ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో ప్రపంచ విలువ, సరఫరా గొలుసులకు భారత్ విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవిస్తోంది: కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు
భారతదేశ ఏఐ, డేటా విప్లవానికి చోదకశక్తిగా నిలుస్తూ, విశాఖపట్నం “ఏఐ పట్నం”గా మారనుంది: కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
28 APR 2026 1:55PM by PIB Vijayawada
విశాఖపట్నం
తేదీ: 28.04.2026
బలమైన విధానపరమైన మద్దతు, దార్శనిక నాయకత్వంతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రపంచ విలువ, సరఫరా గొలుసులలో భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల సమక్షంలో విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్.. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. విశాఖపట్నం ఏర్పాటుకానున్న 1 గిగావాట్ హైపర్స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఈ ప్రాజెక్టలో ఒక భాగం. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుర్లవాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాలలో సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించింది.

ఎలక్ట్రానిక్స్, తయారీ రంగంలో భారత్ అభివృద్ధి:
ఇప్పటికే ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న భారత్.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వేగంగా పురోగమిస్తోందని శ్రీ అశ్విని వైష్ణవ్ తెలిపారు.
సెమీకండక్టర్లు, క్వాంటం సాంకేతికత, అంతరిక్షం, కృత్రిమ మేధా వంటి కీలక సాంకేతిక రంగాలలో భారత్ ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి సాధించాలన్న ప్రధాని మోదీ దార్శనికతను ప్రశంసించారు.
మొబైల్ తయారీ రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని, దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో మొబైళ్లు అగ్రస్థానంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. దేశీయ ఎలక్ట్రానిక్ డిమాండ్లో దాదాపు 50% స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపిన కేంద్ర మంత్రి.. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద దేశంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు ప్రకటించారు.
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా అభివృద్ధి చెందుతుందన్నారు. గూగుల్ సహా ప్రపంచ టెక్ కంపెనీలు వాటి సర్వర్లు, జీపీయూలు, చిప్ల తయారీని భారత్ లో చేపట్టాలని పిలుపునిచ్చారు.
PFFK.jpeg)
ఏఐ కేంద్రంగా ఆవిర్భవిస్తున్న విశాఖపట్నం:
గూగుల్ ఏఐ ప్రాజెక్టు ఏర్పాటు విప్లవాత్మకమైనదిగా అభివర్ణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ పెట్టుబడులతో విశాఖపట్నం ఇప్పుడు “ఏఐ పట్నం” (ఏఐ సిటీ)గా మారుతోందన్నారు.
ఐటీ పర్యావణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దార్శనికతను ఆయన ప్రశంసించారు. ఈ కొత్త ఏఐ డేటా సెంటర్ విద్య, ఆరోగ్య సంరక్షణ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని తెలిపారు.
ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ద్వారా ప్రపంచ డిజిటల్ మార్గాలను అనుసంధానిస్తూ, విశాఖపట్నం నుంచి మూడు సముద్రగర్భ కేబుళ్లను వేస్తున్నందుకు గూగుల్కు అశ్వినీ వైష్ణవ్ ధన్యవాదాలు తెలిపారు.
పరిశ్రమల నాయకులు వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేశారు. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే మాట్లాడుతూ.. ఈ ఏఐ హబ్ 'వికసిత భారత్ 2047'కు పునాది అని, భారతదేశ డిజిటల్ పరివర్తన, ప్రపంచ ఏఐ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
వన్ గిగావాట్ హైపర్స్కేల్ ఏఐ డేటా సెంటర్ భారతదేశ ఏఐ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిగా అభివర్ణించిన అదానీ గ్రూప్ చైర్మన్ జీత్ అదానీ.. ఈ ప్రాజెక్టు విశాఖపట్నంను భారతదేశ నూతన డిజిటల్ గేట్వే గా నిలుపుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, సీనియర్ రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, పారిశ్రామిక నాయకులు, గూగుల్, అదానీ గ్రూప్, ఎయిర్టెల్ నెక్స్ట్రా, ఇతర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
****
(రిలీజ్ ఐడి: 2256333)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6