ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణను పటిష్ఠంగా ఉంచడానికి ‘జనని’ని
అత్యుత్తమ కార్య ప్రణాళికలపై జాతీయ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ
‘జనని’ ఒక సేవా ప్రధాన డిజిటల్ వేదిక. సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డుల విస్తృత పర్యవేక్షణ, సంరక్షణ ఈ వేదిక లక్ష్యాలు
ప్రస్తుత ఆర్‌సీహెచ్ వెబ్‌సైట్లో మార్పు చేర్పులతో ‘జనని’కి రూపకల్పన.. సంరక్షణను నిరంతరాయంగా అందించడంలో కీలక సేవల్ని నమోదు చేసి, దీర్ఘకాలిక ఆరోగ్య రికార్డును సమకూర్చే వేదికే ‘జనని’
ఇప్పటివరకూ, 1.34 కోట్ల లబ్ధిదారు నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ‘జనని’..
30 లక్షలకు పైగా గర్భిణీల సమాచారం నమోదు..
30 లక్షల కన్నా ఎక్కువ ఎమ్‌సీహెచ్ కార్డుల జారీ..
కొలిక్కివచ్చిన 1 లక్ష కన్నా ఎక్కువ బయోమెట్రిక్ ప్రమాణీకరణలు
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 12:14PM by PIB Hyderabad
తల్లీ బిడ్డల ఆరోగ్య సేవలను పటిష్ఠపరిచే దిశగా మరో కీలక నిర్ణయం.. ‘‘భారత్‌లో ఆరోగ్య రంగం భవిష్యత్తుకు రూపురేఖలనిచ్చే అత్యుత్తమ కార్య ప్రణాళికలు’’ అంశంపై ఇటీవలే ముగిసిన జాతీయ నూతన ఆవిష్కరణ, సమ్మిళితత్వాల శిఖరాగ్ర సదస్సులో ‘జనని’ (జర్నీ ఆఫ్ యాంటినేటల్, నేటల్, నియోనేటల్ ఇంటిగ్రేటెడ్ కేర్.. సంక్షిప్త రూపంలో జేఏఎన్ఏఎన్ఐ.. ‘‘జనని’’) వేదికని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది.
ప్రధానంగా సేవలను అందించడానికి ఉద్దేశించిన ఒక డిజిటల్ వేదికే ఈ ‘జనని’. దీనిని సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని, డిజిటల్ ఆరోగ్య రికార్డుల విస్తృత పర్యవేక్షణ, సంరక్షణ కోసం రూపొందించారు. ఇప్పటికే ఉన్న ఆర్‌సీహెచ్ వెబ్‌సైట్లో మార్పుచేర్పులు చేసి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వేదిక సంరక్షణను నిరంతరంగా అందిస్తుండడంలో కీలక సేవా కార్యకలాపాలను నమోదు చేసి, దీర్ఘకాలిక ఆరోగ్య రికార్డును సిద్ధం చేస్తుంది.
తల్లీపిల్లల ఆరోగ్య సేవలను సజావుగా పర్యవేక్షించడాన్ని నిర్ధారించాలన్నదే ఈ డిజిటల్ వేదిక ఉద్దేశం. ప్రసవానికి ముందు చేపట్టే సంరక్షణ, కాన్పునకు సన్నాహాలు, ప్రసవం, ప్రసవం తరువాత తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు, నవజాత శిశువును సంరక్షించడం, ఆ శిశువు విషయంలో ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఎదిగే క్రమంలో చేపట్టాల్సిన సంరక్షణ, కుటుంబ నియంత్రణ వంటివి దీనిలో భాగంగా ఉంటాయి. నిరంతర పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు తగిన ఆలోచనలను అమలుపరుస్తూ, సేవలను అందించే ప్రక్రియను ‘జనని’ బలోపేతం చేస్తుంది. ప్రతి దశలోనూ సంరక్షణ నిరంతరంగా అందేటట్లు తోడ్పడుతుంది.
‘జనని’లో మరో ముఖ్య విశేషాంశం క్యూఆర్-కోడ్‌ను కలిగి ఉండే డిజిటల్ మాతా శిశు ఆరోగ్య (మదర్ అండ్ చైల్డ్ హెల్త్ .. ఎమ్పీహెచ్) కార్డులు. ఇవి ఆరోగ్య రికార్డుల్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే కాక, పోర్టబులిటీకీ వీలు కల్పిస్తాయి. అధిక రిస్క్‌తో కూడిన గర్భావస్థల విషయంలో ఆటోమేటెడ్ అలర్టులు, పర్యవేక్షణతో కూడిన సమీక్షను చేపట్టడానికి రియల్-టైమ్ డ్యాష్‌బోర్డులు, క్రమసూచీ రూపకల్పనల వంటి అనుకూలతలను ఈ ప్లాట్‌ఫారంలో భాగంగా సమకూర్చారు. దీంతో సకాలంలో ట్రాకింగ్, పర్యవేక్షణ, లక్షిత జోక్యాలకు ఆస్కారం ఏర్పడుతుంది.
‘జనని’ని పటిష్ఠ అంతరనిర్వహణీయత సదుపాయాలతో రూపొందించారు. ఈ కారణంగా దీనిని ‘యూ-విన్’ (U-WIN), ‘పోషణ్’ వంటి జాతీయ వేదికలతో జతపరిచేందుకూ వీలుంటుంది. తద్వారా నిరంతరాయంగా డేటాను ఇచ్చి పుచ్చుకోవచ్చు. కార్యక్రమాల్లో మెరుగైన సమన్వయంతో పాటు వివిధ రంగాల్లో లబ్ధిదారుల సమగ్ర పర్యవేక్షణకు కూడా మార్గం సుగమమవుతుంది.
ఏబీహెచ్ఏ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంటు..), ఆధార్ (ఓటీపీ, బయోమెట్రిక్), మొబైల్ నంబరు వంటి విశిష్ట గుర్తింపు సాధనాల్ని ఉపయోగించి లబ్ధిదారుల నమోదుకు జనని వీలు కల్పిస్తుంది. అఖిల భారత స్థాయిలో శోధన (సెర్చ్)కు కూడా సహాయపడుతుంది. దీంతో ప్రవాసంలో ఉన్న వారికి ఆరోగ్య సేవలను నిరంతర ప్రాతిపదికన అందించవచ్చును. రికార్డులు పునరావృతం కాకుండా అడ్డుకోవచ్చును. ఇది వెబ్, మొబైల్ ప్లాట్‌ఫారాల నుంచి స్వీయ నమోదు సదుపాయాన్నీ సమకూరుస్తుంది. ఫలితంగా లబ్ధిదారులు ఆరోగ్య సేవల్ని ఎలాంటి ఇబ్బందుల ప్రసక్తీ లేకుండానే అందుకోగలుగుతారు.
ప్రసవానికి ముందు సంరక్షణ, టీకామందును ఇప్పించడానికి కాలబద్ధ పథక రచన, పర్యవేక్షణను సులభతరం చేయడం ద్వారా పౌరులకు ‘జనని’ సాయపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య విజయాలను నిర్ధారించడం కోసం సందేశాలను పంపుతుంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రాల సమాచారం, కాన్పు జరిగే ప్రదేశానికి సంబంధించిన వివరాలను ఈ డిజిటల్ మాతా, శిశు ఆరోగ్య కార్డు సూచిస్తుంది. ఆరోగ్య విద్య, పోషణకు సంబంధించిన మార్గదర్శకత్వాన్ని సమకూర్చడం ద్వారా విషయాల పట్ల అవగాహనను పెంచుకొని నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. మొత్తంమీద, ‘జనని’ డిజిటల్ ప్రమాణీకరణ, రియల్-టైమ్ పర్యవేక్షణలతో పాటు అంతర రంగ సమన్వయాన్ని ఏకీకరించి, తల్లీబిడ్డల ఆరోగ్యం, వారి ఆలనా పాలనల అధ్యాయంలో పెను సంస్కరణలకు ప్రతీకగా నిలుస్తోంది. దీనితో మెరుగైన సేవల కవరేజీ, జవాబుదారీతనంతో పాటు
దీర్ఘ కాలంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి కూడా తోడ్పాటు లభిస్తుంది.
ఇప్పటి వరకూ చూస్తే, ‘జనని’ 1.34 కోట్ల మంది లబ్ధిదారుల నమోదు పూర్తి చేసింది. 30 లక్షల కన్న ఎక్కువ మంది గర్భిణుల నమోదుతో పాటు 30 లక్షలకు పైగా మాతా శిశువుల ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను ముగించింది. 1 లక్ష కన్న ఎక్కువ బయోమెట్రిక్ సంబంధిత సమాచారాన్ని సరిచూసింది.
‘జనని’కి శ్రీకారం చుట్టడంతో అందరికీ అందుబాటులో ఉండే, సమానావకాశాలతో కూడిన, నాణ్యమైన ఆరోగ్య సేవలకు పూచీ పడాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాలించినట్లయింది. దీనిలో.. డిజిటల్ సాధికారత కల్పన, సంరక్షణను నిరంతర ప్రాతిపదికన అందించడంతో పాటు తల్లీపిల్లల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడంపై దృష్టిని కేంద్రీకరించారు.
***
(రిలీజ్ ఐడి: 2258767)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6