యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
గ్లాస్గోలో జరగనున్న 2026 కామన్వెల్త్ క్రీడల కోసం భారత్ సన్నద్ధతపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమీక్ష
సీడబ్ల్యూజీ 2026 కోసం క్రీడాకారుల అవసరాలే కేంద్రంగా సన్నాహాలు, సజావైన సమన్వయం ఉండాలని భాగస్వాములకు డాక్టర్ మాండవీయ ఆదేశం
సమీక్షా సమావేశంలో పాల్గొన్న గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, మంత్రిత్వ శాఖ, ఐఓఏ, ఎస్ఏఐ, సీడబ్ల్యూజీకి చెందిన కీలక భాగస్వాములు
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 2:57PM by PIB Hyderabad
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరగనున్న 2026 కామన్వెల్త్ క్రీడల కోసం భారత్ సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అన్ని భాగస్వామ్య పక్షాల మధ్య పూర్తి సమన్వయం ఉండేలా చూడటం, సీడబ్ల్యూజీ 2026 కోసం సిద్ధమవుతున్న భారతీయ క్రీడాకారులకు అవసరమైన సహాయక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
ఈ సమావేశానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వచ్చే ఏడాది జరగబోయే కామన్వెల్త్ క్రీడల కోసం నియమితులైన షెఫ్ డి మిషన్‌తోపాటు (బృంద నాయకుడు) భారత క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు కూడా ఉన్నారు. వీరంతా క్రీడలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, క్రీడాకారుల సన్నద్ధత, సమన్వయ ప్రయత్నాలపై తాజా వివరాలను వెల్లడించారు.
భారత కామన్వెల్త్ క్రీడల ప్రచారంలో భాగంగా క్రీడాకారుల శిక్షణ, రవాణా, సంక్షేమం, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సుదీర్ఘంగా చర్చించారు.
భారతీయ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు, వారికి అన్ని విధాలా మద్దతు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశానికి విజయవంతమైన ఫలితాలు అందించేందుకు ముందస్తు ప్రణాళిక, ఏజెన్సీల మధ్య సమన్వయం, క్రీడాకారుల అవసరాలే ప్రాధాన్యంగా సన్నాహాలు ఉండాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో 2026 కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకకు సంబంధించిన సన్నాహాలపై కూడా చర్చించారు. ఆ వేడుకల్లోనే 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్య దేశంగా భారత్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించనున్నారు.
ఈ క్రీడలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొని ప్రాథమిక చర్చలు జరిపారు.
గ్లాస్గో 2026 కోసం జరుగుతున్న కార్యాచరణ, రవాణా సంబంధిత సన్నాహాలపై వివిధ మంత్రిత్వ శాఖలతో క్రీడల శాఖ కార్యదర్శి జరుపుతున్న సమన్వయ ప్రయత్నాలను కూడా ఈ బృందం సమీక్షించింది. క్రీడల నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అంతర్ మంత్రిత్వ శాఖల సహకారం కీలకమని సభ్యులు తెలిపారు.
2026 కామన్వెల్త్ క్రీడల కోసం భారత క్రీడా బృందానికి సంబంధించి అంతర్ మంత్రిత్వ శాఖల సమన్వయం, సహాయక చర్యలు, అన్ని ఏర్పాట్లు సజావుగా అమలు చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు.
క్రీడల కోసం రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికపై భారత క్రీడా ప్రాధికార సంస్థ, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశంలో చర్చించారు. ఇందులో క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీల అనుభవం, శిక్షణ షెడ్యూళ్లు, సహాయక సిబ్బంది నియామకం, అత్యవసర పరిస్థితుల్లో ఎదుర్కొనే ప్రణాళికల గురించి వివరించారు.
2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత ప్రచారాన్ని దిగ్విజయం చేసేందుకు క్రీడల మంత్రిత్వ శాఖ, ఐఓఏ, ఎస్ఏఐ, గుజరాత్ ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ తమ సమష్టి నిబద్ధతను చాటాయి.
***
(రిలీజ్ ఐడి: 2261590)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7