ఉప రాష్ట్రపతి సచివాలయం
ఎయిమ్స్ న్యూఢిల్లీ 51వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగం
‘‘ఎయిమ్స్ ఇకపై కేవలం అంతర్జాతీయ ప్రమాణాల కోసం ప్రయత్నించదు.. స్వయంగా ఆ ప్రమాణాలను నెలకొల్పుతోంది’’: ఉపరాష్ట్రపతి
‘‘రోగి పక్కన వైద్యుడి ఉనికిని ఏ కృత్రిమ మేధ కూడా భర్తీ చేయలేదు’’: ఉపరాష్ట్రపతి
నాణ్యమైన వైద్యాన్ని సామాన్యులకు అందుబాటు ధరలో అందిస్తున్నందుకు ఎయిమ్స్‌ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
సానుభూతి, చిత్తశుద్ధితో వైద్య రంగాన్ని ముందుండి నడిపించాలని ఎయిమ్స్ పట్టభద్రులకు ఉపరాష్ట్రపతి పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 6:18PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) 51వ స్నాతకోత్సవ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగించారు.
వైద్య సేవలను అందించడంలో ఎయిమ్స్ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి కొనియాడారు. వైద్య ఆవిష్కరణల్లో, ఆరోగ్య సంరక్షణలో నాణ్యతతో కూడిన సేవలు అందిస్తూ దేశానికే ఎయిమ్స్ ఒక మార్గర్శక శక్తిగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. రోగుల సంరక్షణ, ఆధునిక వైద్యంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతూనే.. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సేవలను అందిస్తోందని తెలిపారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో… ఎయిమ్స్ చూపిన తెగువ నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను విస్తరించడం వరకు.. ‘‘ఎయిమ్స్ బ్రాండ్’’ భారత్‌తోపాటు ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి, చిత్తశుద్ధికి మారుపేరుగా మారిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
వైద్య విద్యలో ప్రమాణాలను నెలకొల్పుతూనే, భారీ సంఖ్యలో రోగులకు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నందుకు ఎయిమ్స్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ విషయంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎయిమ్స్ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డాతో పాటు ఎయిమ్స్ డైరెక్టర్, అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. దశాబ్దాలుగా అద్భుతమైన ప్రతిభతో పాటు నైతికత, మానవత్వం కలిగిన మేధావులను ఎయిమ్స్ దేశానికి అందిస్తోందని, ఇక్కడి పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పదవులను చేపట్టారని తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో అంటార్కిటికాలోని ఒక రోగికి ఎయిమ్స్ రిమోట్ విధానంలో రోబోటిక్ అల్ట్రాసౌండ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ ఘనత ద్వారా భారతీయ వైద్య నైపుణ్యానికి భౌగోళిక సరిహద్దులు అడ్డంకి కావని నిరూపితమైందని వ్యాఖ్యానించారు. వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగం కోసం ఏర్పాటు చేసిన ఇండో-ఫ్రెంచ్ కేంద్రం వంటి అంతర్జాతీయ సహకారాలను ఆయన ప్రస్తావించారు.
వైద్య సేవలు, వైద్య విద్యలో ఎయిమ్స్ ప్రస్తుతం ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. క్యూఎస్ ప్రపంచ ర్యాంకులను ప్రస్తావిస్తూ.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఎయిమ్స్ 40 స్థానాలు ఎగబాకి అంతర్జాతీయంగా 105వ స్థానానికి చేరుకుందని తెలిపారు. అతి త్వరలోనే ఈ సంస్థ తొలి 100 స్థానాల్లోకి వస్తుందని, భవిష్యత్తులో ప్రపంచంలో నంబర్ వన్ సంస్థగా అవతరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2018 నుంచి 2025 వరకు ఎన్‌ఐఆర్‌ఎఫ్ వైద్య విభాగంలో ఎయిమ్స్ వరుసగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎయిమ్స్ అధ్యాపకులు, పరిశోధకుల ప్రతిభను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇక్కడి అధ్యాపకులకు లభించిన పద్మ అవార్డుల్లో ఎయిమ్స్ గొప్పతనం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఎయిమ్స్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు పద్మవిభూషణ్, 15 మంది పద్మభూషణ్, 51 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారని వెల్లడించారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రపంచంలోని అగ్రశ్రేణి 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో ఎయిమ్స్‌కు చెందిన 57 మంది అధ్యాపక సభ్యులు చోటు దక్కించుకోవడం విశేషమన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎయిమ్స్ సంస్థల విస్తరణ జరిగిందని, దీనివల్ల వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని ఉపరాష్ట్రపతి అన్నారు. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మరిన్ని వైద్య, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ‘‘ఒకే దేశం, ఒకే ఆరోగ్యం’’’ దార్శనికతతో మరింత సమగ్రమైన, సమానమైన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుంటోన్న కీలక తరుణంలో పట్టభద్రులు వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. వైద్య రంగంలో జాలి, ఆవిష్కరణలు, ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించాలని యువ వైద్యులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులకు ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతలు వైద్య రంగంతో పాటు ఇతర రంగాలను విప్లవాత్మకంగా మారుస్తున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. అయినప్పటికీ రోగి పక్కన ఉండి వైద్యుడు ఇచ్చే భరోసాను ఏ కృత్రిమ మేధ కూడా భర్తీ చేయలేదని తెలిపారు. వైద్య వృత్తిలో మానవత్వం, చిత్తశుద్ధి, సానుభూతిని ఎల్లప్పుడూ కాపాడాలని పట్టభద్రులకు సూచించారు.
పట్టభద్రులైన విద్యార్థులకు అభినందలు తెలియజేస్తూ.. వారు ధరించే తెల్ల కోటు కేవలం వ్యక్తిగత విజయానికి మించిన ఎన్నో అంచనాలను, బాధ్యతలను మోస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. వినయం, నైపుణ్యం, సేవా దృక్పథంతో సమాజానికి సేవ చేయాలని కోరారు. తమ పని కేవలం వృత్తిపరమైన నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా.. సమాజ శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబించేలా ఉండాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎయిమ్స్ న్యూఢిల్లీ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, ఎయిమ్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ నిఖిల్ టాండన్, ఎయిమ్స్ డీన్ ప్రొఫెసర్ రాధిక టాండన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గిరిజా ప్రసాద్ రాథ్, అధ్యాపక బృందం, వైద్య నిపుణులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2260520)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5