పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
ప్రజా ప్రతినిధులకు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ప్రజా భాగస్వామ్యం, పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధికి బలమైన పంచాయతీలే అత్యంత కీలకమైన వారధులు
తన లిఖితపూర్వక సందేశంలో పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
“వికసిత భారత్ ఆశయ సాకారంలో సాధికారత గల పంచాయతీలే కీలకం”: ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 7:19PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదాను కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ రోజు న్యూఢిల్లీలో ఒక జాతీయస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికైన ప్రతినిధులు సహా హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. "ప్రజా సేవ పట్ల, దేశ సేవ పట్ల మీ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి లిఖిత సందేశాన్ని ఈ జాతీయ కార్యక్రమంలో చదివి వినిపించడంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులు, కార్యకర్తలకు ఆ సందేశ ప్రతులను అందజేశారు.
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బఘేల్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో భారత సుస్థిర అభివృద్ధికి పంచాయతీ రాజ్ సంస్థలు వెన్నెముకగా నిలుస్తాయని పునరుద్ఘాటించారు. గ్రామాలు, రైతులు, స్థానిక సమాజాల అభివృద్ధి ఆధారితమైన 'వికసిత్ భారత్' దార్శనికత సాకారం కోసం పంచాయతీలకు సాధికారత కల్పించడం కీలకమని ఆయన స్పష్టం చేశారు. సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల సానుకూల ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... అవి ఎన్నికైన ప్రతినిధుల్లో, ముఖ్యంగా మహిళల్లో నాయకత్వం, నిర్ణయాలు తీసుకునే విధానంలో స్పష్టమైన పరివర్తనకు దారితీశాయని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సేవల పంపిణీని బలోపేతం చేయడంలో పారదర్శక పాలనా యంత్రాంగాలు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీల పాత్రనూ ఆయన ప్రశంసించారు. పంచాయతీ ప్రతినిధులంతా సేవ, సమగ్రత, అభివృద్ధి ఆధారిత నాయకత్వ విలువలను నిలబెట్టాలని ప్రొఫెసర్ బఘేల్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర భారత్‌కు బలమైన పంచాయతీ రాజ్ వ్యవస్థే అత్యంత పటిష్ఠమైన పునాది అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పదహారో ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు లభించిన గణనీయ ఆర్థిక సాధికారతను పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రముఖంగా ప్రస్తావించారు. పదిహేనో ఆర్థిక సంఘం కేటాయింపులతో పోలిస్తే, సిఫార్సు చేసిన ఈ గ్రాంటు దాదాపు 84 శాతం అధికమని, ఇది మూడో అంచె ప్రభుత్వానికి అనుకూలంగా ద్రవ్య సమాఖ్యవాదం నిర్ణయాత్మకంగా బలపడటాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక గ్రాంట్లు, పనితీరు గ్రాంట్ల మధ్య ఉన్న 80:20 నిష్పత్తి గురించి శ్రీ భరద్వాజ్ వివరించారు. హామీ ఇచ్చిన వనరుల ప్రవాహాన్ని ఈ నిష్పత్తి, మెరుగైన సొంత ఆదాయ వనరుల సమీకరణ, ఆర్థిక క్రమశిక్షణ, స్థానిక పరిపాలన నాణ్యత కోసం ఇచ్చే ప్రోత్సాహకాలతో సమతుల్యం చేస్తుందని తెలిపారు. పంచాయతీల సొంత ఆదాయ వనరుల సమీకరణతో ముడిపడి ఉన్న, 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన పనితీరు గ్రాంట్ నిబంధనను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పనితీరు గ్రాంట్లను పొందడం కోసం పంచాయతీ రాజ్ సంస్థలు తమ సొంత ఆదాయ వనరులను సమీకరించుకోవడానికి, పెంచుకోవడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని శ్రీ భరద్వాజ్ పిలుపునిచ్చారు.
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహాని 73వ సవరణ తర్వాత మూడు దశాబ్దాల పంచాయతీ రాజ్ ప్రస్థానంపై మాట్లాడారు. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో వ్యవస్థీకృత సామర్థ్య నిర్మాణం, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనల పాత్రను స్పష్టం చేశారు. స్వయం సమృద్ధి సాధించేలా పాలనను మరింతగా పెంపొందించేందుకు గ్రామ సభల్లో అధిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఇ-గ్రామ స్వరాజ్, సభాసార్ వంటి డిజిటల్ వేదికల సహకారాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పంచాయత్ అభివృద్ధి సూచిక (పీఏఐ) 2.0 నివేదికను ఈ సందర్భంగా విడుదల చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ (ఎల్ఎస్‌డీజీల) కింద తొమ్మిది అంశాల్లో గ్రామ పంచాయతీల పనితీరును అంచనా వేయడానికి భారత మొట్టమొదటి దేశవ్యాప్త డేటా-ఆధారిత విధాన ప్రణాళికే ఈ పీఏఐ. దీని పూర్వపు వెర్షన్ కంటే గణనీయంగా మెరుగుపరచిన పీఏఐ 2.0, సూచికలను 516 నుంచి 150కి హేతుబద్ధీకరించింది. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 97.30 శాతం గ్రామ పంచాయతీల అసాధారణ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇది పీఏఐ వెర్షన్ 1.0 కింద సాధించిన 80.79 శాతం కంటే గణనీయమైన మెరుగుదలగా నిలిచింది. సాక్ష్యాధారిత ప్రణాళిక, పనితీరు పర్యవేక్షణ, పంచాయతీల ప్రోత్సాహకాలకు ఒక కీలక సాధనంగా ఈ సూచిక పనిచేస్తుంది. ఇది వికసిత్ పంచాయతీల దార్శనికతను నేరుగా వికసిత్ భారత్ దిశగా ముందుకు తీసుకువెళుతుంది. ఈ కార్యక్రమంలో, పంచాయత్ ధరోహర్ కార్యక్రమం కింద మూడు సచిత్ర ప్రచురణలనూ విడుదల చేశారు. త్రిపుర గ్రామీణ వారసత్వంపై ఒక మోనోగ్రాఫ్, తిరుపతి గ్రామీణ వారసత్వంపై ఒక మోనోగ్రాఫ్, ‘ఉత్తరకాశి: సౌమ్య కాశి: హిమాలయ వారసత్వపు ఆత్మ’ వాటిలో భాగంగా ఉన్నాయి. భాగస్వామ్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని పునరుద్ఘాటిస్తూ... రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిల్లో గ్రామ సభలను నిర్వహించి, దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2255513)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4