రైల్వే మంత్రిత్వ శాఖ
తొలిసారి ప్రయాణిక రైలు ద్వారా జమ్మూ-కాశ్మీర్‌ల మధ్య ప్రత్యక్ష సంధానం
జమ్మూలో ఒకసారి మారితే దేశంలో ఎక్కడి నుంచయినా కాశ్మీర్ లోయకు చేరుకోవచ్చు
ఈ రైలు ద్వారా ప్రత్యక్ష అనుసంధానంతో అన్ని కాలాల్లోనూ కాశ్మీర్‌కు ప్రయాణానుభవం సుసంపన్నం అవుతుంది
ఈ ప్రాంతంతో జమ్మూ తావి-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ నిరంతర సంధానం ద్వారా పర్యాటక అవకాశాలు పెరుగుతాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత జూన్‌లో ప్రారంభించిన తర్వాత వందే భారత్ రైలుకు లభించిన ప్రజాదరణ ఫలితంగా అది 8 నుంచి 20 కోచ్‌లకు విస్తరించింది: శ్రీ అశ్వనీ వైష్ణవ్
దేశంలోని వివిధ ప్రాంతాలకు కాశ్మీర్ లోయ నుంచి 2 కోట్ల కిలోల ఆపిల్ రవాణా అవుతుంది
దేశంలోకి సిమెంట్ సరఫరాతో కాశ్మీర్ లోయలో బస్తాకు రూ.50 దాకా ధర తగ్గింది
ఆహార ధాన్యాలు.. ఎరువులు.. ఉప్పు.. పాలు కూడా ఈ ప్రాంతానికి రవాణా అవుతుండగా నిత్యావసర సరఫరా వ్యవస్థలు కూడా బలోపేతం అవుతున్నాయి
స్థానిక ఆర్థిక వ్యవస్థను.. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కాశ్మీర్ లోయలో లైన్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ పెంచుతోంది
అంబాలా-జమ్మూ మల్టీ-ట్రాక్ పనులు కొనసాగుతుండగా ప్రాంతీయ సంధానం మెరుగు కోసం పూంచ్-రాజౌరి కొత్త మార్గానికి ప్రణాళిక సిద్ధమైంది
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (యూఎస్‌బీఆర్‌ఎల్) పరిధిలోని అంజి ఖాడ్-చెనాబ్ వంతెనలను తనిఖీ చేసిన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 APR 2026 6:50PM by PIB Hyderabad
జమ్మూలో రైలెక్కితే నేరుగా శ్రీనగర్ చేరుకోవాలనే ప్రజానీకం స్వప్నం ఊహలకే ఎక్కువగా పరిమితమైపోయింది. అయితే, ఇది ఒకప్పటి మాట... ఈ రోజున అటువంటి ఆలోచన గతకాలపు జ్ఞాపకంగా మారి, చరిత్రగా మారింది. ఈ మేరకు జమ్మూ తావి రైల్వే స్టేషన్ వరకు విస్తరించిన శ్రీనగర్–శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రారంభించారు. దీంతో తొలిసారిగా జమ్మూ, కాశ్మీర్‌ల మధ్య ప్రయాణిక రైలు ద్వారా ప్రత్యక్ష సంధానం వాస్తవ రూపం దాల్చింది. నిరంతరం ప్రయాణించే ఈ రైలు రెండు అత్యంత ప్రతిష్టాత్మక గమ్యాలను ఇలా కలుపుతుంది. ఇది వేగవంతమైన ప్రయాణానుభవం ఇవ్వడమే కాకుండా, అద్భుత ప్రకృతి నేపథ్యంతో ప్రజలు, వాణిజ్యం, పర్యాటక రంగాలు మమేకం కావడంలో ఒక వినూత్న పరిణామానికి నాంది పలుకుతుంది.
రైల్వే రంగానికి కీలక ప్రవేశ ద్వారంగా జమ్మూ తావి
ఉత్తర భారతంలోని అత్యంత కీలక రైల్వే స్టేషన్లలో జమ్మూ తావి ఒకటి. ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ప్రధాన ప్రవేశ ద్వారంగా ఇది ఉపయోగపడుతుంది. కన్యాకుమారి, హౌరా, ముంబయి సహా ఇతర మహానగరాల వంటి ప్రధాన గమ్యాలకు విస్తృత రైలు సంధానంతో ఈ ప్రాంతాల మధ్య నిరంతర రవాణాకు భరోసా ఇవ్వడంలో ఈ స్టేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఈ రైలును ప్రారంభించిన సందర్భంగా తాజా పరిణామాల ప్రాధాన్యాన్ని తన ప్రసంగంలో వివరిస్తూ- జమ్మూ కాశ్మీర్‌లో రైలు సంధాన విస్తరణతో రైల్వేల చరిత్రలో ఓ కీలక ఘట్టం నమోదైందని మంత్రి శ్రీ వైష్ణవ్ పేర్కొన్నారు.
ఈ రైలు ఇప్పుడు జమ్మూ తావి వరకూ ప్రయాణిస్తుంది కాబట్టి, దేశవ్యాప్తంగాగల ప్రయాణికులు శ్రీ మాతా వైష్ణో దేవి, శ్రీ అమర్‌నాథ్ వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలకు సులభంగా, సౌకర్యవంతంగా చేరుకోగలరని చెప్పారు.
అధిక డిమాండ్... మెరుగైన ప్రయాణానుభవం
వందే భారత్ సర్వీసు ఆరంభం నుంచే పూర్తి స్థాయిలో నిండుగా ప్రయాణిస్తున్నదని, ఈ రైలుకు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది సంకేతమని రైల్వేశాఖ మంత్రి చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌తో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ ఇది జీవనాడిగా ప్రాముఖ్యం సంతరించుకుంటున్నదని గుర్తుచేశారు. ఆ మేరకు ఈ రోజు జమ్మూ-శ్రీనగర్ మధ్య 20 కోచ్‌లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసును ప్రారంభించామని తెలిపారు. ఈ కీలక మార్గంలో ప్రయాణికుల సామర్థ్యం గణనీయంగా పెరగడాన్ని ఈ పరిణామం సూచిస్తున్నదని ఆయన చెప్పారు.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత ఏడాది జూన్ 6న జమ్మూ-శ్రీనగర్ రైలు మార్గాన్ని ప్రారంభించిన ఏడాది లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం హర్షదాయకమన్నారు. ఈ ప్రాంతంలో నిరంతర రైల్వే సంధానానికి ఇది పునాది వేసిందని రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ సర్వీసును విస్తరించడంతో ఈ చారిత్రక కారిడార్ మరింత బలోపేతం కాగలదని, ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పారు. తద్వారా ప్రయాణిక డిమాండ్‌ను తీరుస్తూ జమ్మూ, శ్రీనగర్ మధ్య అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని పటిష్టం చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో సున్నా డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత సహా కఠిన వాతావరణ పరిస్థితులలో నడపేందుకు తగినట్లుగా ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారని తెలిపారు. అలాగే, రైలులోని పరికరాలు నిరంతరాయం పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థలను అమర్చినట్లు చెప్పారు.
ఈ రైలులో అధునాతన ఎలక్ట్రానిక్స్, హై-ఎండ్ సెమీకండక్టర్ ఆధారిత వ్యవస్థలను పొందుపరిచారని, దీంతో అత్యంత ఆధునికమైన, సాంకేతికంగా అధునాతన రవాణా సాధనంగా ఇది రూపొందిందని శ్రీ వైష్ణవ్ ప్రముఖంగా వివరించారు. రైలులో డోగ్రీ వంటకాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు ప్రాంతీయ సంస్కృతిని అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ మార్గంలో ప్రయాణికులకు జమ్మూకాశ్మీర్ సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, భాష, సంగీతం, పాక సంప్రదాయాలతో పరిచయం ఏర్పడుతుందన్నారు. తద్వారా వారి ప్రయాణం మరింత సుసంపన్నం అవుతుందని శ్రీ వైష్ణవ్ అన్నారు.
జమ్మూకాశ్మీర్... భూలోక స్వర్గం
“భూలోక స్వర్గం”గా ప్రపంచం అభివర్ణించే జమ్మూకాశ్మీర్ తన అద్భుత సహజ సౌందర్యం, మంచు నిండిన పర్వతాలు, పచ్చని లోయలు, ప్రశాంత సరస్సులకు ప్రసిద్ధి చెందింది. ఆప్యాయత, దృఢ సంకల్పం గల సమాజాలకు ఈ ప్రాంతం నిలయం. వారి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఈ ప్రాంతానికొక ప్రత్యేక గుర్తింపునిస్తుంది. రైల్వే సంధానం మెరుగవడంతో పర్యాటకం మరింత వృద్ధి చెందుతుందని చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా మరింతమంది ప్రజలకు ఈ ప్రాంత సుందర దృశ్యాలు, సాంస్కృతిక వైభవం అనుభవంలోకి వస్తుందని భావిస్తున్నారు.
మెరుగైన రైల్వే మౌలిక సదుపాయాలు స్థానిక ఉత్పత్తులకు రవాణా సౌలభ్యం కల్పించడంతోపాటు ఆర్థిక వృద్ధికీ దోహదం చేస్తాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. నాణ్యమైన డ్రై ఫ్రూట్స్, సున్నితమైన పష్మినా శాలువలు, ఆపిల్, సంప్రదాయ చేనేత తివాచీల (కలీన్)కు జమ్మూ కాశ్మీర్ ప్రసిద్ధి. వీటన్నిటికీ దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. రైలు మార్గ సంధానం మెరుగుతో ఇప్పుడు వీటన్నిటినీ జాతీయ మార్కెట్లకు వేగంగా, సమర్థంగా చేర్చడం వీలవుతుంది. తద్వారా స్థానిక జీవనోపాధికి మద్దతు సహా వాణిజ్య అవకాశాలు కూడా విస్తరిస్తాయి.
వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు ఊతం
ఇంతటి ఎత్తైన ప్రదేశాలలో రైల్వే కార్యకలాపాలను నిర్వహించే విషయంలో భారత్‌కు ఇదే తొలి అనుభవమని.. ఇక్కడ నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో చేపట్టే మౌలిక వసతుల అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటాయని శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ రైల్వే మార్గం ఈ ప్రాంతంలో రవాణా ఖర్చులను తగ్గించి సరుకు రవాణాను గణనీయంగా మెరుగుపరచటంతో పాటు ఎరువులు, పాల వంటి అవసరమైన డెయిరీ ఉత్పత్తుల రవాణాను సజావుగా జరిగేలా చూస్తోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా చెర్రీస్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను కూడా పార్శిల్ సేవల ద్వారా రవాణా చేయడం వల్ల స్థానిక రైతులకు మార్కెట్ అవకాశాలు మరింత మెరుగయ్యాయని అన్నారు.
ఈ రైలు నెట్‌వర్క్ రవాణాను సరళతరం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడిందని ఆయన ఉద్ఘాటించారు. భవిష్యత్తులో హిమాలయ ప్రాంతంలో భద్రత, విశ్వసనీయతను నిర్ధారించడానికి నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, వంతెనలు- సొరంగాల కోసం అధునాతన సాంకేతికతలను ఉపయోగించడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
కాశ్మీర్ లోయలో రైలు సరుకు రవాణా, ఆర్థిక సంబంధాలు
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ (యూఎస్‌బీఆర్‌ఎల్) పూర్తి కావడంతో కాశ్మీర్ లోయ భారత్‌లోని మిగిలిన రైల్వే నెట్‌వర్క్‌తో సజావుగా అనుసంధానమైంది. ఇది ప్రయాణికులకు ప్రయోజనాన్ని చేకూర్చడమే కాకుండా ఈ ప్రాంతంలో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలను కూడా గణనీయంగా పెంచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్ బ్రిడ్జ్, అంజి ఖాద్ బ్రిడ్జ్ వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు ఈ ప్రాంతానికి నిరంతర, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రైల్వే సౌకర్యాన్ని అందించాయి. ఈ పరివర్తనాత్మక మౌలిక సదుపాయాలు క్రమబద్ధమైన సరుకు రవాణాకు మార్గం సుగమం చేశాయి. ఇది రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించి విశ్వసనీయతను మెరుగుపరిచింది. ఇది జాతీయ సరఫరా గొలుసులతో ఈ లోయను మరింత సన్నిహితంగా అనుసంధానం చేసింది.
జమ్మూ-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే మంత్రి జమ్మూ నుంచి కత్రా వరకు ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తూ ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు 2 కోట్ల కిలోల సేపులను రైల్వే నెట్‌వర్క్ ద్వారా శ్రీనగర్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసినట్లు తెలిపారు.
ఆ తర్వాత శ్రీ అశ్వినీ వైష్ణవ్ అంజి ఖాద్ వంతెన, చీనాబ్ రైల్ వంతెనలను పరిశీలించారు.
జమ్మూ కాశ్మీర్‌లో మెరుగైన రైలు అనుసంధానం వల్ల సరుకు రవాణా కార్యకలాపాలు గణనీయంగా మెరుగుపడ్డాయని.. ఇది నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి దోహదపడిందని రైల్వే మంత్రి పేర్కొన్నారు. మెరుగైన రవాణా సామర్థ్యం వల్ల వస్తువులు మరింత తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. అందులో భాగంగా సిమెంట్ రవాణా ఖర్చులు తగ్గడంతో ఒక్కో సంచిపై రూ. 50 వరకు తగ్గాయని.. ఇది ఆ ప్రాంతంలో రైలు ఆధారిత సరఫరా గొలుసుల మెరుగుదలపై ఉన్న సానుకూల ప్రభావాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు.
ఈ నెల ప్రారంభంలో పశ్చిమ రైల్వేకు చెందిన అహ్మదావాద్ డివిజన్.. జమ్మూ కాశ్మీర్‌కు పాల ఉత్పత్తులను తీసుకెళ్లే మొదటి కార్గో రేక్‌ను పంపింది. ఇది సుదూర సరుకు రవాణా అనుసంధానంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అలాగే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. కాశ్మీర్ లోయలో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆదర్శ్ నగర్, బుద్గామ్ మధ్య రోజువారీ సరుకు రవాణాను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 30 గంటల లోపే ఇరువైపుల రవాణా సాధ్యమవుతోంది. సరఫరా గొలుసును మరింత బలోపేతం చేస్తూ అంబాలా నుంచి అనంతనాగ్‌కు మొదటి వర్మికంపోస్ట్ ఎరువుల వ్యాగన్ చేరేలా జమ్మూ డివిజన్ చర్యలు తీసుకుంది.
ఈ ఏడాది జనవరిలో 2,768 మెట్రిక్ టన్నుల బియ్యంతో ఉన్న 42 వ్యాగన్లతో కూడిన మొదటి పూర్తి రేక్ అనంతనాగ్‌కు చేరుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో దాదాపు 1,384 టన్నుల ఆహార ధాన్యాలను తీసుకెళ్తున్న మొదటి ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) సరుకు రవాణా రైలు అనంతనాగ్ గూడ్స్ టెర్మినల్‌కు చేరుకుంది. అంతకుముందు గత ఏడాది అక్టోబర్‌లో 1,350 టన్నుల పారిశ్రామిక ఉప్పుతో గుజరాత్‌లోని ఖరాఘోడా నుంచి ప్రారంభమైన మొదటి రైలు అనంతనాగ్‌కు చేరుకుంది. ఈ పరిణామాలు ఈ ప్రాంతంలో పెరుగుతున్న సరుకు రవాణా కార్యకలాపాలను ప్రధానంగా తెలియజేస్తున్నాయి.
భవిష్యత్తు విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి
పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి జమ్మూ తావి స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని.. ఇందులో భాగంగా ప్లాట్‌ఫాంల విస్తరణ, అదనపు ప్రవేశ ద్వారాలు, మెరుగైన ప్రయాణికుల సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు లైన్ డబ్లింగ్, కీలకమైన మార్గాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడంతో సహా విస్తృత మౌలిక సదుపాయాల కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్, దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
జలంధర్–జమ్మూ విభాగంలో డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఢిల్లీ–అంబాలా విభాగాన్ని నాలుగు లైన్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. దీనికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సామర్థ్యాన్ని పెంచేందుకు ఖాజీగుండ్, బారాముల్లా మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. పూంచ్–రాజౌరీ రైల్ లింక్, ఉరీ–బారాముల్లా పొడిగింపు వంటి ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రణాళిక, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) దశలలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఖాజీగుండ్-బారాముల్లా లైన్ డబ్లింగ్.. కాశ్మీర్ లోయ గుండా సరుకు, ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని పెంచటంతో పాటు రద్దీని తగ్గిస్తుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించి.. వస్తువులు, పర్యాటకుల రాకపోకలను సులభతరం చేస్తుంది. చారిత్రాత్మకంగా తగినంత ప్రాతినిధ్యం లేని రెండు జిల్లాలను మొదటిసారిగా జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తుంది. ఇది స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, విద్య విషయంలో మెరుగైన సదుపాయాలను అందిస్తుంది. అలాగే ఉరీ–బారాముల్లాను పొడగించటం వల్ల సరిహద్దు దిశగా రైలు సౌకర్యం మరింత పెరుగుతుంది. ఇది మారుమూల ప్రాంతాలను పర్యాటకం, వాణిజ్యాలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజల స్థైర్యాన్ని బలపరుస్తుంది.
ఈ ప్రాజెక్టులన్నీ కలిసి ఈ ప్రాంతంతో రోడ్డు రవాణాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఇక్కడ కొండచరియలు విరిగిపడటం, భారీగా మంచు కురవడం, తీవ్రమైన శీతాకాల పరిస్థితుల వల్ల రోడ్డు రవాణా తరచుగా అంతరాయాలకు గురవుతుంటుంది. ఇవి పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఈ ప్రాంతం అంతటా ఉన్న వర్గాలకు సామాజిక- ఆర్థిక సమగ్రతను పెంపొందించడంలో తోడ్పడతాయి.
శ్రీనగర్-కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జమ్మూ తావి వరకు పొడిగించడం అనేది ఈ ప్రాంతాన్ని జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో మరింతగా అనుసంధానించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, వాణిజ్యాన్ని సులభతరం చేయడం, మొత్తం అనుసంధానాన్ని మెరుగుపరచడం వైపు వేసిన మరో అడుగు. దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాలతో అన్ని వైపుల నుంచి జమ్మూ బాగా అనుసంధానమై ఉంది. జమ్మూలో అనుకూలమైన ఇంటర్‌చేంజ్ ఉండటం వల్ల దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులు ఇప్పుడు కాశ్మీర్ లోయను సులభంగా చేరుకోవచ్చు. ఈ అభివృద్ధి ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి.. దేశంలోని ఇతర ప్రాంతాలతో కాశ్మీర్ లోతైన ఆర్థిక అనుసంధానానికి మార్గం సుగమం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2257186)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14