ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య సహకారాన్ని బలోపేతం చేసుకున్న భారత్, జపాన్

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆరోగ్య రక్షణపై మూడో సంయుక్త కమిటీ సమావేశం

మెరుగైన ఫలితాల దిశగా ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, అందరికీ ఆరోగ్య సేవలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అన్న ఉమ్మడి విలువలే ఆరోగ్య రక్షణలో భారత్, జపాన్ సహకారానికి చోదకాలు: శ్రీ జె.పి. నడ్డా

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మార్గదర్శక నిర్దేశంలో సమ్మిళిత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన శ్రీ నడ్డా

ఆవిష్కరణ, సాంకేతికత, పరిశోధన ద్వారా ఆరోగ్య రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జపాన్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్న ఆ దేశ ఆరోగ్య రక్షణ విధాన ఇన్‌చార్జి మంత్రి కిమి ఒనోడా

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 1:53PM by PIB Hyderabad

ఆరోగ్య రక్షణపై భారత్, జపాన్ మూడో సంయుక్త కమిటీ సమావేశాన్ని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించారు. భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా, జపాన్ ఆరోగ్య రక్షణ విధాన ఇన్‌చార్జి మంత్రి కిమి ఒనోడా ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు.

 

 

 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ జపాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. పరస్పర గౌరవం, నమ్మకం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథం భారత్, జపాన్ భాగస్వామ్యానికి ప్రాతిపదికలని ఆమె అన్నారు. భారత్ - జపాన్ సహకార ఒప్పందం కింద జరిగిన ఈ సంయుక్త కమిటీ సమావేశం.. నిరంతర చర్చలు, బలమైన పరస్పర అవగాహనలతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ముఖ్య వేదికగా నిలిచిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జరిగే చర్చలు నిర్మాణాత్మకంగా, భవిష్యత్ ఆశాజనకంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

ఈ సందర్భంగా శ్రీ నడ్డా మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి, సరికొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి అంకితభావాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, సంక్షేమంపై సహకార ఒప్పందం ఆధారంగా భారత్ - జపాన్ మధ్య ఆరోగ్య రక్షణ సహకారం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడం, మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలు ఈ సహకారానికి ప్రాతిపదికలని స్పష్టం చేశారు.

 

 

 

శతాబ్ద కాలానికి పైగా వివిధ రంగాల్లో కొనసాగుతున్న సంబంధాల వల్ల భారత్, జపాన్ మధ్య బహుముఖీనమైన, సుదీర్ఘమైన అనుబంధం ఏర్పడిందని శ్రీ నడ్డా వివరించారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ మార్గదర్శక సూత్రంగా సమ్మిళిత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆరోగ్య రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సంయుక్త కమిటీ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, పరిశోధనల ద్వారా ఆరోగ్య రంగ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో జపాన్ ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటుందని ఆ దేశ మంత్రి ఒనోడా పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తమ దేశం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

 

ఈ సంయుక్త కమిటీ సమావేశంలో కీలక ప్రాధాన్య రంగాలపై సవివరమైన ప్రజెంటేషన్లు, చర్చలు నిర్వహించారు:

అసాంక్రమిక వ్యాధుల నివారణ, నిర్ధారణ, చికిత్స, పునరావాసం:

 

పెరుగుతున్న వ్యాధుల తీవ్రతను, ముఖ్యంగా అసాంక్రమిక వ్యాధుల ఉధృతి పెరుగుతుండడాన్ని భారత్ బృందం వివరించింది. వీటిని అరికట్టడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, నిరంతర సంరక్షణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నిరంతర ఆరోగ్య రక్షణ కార్యక్రమాలతో కూడిన సమగ్ర కార్యాచరణను వారు వివరించారు. మరోవైపు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ముందస్తు వ్యాధి గుర్తింపు, సాంకేతిక సహకారం - సంస్థాగత సామర్థ్యాభివృద్ధి ద్వారా చికిత్స వ్యవస్థలను బలోపేతం చేసే ప్రాజెక్టులు సహా.. జపాన్ సహకారంతో చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలను ఆ దేశ ప్రతినిధులు వెల్లడించారు.

 

 

 

బలమైన సరఫరా వ్యవస్థ, అందుబాటులోకి నాణ్యమైన ఔషధాలు, సేవలు:

 

ఔషధ, వైద్య పరికరాల రంగాల విస్తృతిని, సామర్థ్యాన్ని ఈ సందర్భంగా భారత బృందం వివరించింది. ముఖ్యంగా దేశీయంగా తయారీని బలోపేతం చేయడం, ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడం, కచ్చితమైన విధాన చర్యల ద్వారా తక్కువ ధరకే అందేలా చూడడంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇక జపాన్ విషయానికి వస్తే.. ఔషధ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచడానికి, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడానికి, వ్యవస్థీకృత భాగస్వామ్యాల ద్వారా సాంకేతికతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి తాము అనుసరిస్తున్న ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్య నమూనా గురించి ఆ దేశ ప్రతినిధులు వివరించారు.

 

 

 

డిజిటల్ హెల్త్:

 

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా భారత్ విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విధానాన్ని మన దేశ ప్రతినిధులు వివరించారు. పరస్పర సమన్వయంతో, సురక్షితంగా, పౌరుల అవసరాలే కేంద్రంగా పనిచేసే ఒక డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను రూపొందించి, ఏకీకృతం చేయడంలో భారత్ సాధించిన పురోగతిని తెలియజేశారు. మరోవైపు వివిధ వ్యవస్థల అనుసంధానం, ఏఐ ఆధారిత వైద్య సాంకేతికతలు, సరికొత్త డిజిటల్ వేదికల ద్వారా సాగుతున్న ఉమ్మడి పరిశోధనల పురోగతిలో తమ అనుభవాన్ని జపాన్ ప్రతినిధులు పంచుకున్నారు.

 

మానవ వనరుల అభివృద్ధి, వినిమయం:

 

నైపుణ్యం కలిగిన, ప్రపంచస్థాయి వైద్య సిబ్బందిని తీర్చిదిద్దడంలో తన విధానపరమైన, నియంత్రణ వ్యవస్థల ప్రాధాన్యాన్ని భారత్ వివరించింది. ఇరు దేశాల మధ్య ఆదానప్రధానాలు, ఉమ్మడి శిక్షణ, ఒకరి నైపుణ్యాలను మరొకరు గుర్తించేలా రూపొందించిన నిర్మాణాత్మక మార్గాలనూ వెల్లడించింది. మరోవైపు వైద్య రంగంలో ఉమ్మడి పరిశోధనలు, సిబ్బంది ఆదానప్రధానాలు, వైజ్ఞానిక సహకార కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న ఒప్పందాల వివరాలను జపాన్ ప్రతినిధులు తెలియజేశారు.

 

ఈ చర్చలు భారత్ - జపాన్ ఆరోగ్య భాగస్వామ్యానికి నవోత్తేజాన్నిచ్చాయని, కీలక ప్రాధాన్య రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని.. ప్రసంగం ముగింపు సందర్భంగా శ్రీ నడ్డా పేర్కొన్నారు. పటిష్టమైన, సమ్మిళిత ఆరోగ్య వ్యవస్థల బలోపేతం దిశగా ఈ చర్చలు స్పష్టమైన నిర్దేశాన్నిచ్చాయని స్పష్టం చేశారు.

ఈ సమావేశ ఫలితాలు సహకారాన్ని పెంపొందించుకోవడానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ఉమ్మడి లక్ష్యాన్ని అర్థవంతమైన ఫలితంగా మలిచేందుకు జపాన్‌తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

 

ఈ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జపాన్ కట్టుబడి ఉందని ఒనోడా స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు జపాన్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

 

ప్రజలకు మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించే దిశగా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆశాభావం వ్యక్తం చేయగా.. సానుకూల వాతావరణంలో ఈ సమావేశం ముగిసింది.

****


(రిలీజ్ ఐడి: 2258067) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Kannada