ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగ విలువ-సరఫరా వ్యవస్థలలో... ప్రపంచ ప్రధాన, విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ రూపొందుతుంది


· విశాఖపట్నంలో ‘గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్’ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రకటన

· భారత ‘ఏఐ’ విప్లవానికి సారథ్యంతో ‘ఏఐ పట్నం’గా మారనున్న విశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 1:55PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్ తయారీ పరంగా అంతర్జాతీయ విలువ-సరఫరా వ్యవస్థలలో ప్రపంచ ప్రధాన, విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ రూపొందుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక, రైల్వే, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ అన్నారు. విధానాల రీత్యా బలమైన మద్దతు సహా దార్శనిక నాయకత్వం ఇందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నంలో ఇవాళ ‘గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్’ శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలతో కలసి పాల్గొన్న అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

అదానీ కనెక్స్-ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా’ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టులో ‘విశాఖపట్నం 1 గిగావాట్ హైపర్‌ స్కేల్ ఏఐ డేటా సెంటర్’ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుర్లవాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది.

ఎలక్ట్రానిక్స్-తయారీ రంగాల్లో అగ్రగామి కానున్న భారత్‌

సమాచార సాంకేతిక సేవల రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన భారత్‌, ప్రస్తుతం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లోనూ వేగంగా పురోగమిస్తోందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సెమీకండక్టర్లు, క్వాంటం, అంతరిక్ష, కృత్రిమ మేధ వంటి కీలక సాంకేతిక రంగాల్లో భారత్‌ ప్రపంచ కూడలిగా ఎదగాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఈ దిశగా గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతను మంత్రి కొనియాడారు.

మొబైల్ తయారీ రంగంలో భారత్‌ గణనీయ ప్రగతి సాధించడంతో దేశం నుంచి ఎగుమతులలో మొబైల్ ఫోన్లు అగ్రశ్రేణి వస్తువుల జాబితాలో చేరాయని ఆయన పేర్కొన్నారు. దేశీయ ఎలక్ట్రానిక్ డిమాండ్‌లో దాదాపు 50 శాతం స్థానిక ఉత్పాదనతోనే తీరుతుండగా, సెమీకండక్టర్ మిషన్ కింద వాణిజ్య పరంగా ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.

సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారత్‌ ఒక విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా మారుతోందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ సహా ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలన్నీ  తమ సర్వర్లు, జీపీయూలు, చిప్‌లను భారత్‌లోనే తయారు చేయించాలని పిలుపునిచ్చారు.

ఏఐ కూడలిగా ఆవిర్భవిస్తున్న విశాఖపట్నం

ఈ ప్రాజెక్టును పరిణామాత్మకమైనదిగా అభివర్ణిస్తూ- అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ పెట్టుబడుల ద్వారా విశాఖ నగరం ఇక ‘ఏఐ పట్నం’గా రూపొందగలదని కేంద్ర మంత్రి అన్నారు.

సమాచార సాంకేతిక వ్యవస్థల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దార్శనికతను ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన కొత్త ఏఐ డేటా సెంటర్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం తదితర రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు.

విశాఖపట్నం నుంచి ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, ఐరోపా, ఆఫ్రికా, అమెరికాల ద్వారా ప్రపంచ డిజిటల్ మార్గాలను అనుసంధానిస్తూ మూడు సముద్రగర్భ కేబుళ్లు వేయడంపై గూగుల్‌ సంస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన పారిశ్రామికవేత్తలు

ఈ కార్యక్రమంలో ‘గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ వైస్-ప్రెసిడెంట్ బికాష్ కోలే మాట్లాడుతూ- వికసిత భారత్‌-2047’ సంకల్ప సాకారంలో విశాఖ ఏఐ హబ్ మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. అంతేకాకుండా భారత డిజిటల్ రూపాంతరీకరణ సహా ప్రపంచ ఏఐ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

అదానీ గ్రూప్ చైర్మన్ జీత్ అదానీ ప్రసంగిస్తూ- భారత కృత్రిమ మేధ రంగం పురోగమనంలో ఇక్కడి “1 గిగావాట్ హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్” పునాదిగా మారుతుందని, తద్వారా విశాఖపట్నం నగరాన్ని జాతీయ నవ్య డిజిటల్ ముఖద్వారంగా నిలుపుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, సీనియర్ రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సహా గూగుల్, అదానీ గ్రూప్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2256304) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Odia , Telugu_Vw , Kannada