యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ‘‘రాబోయే ఆసియా, కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల కోసం భారత్ సన్నద్ధమయ్యే దిశగా జాతీయ క్రీడా సమాఖ్యల సదస్సు ఒక సమన్వయ చర్యగా నిలుస్తుంది’’: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
‘‘భారత క్రీడా వ్యవస్థ నుంచి డోపింగ్ను నిర్మూలించడానికి సామూహిక బాధ్యత, కఠిన చర్యలు అవసరం’’: జాతీయ క్రీడా సమాఖ్యల సదస్సులో డాక్టర్ మాండవీయ
‘‘క్రీడాకారుల సంక్షేమం, క్రీడాకారుల కేంద్రీకృత పాలనపైనే ప్రతి క్రీడా సమాఖ్య ప్రధాన దృష్టి ఉండాలి’’: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
‘‘అత్యుత్తమ ప్రదర్శన, శాస్త్ర సాంకేతికత, పటిష్టమైన సమాఖ్యల ఆధారంగా రాబోయే అంతర్జాతీయ క్రీడా పోటీల వైపు భారత్ పురోగతి సాగుతుంది’’: కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే
‘‘క్రీడాకారులు, సమాఖ్యలు, ప్రభుత్వాల మధ్య ఉండే బలమైన సమన్వయంపై భారత క్రీడా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది”: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 5:24PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడా సమాఖ్యల సదస్సు 2026లో పాల్గొన్నారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ సహా 37 జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు హాజరై… దేశ క్రీడా భవిష్యత్తు ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా కామన్వెల్త్ క్రీడలు 2026, ఆసియా క్రీడలు 2026, సమ్మర్ ఒలింపిక్స్ 2028 వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడల కోసం భారత్ సన్నద్ధతపై ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సదస్సును ఉద్దేశించి కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ… ‘‘రాబోయే ప్రపంచ స్థాయి క్రీడా పోటీల కోసం భారత్ సన్నద్ధమయ్యే దిశగా జాతీయ క్రీడా సమాఖ్యల సదస్సు ఒక సమన్వయ చర్యగా నిలుస్తుంది’’ అని అన్నారు.
దేశాన్ని అగ్రగామి క్రీడా దేశంగా మార్చాలన్న ప్రభుత్వ విస్తృత దృక్పథాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. దీర్ఘకాలిక ప్రణాళికలు, శాస్త్రీయ శిక్షణ, పటిష్టమైన క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు నిరంతర మద్దతు అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర క్రీడా మంత్రి స్పష్టం చేశారు.
సంస్థాగత సంస్కరణలు, సుపరిపాలన ప్రాముఖ్యతను వివరిస్తూ… ‘‘క్రీడాకారులు, సమాఖ్యలు, ప్రభుత్వాల మధ్య ఉండే బలమైన సమన్వయంపైనే భారత క్రీడా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’’ అని తెలిపారు.
క్రీడా సమాఖ్యలలోని పాలన పూర్తిగా క్రీడాకారుల ప్రయోజనాలే కేంద్రంగా సాగాలని కేంద్రమంత్రి చెప్పారు. క్రీడాకారుల సంక్షేమమే క్రీడా వ్యవస్థలో అత్యంత కీలకమని, దీనికోసం సమాఖ్యలు మరింత పారదర్శకతను పాటించాలని, సమయానుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని, జవాబుదారీతనం, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
అవగాహన, విద్య, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా భారత క్రీడా వ్యవస్థ నుంచి డోపింగ్ను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
‘‘భారత క్రీడా వ్యవస్థ నుంచి డోపింగ్ను నిర్మూలించడానికి సామూహిక బాధ్యత, కఠిన చర్యలు అవసరం’’ అని డాక్టర్ మాండవీయ అన్నారు. దేశంలో స్వచ్ఛమైన, పారదర్శకమైన క్రీడా సంస్కృతిని నిర్మించడానికి ఫెడరేషన్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది చురుకుగా సహకరించాలని ఆయన కోరారు.
ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఉద్యమం, త్వరలో రాబోయే ఖేలో భారత్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా క్రీడా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ బృహత్తర లక్ష్యాన్ని డాక్టర్ మాండవీయ మరింత వివరించారు.
ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు,2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో భారత్ పతకాల అవకాశాలను మెరుగుపరచడానికి శాస్త్రీయ శిక్షణ, క్రమం తప్పకుండా పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, క్రీడా లీగ్‌లు, అకాడమీలు, పాలనా సంస్కరణల ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు.
ఈ సదస్సు సందర్భంగా జాతీయ క్రీడా పరిపాలన చట్టం 2025 నిబంధనలు, సంస్కరణల మార్గదర్శకాల హ్యాండ్బుక్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అధికారికంగా విడుదల చేశారు.
అధిక జవాబుదారీతనం, పారదర్శకమైన క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలు, సమాఖ్యలకు నిరంతర సంస్థాగత మద్దతు ద్వారా దేశ క్రీడా నిర్మాణాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని కేంద్ర క్రీడా మంత్రి తెలిపారు.
బహిరంగ, నిష్పక్షపాత ఎంపిక విధానాలు, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాలను పెంచడం, సమాఖ్యల కోసం బలమైన అంతర్జాతీయ సంబంధాలు, క్రీడాకారులు, కోచ్‌లు, పాలనా యంత్రాంగాలపై పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ వివరించారు.
దేశం కోసం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండే క్రీడా వ్యవస్థను నిర్మించడంలో దీర్ఘకాలిక ప్రణాళిక, క్రీడాకారులకు అండగా నిలిచే వ్యవస్థలు, శాస్త్రీయ శిక్షణ పద్ధతుల ప్రాముఖ్యతను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే చెప్పారు.
ఆమె మాట్లాడుతూ ‘‘ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, 2028 ఒలింపిక్స్ దిశగా భారత్ పురోగతి అనేది అత్యుత్తమ ప్రదర్శన, శాస్త్ర సాంకేతికత, పటిష్టమైన సమాఖ్యల ఆధారంగా సాగుతుంది” అని పేర్కొన్నారు.
దేశ క్రీడా ఆశయాలను సాధించడంలో సామూహిక బాధ్యత, దీర్ఘకాలిక ప్రణాళిక ప్రాముఖ్యతను క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు వివరించారు.
‘‘పెద్ద కలలు కనే దేశం, అంతకంటే పెద్దగా సన్నద్ధమవుతుంది. నేటి చర్చలు 2036 నాటి దేశ క్రీడా భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి’’ అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్ను ఒక శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షలను నెరవేర్చడానికి క్రీడాకారులకు పోటీలలో పాల్గొనే అవకాశాలు పెంచడం, క్రీడా లీగ్ల నిర్వహణ, ఆధునిక శిక్షణ వ్యవస్థల అవసరముందని కేంద్రమంత్రి తెలిపారు.
దీని కోసం క్రీడా సమాఖ్యలు, భాగస్వాములందరూ సమన్వయంతో ఒక జట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశ క్రీడా ముసాయిదాపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా ఖేలో ఇండియా మిషన్ పతకాల వ్యూహం, క్రీడా పరికరాల తయారీని ప్రోత్సహించడం, శాస్త్రీయ ఫిట్నెస్ ప్రోటోకాల్‌లు, క్రీడాకారుల అంచనా, డోపింగ్ నిరోధక చట్టాలను బలోపేతం చేయడం, జాతీయ క్రీడా సమాఖ్యల కోసం సాంకేతిక జోక్యం, ఎన్ఎస్జీ చట్టం 2025 కింద పాలన, నిబంధనల అమలు వంటి అంశాలపై చర్చించారు. వీటితో పాటు ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ ఆశయం, ప్రపంచ ఫెడరేషన్లలో భారత ప్రాతినిధ్యాన్ని పెంచడం, రాబోయే క్రీడల కోసం వ్యూహాత్మక సన్నద్ధతపై కూడా చర్చలు సాగాయి.
ఈ సదస్సులో జరిగిన అన్ని సమావేశాల్లో వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు చురుగ్గా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2258904)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4