రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళ అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
నాడు పోస్టు చేయడమైనది:
09 MAY 2026 7:22AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను (పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, వీఎస్ఎం) నౌకాదళ తదుపరి అధిపతిగా నియమించింది. ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి (పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, ఎన్ఎం) 2026 మే 31న పదవీ విరమణ చేయనున్నారు.
వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 2025 జూలై 31 2025న పశ్చిమ నౌకాదళ కమాండ్ 34వ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1987 జూలై 01న భారత నౌకాదళంలో నియమితులైన ఆయన.. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ యుద్దక్షేత్ర విభాగంలో నిపుణులు. ఆయన ఖడక్వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ (ష్రివెన్‌హామ్), కరంజాలోని కాలేజ్ ఆఫ్ నేవల్ వార్‌ఫేర్, అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ నేవల్ వార్ కాలేజ్ (న్యూపోర్ట్) పూర్వ విద్యార్థి.
పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ గ్రహీత అయిన అడ్మిరల్ స్వామినాథన్ నౌకాదళ ప్రస్థానంలో అనేక కీలక కార్యాచరణ (ఆపరేషనల్), సిబ్బంది- శిక్షణ విధులను నిర్వహించారు. క్షిపణి నౌకలైన ఐఎన్ఎస్ విద్యుత్, వినాశ్.. క్షిపణి కార్వెట్ ఐఎన్ఎస్ కులిష్.. గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక ఐఎన్ఎస్ మైసూర్.. విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలకు ఆయన కమాండర్‌గా వ్యవహరించారు.
రియర్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాత ఆయన కొచ్చిలోని దక్షిణ నౌకాదళ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్‌గా (ట్రైనింగ్) పనిచేశారు. ఈ హోదాలో భారత నావికాదళం అంతటా శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించారు. నౌకాదళంలోని అన్ని విభాగాలలో కార్యాచరణ భద్రతను పర్యవేక్షించే 'ఇండియన్ నేవల్ సేఫ్టీ టీమ్' ఏర్పాటులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అనంతరం 'ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రైనింగ్'గా నౌకాదళ వర్క్-అప్ సంస్థకు ఆయన నేతృత్వం వహించారు. ఆ తర్వాత పశ్చిమ నౌకాదళానికి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా నియమితులయ్యారు. నౌకాదళానికి ఖడ్గ హస్తం వంటి ఆ విభాగానికి నాయకత్వం వహించిన తర్వాత ఆయన.. 'ఫ్లాగ్ ఆఫీసర్ ఆఫ్‌షోర్ డిఫెన్స్ అడ్వైజరీ గ్రూప్', భారత ప్రభుత్వానికి ఆఫ్‌షోర్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సలహాదారుగా నియమితులయ్యారు.
వైస్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాత ఆయన.. పశ్చిమ నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, జాతీయ ప్రధాన కార్యాలయంలో కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్- చీఫ్ ఆఫ్ పర్సనల్ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుత నియామకానికి ముందు నావికాదళ ప్రధాన కార్యాలయంలో నౌకాదళ ఉప అధిపతిగా (వైస్ చీఫ్) ఆయన పనిచేశారు.
వైస్ అడ్మిరల్ స్వామినాథన్ విద్యార్హతల విషయానికి వస్తే ఆయన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీని పొందారు. కొచ్చిలోని కొచ్చిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి టెలికమ్యూనికేషన్స్‌లో ఎంఎస్సీ, లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఏ పట్టా పొందారు. వీటితో పాటు ముంబయి యూనివర్సిటీ నుంచి స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఎంఫిల్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
****
(రిలీజ్ ఐడి: 2259415)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10