.
సెమీకండక్టర్ ఏటీఎంపీ/ఓశాట్ ప్లాంట్
సహస్ర సెమీకండక్టర్స్ ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ ప్లాంట్ సెమీకండక్టర్ చిప్‌ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎస్ఎంఈ) కావడం విశేషం.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) 'ఎస్‌పీఈసీఎస్ (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్స్)' పథకం కింద రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 57,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్‌లో అత్యాధునిక 'క్లాస్ 10కే, 100కే పరిశుభ్రమైన గదులు' ఉన్నాయి. ఈ ప్లాంట్‌లో మైక్రో ఎస్డీ, ఫ్లాష్ స్టోరేజ్ వంటి ఉత్పత్తుల కోసం మెమరీ చిప్‌లతో పాటు ఎల్ఈడీ డ్రైవర్ ఐసీలు, ఈ-సిమ్‌లు, ఆర్‌ఎఫ్‌ఐడీ ఉత్పత్తుల ప్యాకేజింగ్ పనులను చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఈ ప్లాంట్ ఏటా 60 మిలియన్ల సెమీకండక్టర్ యూనిట్లను ప్యాకేజింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే ఎస్‌పీఈసీఎస్ పథకం మద్దతుతో ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 43 మిలియన్ యూనిట్లుగా ఉంటుందన్న అంచనా ఉంది. రాబోయే 2-3 ఏళ్లలో దీనిని ఏటా దాదాపు 400 నుంచి 600 మిలియన్ యూనిట్లకు పెంచాలని సంస్థ యోచిస్తోంది.
ఈ ప్లాంట్ ఇప్పటికే మొత్తం ఉత్పత్తిలో 60 శాతానికి పైగా భాగాలను అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, తూర్పు యూరప్ దేశాలు, చైనా, నేపాల్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.
ఈ ప్లాంట్ ఇప్పుడు ఎల్‌ఈడీ డ్రైవర్ చిప్‌లు, ఇతర సెమీకండక్టర్ ఉత్పత్తులతో పాటు సొంతంగా ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఈఎస్‌ఎస్‌సీఐ, ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల భాగస్వామ్యంతో సెమీకండక్టర్ ప్యాకేజింగ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన తయారీ రంగాలలో యువతకు శిక్షణ అందించేందుకు కూడా ఇది మద్దతు ఇవ్వనుంది.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా సాధ్యమైనంత వరకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు.
***
(రిలీజ్ ఐడి: 2261665)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8