సహకార మంత్రిత్వ శాఖ
లడఖ్‌లో అనేక పాడి సంబంధిత మౌలిక సదుపాయాలతో పాటు సహకార రంగ కార్యక్రమాలను ప్రారంభించనున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
లడఖ్‌లో పాడి రంగ మౌలిక సదుపాయాలకు ఊతం... పాల ప్రాసెసింగ్ యూనిట్లను, మిల్క్ కూలింగ్ సిస్టమ్స్‌ను, సంచార పరీక్షా సదుపాయాలను ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా
సహకార రంగంలో డిజిటల్ సాధికారతను బలోపేతం చేయడానికి ఆండ్రాయిడ్ ఆధారిత ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎమ్‌సీఎస్)కు శ్రీకారం
మార్కెట్ సంబంధాల్ని ప్రోత్సహించే దృష్టితో డెయిరీ ఉత్పాదనల మార్కెటింగ్, పంపిణీ కోసం ఎమ్ఓయూలపై సంతకాలు
నాడు పోస్టు చేయడమైనది:
30 APR 2026 3:19PM by PIB Hyderabad
సహకార రంగం దన్నుతో గ్రామీణాభివృద్ధిని పటిష్ఠపరిచేందుకు, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ముఖ్య నిర్ణయంలో భాగంగా అనేక కార్యక్రమాలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించనున్నారు. 2026 మే నెల 1న లేహ్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్ (సీఐబీఎస్)లో ఏర్పాటు చేసే సభలో ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కేంద్ర మత్స్య పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌తో పాటు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ వినయ్ కుమార్ సక్సేనా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, కోల్డ్-చైన్ వ్యవస్థలను మెరుగుపరచడం, స్థానిక పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ సంబంధాల్ని విస్తరించే ఉద్దేశంతో వేర్వేరు డెయిరీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవం, మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాంతంలో కోఆపరేటివ్ డెయిరీ నిర్వహణ కార్యకలాపాల్ని ఆధునికీకరించడానికి డిజిటల్, సంస్థాగత కార్యక్రమాలను ఆరంభిస్తారు.
ఇదే కార్యక్రమంలో మంత్రి ... 10 టీఎల్‌పీడీ సామర్థ్యం కలిగివుండే డెయిరీ ప్లాంటుకు కార్గిల్‌లో శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు లేహ్‌లో పెరుగు, పన్నీరు ఉత్పాదనలు సహా కొత్త డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తారు. దీనికి అదనంగా పాల నిల్వ, రవాణా మౌలిక సదుపాయాలను దృఢతరంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఒక బల్క్ మిల్క్ కూలర్ వ్యవస్థను కూడా ప్రారంభిస్తారు.
సహకార రంగంలో డిజిటల్ సాధికారత దృష్టికోణాన్ని పటిష్ఠపరిచే దిశగా, కొనుగోలు ప్రక్రియల్ని సువ్యవస్థీకరించేందుకు, రైతులకు చెల్లింపుల్లో పారదర్శకతను నిర్ధారించేందుకు ఆండ్రాయిడ్ ఆధారిత ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎమ్‌సీఎస్) అప్లికేషన్‌ను ప్రారంభించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా ఒక మొబైల్ మిల్క్ టెస్టింగ్ లేబొరేటరీని కూడా ప్రారంభిస్తారు. ఇది నాణ్యతను నిర్ధారిస్తుంది. క్షేత్ర స్థాయిలో పాడి రైతులకు సహకారాన్ని అందిస్తుంది. కీలక ఆసక్తిదారుల నడుమ పాడి ఉత్పాదనల మార్కెటింగ్‌కు ప్రోత్సాహాన్నిచ్చేందుకు ఒక అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ)పై సంతకాలు చేయనున్నారు. దీంతో స్థానిక ఉత్పాదనలకు మెరుగైన మార్కెట్టు అందుబాటులోకి వస్తుంది. స్థానిక ఉత్పత్తిదారులకు మంచి ధర లభించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
రైతుల సంక్షేమంపై, సహకార రంగ సాధికారతపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు అనుగుణంగానే ఈ ప్రాంతంలోని ప్రగతిశీల పాడి రైతులను సత్కరించనున్నారు. సహకార సంస్థలకు సాధికారతను కల్పించే, దేశంలో సుదూర ప్రాంతాల్లో ఆర్థిక పురోగతి పలాలను అన్ని వర్గాలకూ అందించడాన్ని ప్రోత్సహించే దిశగా ‘‘సహకార్ సే సమృద్ధి’’ దార్శనికతను సాకారం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2257011)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14