కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తిరువనంతపురంలో ముగిసిన రెండో బ్రిక్స్ ఉపాధి కార్యాచరణ బృంద తొలి రోజు సమావేశం


సామాజిక రక్షణ, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధిలో సహకారం కోసం గొంతెత్తిన బ్రిక్స్ సభ్య దేశాలు

సామాజిక భద్రతా పరిధిని క్రమంగా విస్తరించాలన్న సమష్టి దృక్పథానికి పెరుగుతున్న ఆదరణ

స్వచ్ఛంద, ఏకాభిప్రాయ ఆధారిత యంత్రాంగంగా ‘సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థపై బ్రిక్స్ సామర్థ్యాభివృద్ధి వేదిక’ ప్రతిపాదన

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 6:37PM by PIB Hyderabad

భారత్ అధ్యక్షతన తిరువనంతపురంలో నేడు జరిగిన రెండో బ్రిక్స్ ఉపాధి కార్యాచరణ బృంద (ఈడబ్ల్యూజీ) సమావేశం సభ్య దేశాల ప్రతినిధులందరినీ ఒక్కచోట చేర్చింది. చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, యూఏఈ దేశాల ప్రతినిధులతోపాటు.. వైజ్ఞానిక భాగస్వాములుగా ఉన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం, ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి రోజు ఎజెండాలో భాగంగా.. సామాజిక భద్రత, క్రమబద్ధీకరణ, మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి అనే మూడు ప్రాధాన్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ సమావేశం దృష్టి సారించింది.

 

 

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీమతి వందన గుర్నాని ప్రారంభోపన్యాసం చేశారు. ఉద్యోగ ప్రపంచంలో వస్తున్న సమూల మార్పులను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. సాంకేతిక వేగం, కృత్రిమ మేధ, పర్యావరణ హిత పరివర్తన, జనాభా మార్పులు, గిగ్, ప్లాట్‌ఫారమ్ పనులు వేగంగా విస్తరించడం వంటి అంశాలు అన్ని బ్రిక్స్ దేశాల్లోని కార్మిక మార్కెట్లను పునర్నిర్మిర్దేశిస్తున్నాయని ఆమె వివరించారు. సామాజిక భద్రతా వ్యవస్థలు ఈ మార్పులకు అనుగుణంగా మారేలా చూడడం, మహిళల భాగస్వామ్యాన్ని వేగవంతం చేయడం, నైపుణ్య వ్యవస్థలను బాధ్యతాయుతంగా మార్చడం, డిజిటల్ సాంకేతికతల్లో సమ్మిళితత్వం ఉండేలా చూడడం బ్రిక్స్ సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని ఆమె వ్యాఖ్యానించారు.

సామాజిక భద్రతను పెంపొందించడం, కార్మిక మార్కెట్ క్రమబద్ధీకరణ అనే ప్రథమ ప్రాధాన్య అంశంపై జరిగిన చర్చల్లో ఒక కీలక విషయం స్పష్టమైంది. సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా సామాజిక భద్రతా పరిధిని దశలవారీగా పెంచుకుంటూ పోవాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని ఈ సమావేశం తేల్చింది. ప్రపంచ శ్రామిక శక్తిలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా ఉంది. ఈ రంగంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించినప్పటికీ.. సామాజిక భద్రత అందరికీ చేరడంలో ఇంకా కొన్ని అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలోచనలు, సవాళ్లు, పరిష్కార మార్గాలను పరస్పరం పంచుకోవడం ద్వారా.. జ్ఞాన సముపార్జన, ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవడం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలు ఈ ప్రయత్నంలో కేంద్ర బిందువులుగా నిలుస్తాయని ఈ చర్చల్లో స్పష్టమైంది.

సామాజిక భద్రతను పెంపొందించడం కోసం ప్రతిపాదించిన బ్రిక్స్ సామర్థ్యాభివృద్ధి వేదిక ఒక సముచిత, సమయానుకూల యంత్రాంగంగా గుర్తింపు పొందింది. ఈ ఫోరమ్ ప్రధానంగా డేటా నిర్వహణలో సామర్థ్యాభివృద్ధిపై దృష్టి సారించనుంది. అలాగే అసంఘటిత రంగ కార్మికులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, గిగ్ కార్మికులకు సామాజిక భద్రత సౌకర్యాలను విస్తరించడానికి అవసరమైన సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడంపై, ఈ సౌకర్యాలు అందడంలో అంతరాలను తొలగించేందుకు అవసరమైన పద్ధతులను రూపొందించే అవకాశంపై ఈ వేదిక కృషి చేస్తుంది.

మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం రెండో ప్రాధాన్యాంశం. బ్రిక్స్ దేశాలు ఇందులో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఇంకా కొన్ని నిర్మాణాత్మక అడ్డంకులు కొనసాగుతున్నాయని, వాటిని తొలగించడానికి సమన్వయంతో కూడిన నిరంతర చర్యలు అవసరమని ఈ చర్చలు స్పష్టం చేశాయి. అధిక వృద్ధి ఉన్న రంగాలు, నాయకత్వ బాధ్యతల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి బలమైన, సమ్మిళితమైన విధాన ఏర్పాట్లను రూపొందించాలని బ్రిక్స్ సభ్య దేశాలు ప్రతిపాదించాయి. ప్రతీ దేశ జాతీయ ప్రాధాన్యాలను గౌరవిస్తూనే.. స్వచ్ఛంద సహకారం, ఉత్తమ పద్ధతుల పరస్పర వినిమయంతో ఆచరణాత్మక, సత్ఫలితాలే ప్రాతిపదికగా ఉన్న విధానం ద్వారా ముందుకు సాగాలని సభ్య దేశాలు పిలుపునిచ్చాయి.

ఉపాధి, నైపుణ్యాభివృద్ధి మూడో ప్రాధాన్య రంగం. ఇందులో బ్రిక్స్ దేశాల మధ్య వ్యవస్థీకృత సహకారం ఆవశ్యకమని ఈ చర్చలు స్పష్టం చేశాయి. నైపుణ్య సమాచారాన్ని మెరుగుపరచడం, వివిధ దేశాల వృత్తిపరమైన అర్హతల మధ్య సమానత్వాన్ని పెంపొందించడం, డిజిటల్, పర్యావరణ హిత, కేర్ ఎకానమీ రంగాల్లో వైజ్ఞానిక అంశాలను ఇచ్చిపుచ్చుకునే విధానాలను సులభతరం చేయడంపై.. ప్రతిపాదిత కార్యాచరణ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. నైపుణ్యాలు, విద్యార్హతలను పరస్పరం గుర్తించుకునేలా చేయడంలో సమష్టి, సమన్విత చర్యలు అవసరమని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి, కార్మికుల అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేయడానికి.. ప్రస్తుత అర్హతల విధానాలు, నైపుణ్యాల వర్గీకరణ, వృత్తి విద్యా వ్యవస్థల మధ్య బలమైన అనుసంధానం అవసరమని అంగీకారానికి వచ్చాయి.

వేగంగా మారుతున్న కార్మిక మార్కెట్ పరిణామాల నేపథ్యంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై సభ్య దేశాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అప్రెంటిస్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, వృత్తి విద్య, వ్యవస్థాపకత కార్యక్రమాలను విస్తరించాలని ప్రతిపాదించాయి. ముఖ్యంగా చదువులోగానీ, ఉద్యోగంలోగానీ లేదా ఎటువంటి వృత్తి శిక్షణలోనూ లేని యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించి.. అలాంటి వారి సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించాయి.

తమ దేశాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను, ఉత్తమ పద్ధతులను వివరించే వైజ్ఞానిక సదస్సుల్లో ఈ చర్చల సందర్భంగా సభ్య దేశాలు పాల్గొన్నాయి. పరస్పర సహకారం, అభ్యసనం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారంపై నిర్మాణాత్మక స్ఫూర్తి సర్వత్రా ప్రశంసలనందుకుంది. ప్రతిపాదిత లక్ష్యాలను సాధించగలమనే నమ్మకాన్ని ప్రతినిధులు వ్యక్తం చేశారు. 

***


(రిలీజ్ ఐడి: 2258601) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Malayalam