రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంస్కరణలతో గత నాలుగు నెలల్లోనే రైల్వే ద్వారా సిమెంట్ రవాణా 170 శాతం వృద్ధి... ఫ్లై యాష్ మార్కెట్‌పై దృష్టి


పర్యావరణహిత కొత్త కంటైనర్ వ్యాగన్లతో లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ సులభతరం..

తగ్గిన సరకు ఖర్చు, సమయం ఆదా

నిర్మాణ రంగంలో నిశ్శబ్ద విప్లవం... తగ్గిన సిమెంట్ ధరల వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణంలో ఊరట

రైల్వేల ద్వారా సిమెంట్ రవాణా పెరగటంతో రహదారులపై తగ్గిన ట్రక్కుల భారం, ట్రాఫిక్ రద్దీ... మెరుగైన సరకు రవాణా సామర్థ్యం

ఫ్లైయాష్ రవాణా మార్కెట్లోని అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, విద్యుత్ కేంద్రాల వ్యర్థాలను జాతీయ సంపదగా మార్చటంలో సహకరించాలని అధికారులను కోరిన రైల్వే మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2026 6:55PM by PIB Hyderabad

రైల్వే సంస్కరణలు చేపట్టిన గత నాలుగు నెలల్లోనే సిమెంట్ రవాణాలో 170 శాతం వృద్ధిని నమోదు చేసి భారతీయ రైల్వే గొప్ప విజయాన్ని సాధించింది. గతేడాది నవంబర్‌లో సిమెంట్ రవాణాకు సంబంధించి రైల్వేశాఖ ప్రవేశపెట్టిన వరుస సంస్కరణల వల్ల ఈ సానుకూల మార్పు వచ్చింది. ఈ సంస్కరణల్లో భాగంగా అంతరాయం లేకుండా సిమెంట్‌ను రవాణా చేసేందుకు ‘ఇన్నోవేటివ్ బల్క్‌ సిమెంట్ ట్యాంక్ కంటైనర్ల’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కంటైనర్ రంగానికి సంబంధించిన సంస్కరణలు, అమలు తీరును ఇవాళ కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ సమీక్షించారు.

బల్క్ సిమెంట్ రవాణాలో రైల్వే వాటాను పెంచేందుకు, రోడ్డు రవాణా నుంచి స్వచ్ఛ, సమర్థవంతమైన రైల్వే రవాణాకు మారటాన్ని ప్రోత్సహించేందుకు ఈ సిమెంట్ సంస్కరణలను ప్రవేశపెట్టారు. సిమెంట్‌ను వివిధ రవాణా మార్గాల ద్వారా సులభంగా తరలించేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన ట్యాంక్ కంటైనర్లను, బల్క్ సిమెంట్ టెర్మినల్ విధానాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్త విధానం వల్ల సిమెంట్ లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ సులభతరమైందని, రవాణాలో సరకు వృధా తగ్గిందని కేంద్రమంత్రి తెలిపారు. ఒకచోట తయారైన సిమెంట్‌ను ఇప్పుడు ప్రత్యేకమైన ట్యాంక్ కంటైనర్ల ద్వారా నేరుగా వినియోగ కేంద్రాలకు తరలించటం వల్ల పదేపదే లోడింగ్ చేయాల్సిన అవసరం తగ్గి, ఫ్యాక్టరీ నుంచి మార్కెట్‌కు సిమెంట్ వేగంగా చేరుతుందని చెప్పారు. ఈ కంటైనర్లు ప్రామాణిక పరిమాణంలో ఉండి, రెడీ-మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసీ) యంత్రాలకు సరిపోయేలా ఉండటంతో నిర్మాణ స్థలాల్లో నేరుగా వినియోగించేందుకు సిద్ధంగా సిమెంట్ ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల రెండు రకాల హ్యాండ్లింగ్ దశలు తగ్గి, రవాణా ఖర్చులు ఆదా అవటమే కాక పనులు వేగంగా పూర్తవుతున్నట్లు వెల్లడించారు.

సిమెంట్ రవాణా రంగంలో మెరుగైన పనితీరు నిర్మాణ రంగంలో నిశ్శబ్ద విప్లవానికి నాంది పలుకుతోంది. సిమెంట్ తరలింపులో వివిధ దశలను తగ్గించటం, రవాణా ఖర్చులను ఆదా చేయటం ద్వారా వినియోగదారునికి చేరే సిమెంట్ ధర తగ్గే అవకాశముంది. ఇది నిర్మాణ సామగ్రి ఖర్చులను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిర్మాణ వ్యయం తగ్గటం వల్ల ఇళ్ల నిర్మాణానికి డిమాండ్ పెరగడమే కాక.. పేద, మధ్యతరగతి వర్గాలకు గృహ నిర్మాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

వినూత్నమైన "మేక్ ఇన్ ఇండియా" ట్యాంక్ కంటైనర్లు రైలు నుంచి ట్రైలర్‌కు, తిరిగి ట్రైలర్‌ నుంచి రైలుకు సులభంగా మార్చుకునేలా రూపొందించారు. ఇవి సామాగ్రిని నేరుగా ఇంటి వద్దకు చేర్చే సమర్థవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. యంత్రాలతో లోడింగ్, అన్‌లోడింగ్‌ చేసేందుకు ప్రతి కంటైనర్ అనువుగా ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో బస్తాల ద్వారా జరిగే సిమెంట్ రవాణాతో పోలిస్తే... ఇవి సిమెంట్ వృధాను, ప్యాకేజింగ్ నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి.

లోడింగ్, అన్‌లోడింగ్ సమయంలో ఉత్పత్తయ్యే దుమ్ము గణనీయంగా తగ్గడం వల్ల ఈ సంస్కరణ పర్యావరణహితంగా మారిందని కేంద్రమంత్రి తెలిపారు. కంటైనర్ల ద్వారా బల్క్ రవాణా వైపు మళ్లటం వల్ల ఇంధన వినియోగం తగ్గటమే కాక, ఉద్గారాలు తగ్గి, స్వచ్ఛ రవాణాను ప్రోత్సహిస్తోంది. రహదారులపై రద్దీని కూడా తగ్గిస్తోంది.

సిమెంట్ రవాణాలో సాధించిన విజయం తర్వాత ఫ్లై యాష్ రవాణాలోనూ అటువంటి సంస్కరణలనే చేపట్టేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది. ఈ అంశంపై సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఫ్లై యాష్ రవాణా మార్కెట్లో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థాలను జాతీయ సంపదగా మార్చాలని సూచించారు.

దేశంలో దాదాపు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతోందని, అందులో కేవలం 13 మిలియన్ టన్నులు మాత్రమే రైల్వే ద్వారా రవాణా చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇటుక బట్టీలు, సిమెంట్ పరిశ్రమలు, నిర్మాణ ప్రాంతాలకు ఫ్లై యాష్ రవాణాను సులభతరం చేయాలని, ఇందులో రైల్వే వాటాను గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. "వ్యర్థాల నుంచి సంపద" సృష్టించే అవకాశంగా కేంద్రమంత్రి దీన్ని అభివర్ణించారు. విద్యుత్ ప్లాంట్లు వ్యర్థంగా భావించే ఫ్లై యాష్.. రహదారుల నిర్మాణం, సిమెంట్ తయారీ, ఇటుకల ఉత్పత్తికి విలువైన వనరు అని తెలిపారు.

ఫ్లై యాష్ వినియోగాన్ని, రవాణాను విస్తృతం చేయటం వల్ల కాలుష్యం తగ్గటంతో పాటు పారిశ్రామిక వ్యర్థాల పునర్వినియోగం పెరుగుతుంది. ఇటుకలు, సిమెంట్‌ వంటి నిర్మాణ సామగ్రి తయారీ ఖర్చు కూడా తగ్గుతుంది. దీన్ని నిర్మాణ రంగంలో వినియోగించటం ద్వారా పర్యావరణహిత, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

వినూత్నమైన కంటైనర్ వ్యాగన్లు, భారతీయ రైల్వేలో సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో, పెద్ద ఎత్తున సరకు రవాణా కోసం సిమెంట్ రవాణాలో చేపట్టిన సంస్కరణలు కీలక ముందడుగా నిలిచాయి. ఈ జోరుతోనే ఇప్పుడు ఫ్లై యాష్ రవాణాపై దృష్టి సారించడం ద్వారా "వ్యర్థాల నుంచి సంపద" విధానం మరింత బలోపేతం కానుంది. కీలకమైన మౌలిక సదుపాయాల రంగాల్లో పర్యావరణహిత సరకు రవాణా వ్యవస్థను విస్తరించేందుకు ఇది దోహదపడుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2261319) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Odia , Tamil , Kannada