వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ అధ్యక్షతన ముంబయిలో ముగిసిన కింబర్లీ ప్రాసెస్ మధ్యంతర వార్షిక సమావేశం- 2026... సహజ వజ్రాల రంగం భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి


సహజ వజ్రాల రంగంలో విశ్వసనీయత, నిబంధనల అమలు, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

పారదర్శకత, పాలన, కార్యాచరణ సంస్కరణలపై ప్రధానంగా దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 11:53AM by PIB Hyderabad

భారత్ అధ్యక్షతన ముంబయిలో నిర్వహించిన కింబర్లీ ప్రాసెస్ మధ్యంతర వార్షిక సమావేశం -2026 విజయవంతంగా ముగిసింది. సహజ వజ్రాల రంగం భవిష్యత్తుపై చర్చించడం కోసం నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కింబర్లీ ప్రాసెస్ సభ్యదేశాల ప్రతినిధులు, పరిశీలకులు, పరిశ్రమ వర్గాలు, పౌర సమాజ సంస్థలు పాల్గొన్నాయి.

ఈ సమావేశం విజయవంతంగా ముగియడం పట్ల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. వజ్రాల కటింగ్, వాటిని మెరుగుపెట్టడంలో భారత్ అగ్రగామిగా ఉందన్నారు. విశ్వసనీయత, బాధ్యత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా సహజ వజ్రాలను నిలపడంలో కింబర్లీ ప్రాసెస్ పోషిస్తున్న కీలక పాత్రను భారత్ గుర్తించిందన్నారు. భారత్ అధ్యక్షతన 3సీలు.. అంటే విశ్వసనీయత (క్రెడిబిలిటీ), నిబంధనల అమలు (కాంప్లయన్స్), వినియోగదారుల నమ్మకం (కన్స్యూమర్ కాన్ఫిడెన్స్) అనే అంశాలను ముందుకు తీసుకెళ్లడానికి దేశం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచ మార్కెట్‌లో కింబర్లీ ప్రాసెస్ ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేసేలా సభ్యదేశాలన్నీ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉత్పత్తి చేసే దేశాల నుంచి ప్రాసెసింగ్, వాటిని వినియోగించే దేశాల వరకు కోట్లాది ప్రజల జీవనోపాధిని సహజ వజ్రాల రంగం కాపాడుతోందని మంత్రి వివరించారు. పరిశ్రమల ఆకాంక్షలకు మరియు వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా.. దృఢమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన కింబర్లీ ప్రాసెస్ కోసం భారత్ ఎప్పుడూ ముందుండి కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.

విశ్వసనీయత (క్రెడిబిలిటీ), నిబంధనల అమలు (కాంప్లయన్స్), వినియోగదారుల నమ్మకం (కన్స్యూమర్ కాన్ఫిడెన్స్) అనే ‘3సీ’ల ఇతివృత్తంతో.. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ వార్షిక మధ్యంతర సమావేశం.. కింబర్లీ ప్రాసెస్ వ్యవస్థలో నమ్మకాన్ని, పారదర్శకతను, సహకారాన్ని పెంపొందించడంపై సుదీర్ఘంగా చర్చించింది.

ఈ సమావేశ సందర్భంగా.. పర్యవేక్షణ, సాంకేతిక ప్రక్రియలు, పాలన, గణాంకాలు, కళా ఉత్పత్తుల వంటి అంశాలపై వివిధ కార్యాచరణ బృందాలు, కమిటీలు వివరణాత్మకంగా చర్చించాయి. సహజ వజ్రాల రంగానికి సంబంధించి ప్రతీ దశలోనూ పారదర్శకతను పెంచడం, కార్యాచరణ యంత్రాంగాలను మెరుగుపరచడం, నమ్మకాన్ని పునరుద్ఘాటించడంపై ప్రధానంగా దృష్టి సారించాయి.

విశ్వసనీయంగా, సందర్భోచితంగా, ప్రపంచ వజ్రాల వాణిజ్యమూ వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా కింబర్లీ ప్రాసెస్‌ను నిలపడంలో భాగస్వామ్య, పరిశీలక దేశాల సమష్టి నిబద్ధతకు.. ముంబయి సమావేశంలో సాధించిన పురోగతి నిదర్శనమని కింబర్లీ ప్రాసెస్ చైర్మన్ (2026) శ్రీ సుచింద్ర మిశ్రా పేర్కొన్నారు. సహజ వజ్రాల వాణిజ్యానికి నమ్మకమే పునాది అని ఆయన స్పష్టం చేశారు. వజ్రాల రంగానికి సంబంధించి ప్రతీ దశలోనూ బాధ్యతాయుతమైన సేకరణ, పారదర్శకత, నమ్మకాన్ని పెంపొందించడంలో కింబర్లీ ప్రాసెస్ మూలాధారంగా నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

సహజ వజ్రాల ఉత్పత్తి దేశాలు, అక్కడి వర్గాల్లో అమలు చేస్తున్న బాధ్యతాయుతమైన సేకరణ పద్ధతులు, అభివృద్ధి ఫలితాలు, జీవనోపాధికి దాని సహకారం వంటి సానుకూల అంశాలను మరింత సమర్థంగా తుది వినియోగదారులకు చేరవేయడం కోసం సమాచారం, ప్రచార కార్యక్రమాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను కూడా సమావేశం ప్రముఖంగా పేర్కొన్నది.

ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీలో జరగనున్న కేపీ సర్వసభ్య సమావేశానికి ఈ సమావేశ చర్చలు దిశానిర్దేశం చేయనున్నాయి. 2026లో భారత్ అధ్యక్షతన కొనసాగే ఈ ప్రక్రియలో.. విశ్వసనీయత, నిబంధనల అమలు, వినియోగదారుల నమ్మకం అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

ఈ సమావేశంలో కింబర్లీ ప్రాసెస్ సభ్యదేశాల ప్రతినిధులు, వరల్డ్ డైమండ్ కౌన్సిల్, పౌర సమాజ సంస్థల సభ్యులు, పారిశ్రామిక సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ, పౌర సమాజం మూడింటి కలయికతో కూడిన కింబర్లీ ప్రాసెస్‌లో ప్రత్యేకంగా నిలిచే త్రైపాక్షిక నిర్మాణం, ఏకాభిప్రాయ విధానం దాని ప్రధాన బలాలుగా ఉన్నాయని చైర్మన్ వ్యాఖ్యానించారు.

2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన 55/56 తీర్మానం కింద కింబర్లీ ప్రాసెస్ ధ్రువీకరణ పథకాన్ని ప్రారంభించారు. ఘర్షణ ప్రాంతాల నుంచి వచ్చే అక్రమ వజ్రాలను అధికారిక వాణిజ్యంలోకి ప్రవేశించకుండా నిరోధించడం, సహజ వజ్రాల సరఫరా వ్యవస్థలో బాధ్యతాయుత సేకరణ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అంతర్జాతీయ కార్యక్రమం పనిచేస్తోంది.

వజ్రాల కటింగ్, వాటిని మెరుగుపెట్టడంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న భారత్.. కింబర్లీ ప్రాసెస్ లక్ష్యాలకు కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించింది. అలాగే సహజ వజ్రాల రంగంలో పారదర్శకత, సుస్థిరత, బాధ్యతాయుత పద్ధతులను ప్రోత్సహించడంలో ముందుంటామని స్పష్టం చేసింది. 

***


(రిలీజ్ ఐడి: 2261442) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Malayalam