ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026 మే 8, 9 తేదీల్లో ఏబీ పీఎం-జేఏవై ఆటో అడ్జుడికేషన్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలె, ప్రదర్శన.. ఇండియాఏఐ మిషన్, ఐఐఎస్సీ సహకారంతో బెంగళూరు ఐఐఎస్సీలో కార్యక్రమం
ఆరోగ్య రక్షణలో ఏఐ విస్తరణ, పారదర్శక - డేటా ఆధారిత క్లెయిముల వ్యవస్థను నిర్మించడంపై నిపుణుల బృందాల చర్చ
పారదర్శకత, జవాబుదారీతనం, డేటా గోప్యతలో సవాళ్లను అధిగమించడం లక్ష్యంగా.. అవకతవకలను ఏఐ ద్వారా గుర్తించడంపై ప్రత్యేక సదస్సు
ఏఐ ఆధారిత క్లెయింల నిర్వహణలో ముందంజలో ఉన్న ఏబీ పీఎం-జేఏవై.. రోజూ 1,900కు పైగా చికిత్స ప్యాకేజీలకు సంబంధించి దాదాపు 40,000 క్లెయింల పరిష్కారం: స్వయంచాలక పరిష్కార సామర్థ్యాల్లో కీలక మైలురాయిగా నిలవనున్న హ్యాకథాన్ ప్రదర్శన
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 11:58AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) 2026 మే 8-9 తేదీల్లో ఏబీ పీఎం-జేఏవై స్వీయ పరిష్కార (ఆటో-అడ్జుడికేషన్) హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలె, ప్రదర్శనను నిర్వహించనుంది. బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లోని ఎ.వి. రామారావు ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇండియా ఏఐ మిషన్, ఐఐఎస్సీ బెంగళూరు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ దేశవ్యాప్త హ్యాకథాన్‌కు అనూహ్య స్పందన లభించింది. అధికారిక పోర్టల్ ద్వారా 3,500 మందికి పైగా పేర్లను నమోదు చేసుకున్నారు. ఆవిష్కర్తలు, సాంకేతిక నిపుణులు పరిశోధకులలో పెరిగిన ఈ ఉత్సాహం.. దేశ ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, ప్రభుత్వ ఆరోగ్య బీమా ప్రక్రియల సామర్థ్యాన్ని పెంచడం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడంపై వారి ఆసక్తికి ఇది నిదర్శనం. ఈ కార్యక్రమానికి సంబంధించిన నమోదు ప్రక్రియ 2026 ఏప్రిల్ 13తో ముగిసింది.
గ్రాండ్ ఫినాలే ప్రారంభ సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ముఖ్య ప్రసంగం చేస్తారు. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ సునిల్ కుమార్ బర్న్వాల్, కర్ణాటక ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రిత్విక్ రంజనం పాండే కూడా ఈ సమావేశంలో ప్రసంగిస్తారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎం - జేఏవై) కింద ఆరోగ్య క్లెయిమ్‌ల నిర్వహణ తుది దశను రూపుదిద్దే అత్యాధునిక ఆవిష్కరణల ప్రదర్శనకు ఒక శక్తిమంతమైన వేదికగా ఈ రెండు రోజుల కార్యక్రమం నిలుస్తుందని భావిస్తున్నారు. చికిత్సకు సంబంధించిన డాక్యుమెంట్ల వర్గీకరణ, ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాల (ఎస్టీజీ) అమలు, రేడియోలాజికల్ చిత్రాల ఆధారిత ధ్రువీకరణ, నకిలీ లేదా ఏఐ సృష్టించిన వైద్య పత్రాలను గుర్తించడం వంటి కీలక సమస్యలకు అధునాతన ఏఐ/ఎంఎల్ ఆధారిత పరిష్కారాలను ఫైనల్‌కు చేరిన బృందాలు ఈ హ్యాకథాన్‌లో ప్రదర్శిస్తాయి. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియలో కచ్చితత్వం, వేగం, పారదర్శకతను గణనీయంగా పెంచే సామర్థ్యం వీటిలో ఉన్నాయి. వాస్తవికంగా అమలు చేయడానికి ఇవి ఎంతో అనువైనవి.
ప్రభుత్వం, పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన మేధోమథన బృంద చర్చలకు కూడా ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఇందులో భాగంగా నిర్వహించే ‘భారత ఆరోగ్య రక్షణ రంగం కోసం ఏఐ అభివృద్ధి’ అనే సదస్సులో.. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కింద ఏర్పాటు చేసిన పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ, ఆరోగ్య రక్షణ వ్యవస్థలో ఏఐ ఆవిష్కరణలను విస్తరించే వ్యూహాలపై చర్చించనున్నారు.
‘క్లెయిమ్‌ల పరిష్కార భవిష్యత్తు’ అనే అంశంపై మరో నిపుణుల చర్చ జరగనుంది. కృత్రిమ మేధ, ఆటోమేషన్, పరస్పర అనుసంధాన డిజిటల్ వేదికలు, డేటా ఆధారిత నిర్వహణ వ్యవస్థల సమన్వయం ద్వారా.. ఏబీ పీఎం-జేఏవై కింద క్లెయిమ్‌ల వ్యవస్థను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఎలా తీర్చిదిద్దవచ్చన్న అంశాలపై సవివరంగా ఇందులో చర్చించనున్నారు.
అంతేకాకుండా ‘ఏఐ యుగంలో మోసాలు, వృథా దుర్వినియోగం – సవాళ్లు, అవకాశాలు’ అంశంపై ఒక ప్రత్యేక సదస్సును కూడా నిర్వహిస్తారు. పారదర్శకత, జవాబుదారీతనం, డేటా గోప్యత వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. మోసాలను గుర్తించడంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించవచ్చో ఈ సదస్సులో చర్చిస్తారు.
రోజూ 1,900కు పైగా చికిత్స ప్యాకేజీలకు సంబంధించి దాదాపు 40,000 క్లెయింలను పరిష్కరిస్తున్న ఏబీ పీఎం-జేఏవై.. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య భరోసా పథకాల్లో ఒకటిగా నిలుస్తోంది. క్లెయిముల నిర్వహణలో కృత్రిమ మేధ ఆధారిత పద్ధతులను అవలంబించడంలోనూ ఇది ముందుంది. విస్తృతమైన వైద్య ప్యాకేజీలు, ప్రత్యేక సదుపాయాలకు స్వయంచాలక పరిష్కార మార్గాలను విస్తరించే దిశగా ఎన్‌హెచ్ఏ చర్యల్లో ఈ హ్యాకథాన్ ప్రదర్శన ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
ఈ కార్యక్రమ ముగింపు వేడుకలో విజేతలను సత్కరించనున్నారు. పారదర్శకమైన, సమర్థమైన, సాంకేతికతతో నడిచే క్లెయిముల వ్యవస్థను రూపొందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా.. వాస్తవికంగా అమలు చేయగల సామర్థ్యమున్న మార్గాలను ఆవిష్కరించిన బృందాలను ఈ సందర్భంగా సత్కరిస్తారు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం, ఆరోగ్య రక్షణ సదుపాయాలను అందుబాటులోకి తేవడంలో బాధ్యతాయుతంగా కృత్రిమ మేధను వినియోగించుకోవడంలో తన నిబద్ధతను ఈ కార్యక్రమం ద్వారా ఎన్‌హెచ్ఏ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు, వైద్య సేవలు అందించే సంస్థలకు ఆరోగ్య సేవల్లో సౌలభ్యాన్ని అందించడం, సేవల నాణ్యతను పెంచడం, మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ రెండు రోజుల కార్యక్రమానికి సంబంధించి సదస్సుల వారీగా వివరాలను ఇక్కడ చూడొచ్చు: https://nha.gov.in/ip/Draft_Hackathon_Program_Agenda05.05.2026.pdf
***
(రిలీజ్ ఐడి: 2258412)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6