పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలోని పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం
ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలలో ఎక్కడా సరఫరా నిలిచిపోలేదు
నిన్న 51.8 లక్షలకు పైగా గృహాలకు ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ
ఇప్పటివరకు ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్న 42,500 మంది పీఎన్‌జీ వినియోగదారులు
మార్చి 2026 నుంచి, సుమారు 5.45 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు పూర్తయిన గ్యాసిఫికేషన్
అదనంగా 2.62 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాల కల్పన
గల్ఫ్ ప్రాంతం నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన 2,764 మందికి పైగా భారతీయ నావికులు
గత 24 గంటల్లో 24 మంది రాక
ఫిబ్రవరి 28 నుంచి ఆ ప్రాంతం నుంచి భారత్‌కు వచ్చిన సుమారు 12.96 లక్షల మంది
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2026 4:06PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం సమన్వయ ప్రతిస్పందన చర్యల ద్వారా కీలక రంగాల్లో సంసిద్ధతను, కొనసాగింపును నిర్ధారించడంలో చురుగ్గా నిమగ్నమై ఉంది. ఈ ప్రాంతంలోని ఇంధన సరఫరా, నౌకా వాణిజ్య కార్యకలాపాలు, భారత పౌరులకు అందించే మద్దతుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తెలియజేసింది:
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హార్మూజ్ జలసంధికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా లభించేలా చూసేందుకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:
ప్రజలకు సూచనలు, పౌరులకు అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.
వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడాలి.
ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని, పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి.
పీఎన్‌జీ, విద్యుత్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్పీజీ, పీఎన్‌జీ, సీఎన్జీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో నమోదైన సగటు దైనందిన సరఫరా ఆధారంగా వలస కార్మికులకు అందించే 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. వీటిలో రిఫైనరీ ఉత్పత్తి పెంపుదల... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకూ పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.
చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసే నిమిత్తం రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ 'కోల్ ఇండియా', 'సింగరేణి కాలరీస్'లను ఆదేశించింది.
గృహ, వాణిజ్య వినియోగదారులు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను పొందుటను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడం... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా పునరుద్ఘాటించింది.
తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా కల్పించేందుకు, ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. 02.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శితో పాటు సమాచార-ప్రసార శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శుల అధ్యక్షతన) సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు:
రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడం, ఓఎమ్‌సీలతో సమన్వయం ద్వారా సోదాలు, తనిఖీలను కొనసాగించడం.
తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
పీఎన్‌జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
ముఖ్యంగా గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం. సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి లక్ష్యానికి అనుగుణంగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని అమలు చేయడం.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా ప్రకటనలను జారీ చేస్తున్నాయి... సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2,100కు పైగా సోదాలు నిర్వహించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి, 310 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలు విధించగా, నిన్నటి వరకు 70 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల లైసెన్సును నిలిపివేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా స్థితి...
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా కోసం అత్యంత ప్రాధాన్యత కొనసాగుతోంది.
ఎల్‌పీజీ పంపిణీదారుల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 94 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు డీఏసీ వస్తుంది.
25.04.2026న, 51.8 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేశారు.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 1, 2026 నుంచి 19.44 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు సుమారు 82,000
అమ్ముడయ్యాయి
2026 ఏప్రిల్ 3 నుంచి, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 8,950 కంటే ఎక్కువ అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 1,42,000కి పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
నిన్న 190కి పైగా శిబిరాల ద్వారా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు 3846 అమ్ముడయ్యాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
2026 ఏప్రిల్ నెలలో (25-04-2026 వరకు) మొత్తం 1,64,655 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ అమ్ముడైంది (ఇది దాదాపు 86.66 లక్షల 19 కేజీల సిలిండర్లతో సమానం).
25.04.2026న, 9131 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (సుమారు 4.80 లక్షల - 19 కేజీల సిలిండర్లకు సమానం) విక్రయించారు.
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్‌జీ, సీఎన్జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు.
ఎరువుల కర్మాగారాలకు ఇచ్చే మొత్తం గ్యాస్ కేటాయింపులను, వాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
దీంతో పాటు సీజీడీ వ్యవస్థల ద్వారా అందే సరఫరాలతో సహా, ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి, సీజీడీ సంస్థలు తమ అన్ని జీఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుగుణంగా 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్యపరమైన ఎల్‌పీజీ కేటాయింపులను పొందుతున్నాయి.
· సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించడం కోసం 2026 ఏప్రిల్ 24 నాటి లేఖ ద్వారా.. ‘కాలవ్యవధిని తగ్గిస్తూ సత్వర ఆమోద వ్యవస్థ’ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా మూడు నెలల పాటు అమల్లోకి తెచ్చింది.
· నిత్యావసర వస్తువుల చట్టం- 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, పైప్‌లైన్ల నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026ను భారత ప్రభుత్వం 2026 మార్చి 24 నాటి గెజిట్ ద్వారా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధానాన్ని ఈ ఉత్తర్వు నిర్దేశిస్తుంది. అనుమతుల్లో జాప్యాన్ని, భూసేకరణ సంబంధిత సమస్యలను నివారిస్తూ... నివాస ప్రాంతాలు సహా అన్ని చోట్లా సహజ వాయు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్‌జీ వ్యవస్థ వృద్ధి వేగవంతమవడంతోపాటు.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· డీ-పీఎన్‌జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్బీ ఆదేశించింది. అలాగే, పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడం కోసం.. జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను 2026 జూన్ 30 వరకు పొడిగించారు.
· పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వావలంబన కలిగిన ఇంధన భవితను ప్రోత్సహించేలా.. రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను భారత ప్రభుత్వం రూపొందించింది. సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు ప్రాతిపదికన వ్యవస్థలను రూపొందించుకోవడానికి.. సమగ్రమైన, సరళమైన మార్గదర్శకంగా ఈ నమూనా విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని అమలు చేసే రాష్ట్రాలకు.. వాణిజ్యపరమైన ఎల్‌పీజీ తదుపరి విడత అదనపు కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తారు.
· సీజీడీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలను నెలకొల్పేందుకు లేదా వాటి నిర్వహణకు 15 రోజుల్లోగా అనుమతి మంజూరు చేయడం కోసం ఎస్‌పీసీబీ/ పీసీసీలకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా.. 2026 ఏప్రిల్ 7 నాటి ఉత్తర్వుల ద్వారా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· 2026 మార్చి నుంచి దాదాపు 5.45 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. మరో 2.62 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 8.07 లక్షలకు చేరింది. అంతేకాకుండా దాదాపు 6.14 లక్షల వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
· 2026 ఏప్రిల్ 25 నాటికి 42,500కు పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు లభ్యత, రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· గృహ వినియోగానికి అనుగుణంగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్‌కు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు అందుబాటులో ఉండేలా చూసేందుకు చూడడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ) నిర్దేశించిన విధంగా దేశంలోని చమురు శుద్ధి కంపెనీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్సులు తమ వద్ద ఉండే సీ3, సీ4 నిల్వలను నిర్ణీత పరిమాణంలో కీలక రంగాలకు అందుబాటులో ఉంచేందుకు 2026 ఏప్రిల్ 1 నాటి ఉత్తర్వుల ద్వారా భారత ప్రభుత్వం అనుమతించింది.
· ఔషధ విభాగం, రసాయనాలు - పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అభ్యర్థనల మేరకు.. ఔషధ, రసాయన రంగ కంపెనీల కోసం మొత్తం ఎల్పీజీ నిల్వల (ఎల్పీజీ పూల్) నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నులను కేటాయించారు.
· 2026 ఏప్రిల్ 9 నుంచి ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మథుర రిఫైనరీలు.. రసాయన, ఫార్మా పరిశ్రమలకు 7,600 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్‌ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
· దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.
· మధ్యప్రాచ్యంలో సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ వినియోగదారులపై భారం పడకుండా భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· భారత ప్రభుత్వం 2026 ఏప్రిల్ 11 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిలుపై లీటరుకు రూ. 55.50, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42 ఎగుమతి సుంకాన్ని పెంచింది. దేశీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తుల లభ్యత కోసం ఈ చర్యలు చేపట్టింది.
· వదంతుల కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో భయాందోళనతో ఎక్కువగా కొనుగోలు చేశారు. దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోలు, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీల రిటైల్ అవుట్‌లెట్లలోనూ ధరలను పెంచలేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లడాఖ్ ప్రాంతాలు కిరోసిన్ అవసరం లేదని తెలిపాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
· ఈ ప్రాంతంలోని భారతీయ నౌకలు, నావికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ చేపట్టింది. మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి:
· నావికుల సంక్షేమం, సముద్ర కార్యకలాపాల్లో అంతరాయాలను తొలగించడం లక్ష్యంగా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయాన్ని మంత్రిత్వ శాఖ కొనసాగిస్తోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం ప్రారంభమైనప్పటి నుంచి 7,755 కాల్స్, 16,518కి పైగా ఈమెయిళ్లకు జవాబిచ్చింది. గత 24 గంటల్లో 57 కాల్స్, 192 ఈమెయిళ్లు వచ్చాయి.
· డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా.. ఇప్పటివరకు గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి 2,764 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. గత 24 గంటల్లో 24 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.
· దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
· భారత రాయబార కార్యాలయాలు, పోస్టులు ఇరవై నాలుగు గంటల హెల్ప్‌లైన్లను నిర్వహిస్తూ, భారత పౌరులకు క్రియాశీలకంగా చేయూతనిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయులకు సాయమందించేలా తీసుకుంటున్న వివిధ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
· స్థానిక భారతీయులతో భారతీయ రాయబార కార్యాలయాలు చురుగ్గా మమేకమై ఉన్నాయి. ఈ ప్రాంతంలోని వివిధ సంఘాలు, సంస్థలు, వృత్తి నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలు, ఇతర భాగస్వాములతో నిరంతరం చర్చిస్తున్నాయి.
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి భారత రాయబార కార్యాలయాలు అన్ని విధాలా సాయమందిస్తున్నాయి. స్థానిక అధికారులు, సంస్థలతో సమన్వయం, కాన్సులర్ సాయాన్ని అందించడం, వారు భారత్‌కు తిరిగి రావాలన్న అభ్యర్థనలకు సాయమందించడం వంటివి చేస్తున్నారు.
· ఫిబ్రవరి 28 నుంచి ఈ ప్రాంతం నుంచి దాదాపు 12,96,000 మంది భారత్‌కు ప్రయాణించారు.
· యూఏఈలో భద్రత, కార్యాచరణ కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు యూఏఈ - భారత్ మధ్య పరిమిత సంఖ్యలో వాణిజ్యపరమైన విమాన సేవలను నడుపుతున్నాయి. ఈ రోజు యూఏఈ - భారత్ మధ్య దాదాపు 110 విమానాలు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోకి వివిధ ప్రాంతాలకు విమాన సేవలు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉండడంతో.. భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ఖతార్ ఎయిర్‌వేస్ విమానాలను నడుపుతోంది.
· కువైట్ గగనతలం తెరిచి ఉంది. కువైట్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సర్వీసులను జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ తిరిగి ప్రారంభించాయి.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. బహ్రెయిన్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు గల్ఫ్ ఎయిర్ విమానాలను నడుపుతోంది.
· ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. వివిధ ప్రాంతాలకు పరిమిత విమాన సర్వీసులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. భారత్‌కు తదుపరి ప్రయాణం కోసం వీటిని ఉపయోగించవచ్చు.
· సరుకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించొద్దని, ఇప్పటికే ఇరాన్‌లో ఉన్నవారు మన రాయబార కార్యాలయ సహకారంతో భూ సరిహద్దు ద్వారా తిరిగి రావాలని ప్రభుత్వం కోరింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,445 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్లేందుకు సౌకర్యం కల్పించింది.
· ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. భారత్‌కు ప్రయాణం కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2255748)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6