ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా నేతల సర్వసభ్య సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 3:57PM by PIB Hyderabad
భారత్‌లో నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మనుషుల ప్రయోజనాలకు విలువనిచ్చే, ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందన పూర్వక కృత్రిమ మేధ అనుబంధ విస్తారిత వ్యవస్థను ఆవిష్కరించడంలో ఈ శిఖరాగ్ర సమావేశం ఒక కీలక పాత్రను పోషిస్తుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
మనం చరిత్రకేసి దృష్టి సారిస్తే, మానవ జాతి ప్రతి అంతరాయాన్ని ఒక కొత్త అవకాశంగా మలుచుకుందని గమనిస్తాం. ప్రస్తుతం, ఇలాంటి మరో సందర్భం మన ముందుకు వచ్చింది. మనమంతా కలిసి ఈ అంతరాయాన్ని మానవ జాతికి లభించిన ఒక మహదవకాశంగా మార్చితీరాలి.
మిత్రులారా,
భారత్ బుద్ధుడు పుట్టిన దేశం. సరైన అవగాహనతోనే సరైన చర్య జనిస్తుంది అని కదా భగవాన్ బుద్ధుడు చెప్పారు. ఇందువల్ల, మనమంతా ఒక మార్గసూచీని తయారు చేయడం అత్యవసరం. అలా చేస్తే, కృత్రిమ మేధ నిజమైన ప్రభావాన్ని ప్రసరించగలుగుతుంది. సరైన నిర్ణయాల్ని సరి అయిన సమయంలో, సరైన ఉద్దేశంతో మనం తీసుకున్నప్పుడు సరైన ప్రభావం ప్రసరిస్తుంది.
మిత్రులారా,
ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి కుదిపేసిన కాలంలో, మనం ఒకరితో కలిసి మరొకరు నిలబడినప్పుడు అసాధ్యం కూడా సాధ్యమైపోతుందని ప్రపంచదేశాలన్నీ గమనించాయి. టీకా మందును అభివృద్ధి చేయడం మొదలు సరఫరా వ్యవస్థ వరకూ, డేటాను పంచుకోవడం నుంచి జీవనాన్ని రక్షించే వరకూ, పరస్పర సహకారమే పరిష్కారాన్ని అందించింది. సాంకేతిక విజ్ఞానం ఎలా మానవాళి సేవా మాధ్యమంగా మారగలదో కోవిడ్ కాలంలో భారత్‌లో మేం చూశాం. మా డిజిటల్ వ్యాక్సినేషన్ ప్లాట్‌ఫారమొకటి కోట్ల మందికి సకాలంలో టీకామందును ఇప్పించడంలో సాయపడింది. మా యూపీఐ ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలు సులభంగా ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకొనేటట్లు చేసింది. భారత్‌లో డిజిటల్ అంతరాన్ని భర్తీ చేయడంలోనూ యూపీఐ చాలా పెద్ద పాత్రను పోషించింది. ఇటీవలి కాలంలో, భారత్ ఒక చైతన్యశీల డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేసింది. మేం దీనిని ప్రపంచంతోనూ పంచుకుంటున్నాం. కారణం మా దృష్టిలో సాంకేతికత ఒక్క శక్తి సాధనం మాత్రమే కాదు, అది సేవా మాధ్యమం. కేవలం శక్తి కాదు, సాధికారత కల్పనకు దోహదపడే సాధనం. ఈ మార్గాన్ని ఏఐ కూడా తప్పనిసరిగా అనుసరించాలి.. దీంతో, పూర్తి మానవ జాతికి సంక్షేమం సమకూరాలి.
మిత్రులారా,
సాంకేతికత గతంలో విభజనలను తెచ్చిపెట్టింది. అయితే వర్తమానంలో ఏఐ సాంకేతికత అందరికీ సులభంగా, అందరికీ అందుబాటులో ఉండాలి.. ఇదే మన లక్ష్యమవ్వాలి. ఈ కారణంగా ప్రస్తుతం ఎప్పుడైతే మనం ఏఐ భవిష్యత్తును గురించి మనం చర్చిస్తున్న తరుణంలో, మనం అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) ఆకాంక్షల్నీ, ప్రాధాన్యాల్నీ కూడా ఏఐ గవర్నెన్సు ప్రక్రియ తాలూకు కీలక స్థానంలో నిలపాల్సివుంటుంది.
గౌరవనీయులారా,
యుగం ఏదైనప్పటికీ, నైతిక నియమావళి ఎల్ల వేళలా చర్చల్లో కీలకమైంది. తేడా ఏమిటంటే, ఇదివరలో నైతికతకు విరుద్ధమైన నడవడిక పరిధి చాలా చిన్నగా ఉండింది. కానీ ఏఐలో దీని పరిధి అనంతమూ, అపరిమితమూను. ఇందువల్ల, ఏఐని దృష్టిలో పెట్టుకొని మనం కూడా నైతిక ప్రవర్తన పరిధిని తప్పక విస్తరించాల్సి వుంది. తత్సంబంధిత నియమావళిని పరిమితులు లేనిదిగా రూపొందించాల్సి వుంది. ఏఐ కంపెనీలకు చాలా పెద్ద బాధ్యతే ఉంది. లాభంతో పాటు లక్ష్యం పైన కూడా దృష్టిని కేంద్రీకరించక తప్పదు. అలాంటి నైతిక నిబద్ధతలు చాలా ఆవశ్యకం. వ్యక్తిగత స్థాయిలో ఏఐ మన శిక్షణ, వివేకంతో పాటు భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తోంది.
గౌరవనీయులారా,
ఏఐని నైతిక నిష్ఠతో ఉపయోగించుకోవడానికి నేను మూడు సూచనలు చేయదలుస్తున్నాను. ఒకటోది.. సమాచార సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ ఏఐ శిక్షణ కోసం ఒక సమాచార ప్రణాళిక (డేటా ఫ్రేంవర్క్)ను రూపొందించాలి. ఏఐలో చెబుతున్నట్లు.. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అని. డేటా సురక్షితంగా, సమతౌల్యమైందిగా, విశ్వసనీయమైందిగా లేకపోతే, అప్పుడు అవుట్‌పుట్ కూడా భరోసా కలిగించేదిగా ఉండదు. ఈ కారణంగా, గ్లోబల్ ట్రస్టెడ్ డేటా ఫ్రేంవర్క్ అవసరం ఎంతైనా ఉంది. రెండోది.. ఏఐ వేదిక తన సేఫ్టీ రూల్స్‌ను చాలా స్పష్టంగా, పారదర్శకంగా ఉంచాలి.. మనకు బ్లాక్ బాక్సుకు చెందిన గ్లాస్ బాక్స్ వైఖరి అవసరం. దీన్లో సురక్ష నియమాలను చూడవచ్చు, వెరిఫై చేయొచ్చు. అది జరిగినప్పుడు జవాబుదారితనం కూడా స్పష్టమవుతుంది. అంతేకాక వాణిజ్యంలో నైతిక ప్రవర్తన పెంపొందుతుంది. మూడోది.. ఏఐ రిసర్చ్‌లో పేపర్ క్లిప్ సమస్యను తరచు ఉదాహరణగా పేర్కొంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా యంత్రానికి ఒక్క పేపర్ క్లిప్‌ను తయారు చేయాలనే లక్ష్యాన్నే ఇచ్చారనుకోండి, అప్పుడు అది దాని ఒకే పని కోసం ప్రపంచంలోని వనరులన్నింటినీ పణం పెట్టి, అదే పనిని చేస్తూ ఉండిపోతుంది. ఇందువల్ల, ఏఐకి స్పష్టమైన మానవీయ విలువలతో పాటు మార్గదర్శకత్వం అవసరమవుతుంది. సాంకేతికత శక్తిమంతమైంది, అయితే దిశానిర్దేశాన్ని అందించితీరాల్సింది మాత్రం ఎప్పటికీ మానవులే.
మిత్రులారా,
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ప్రస్థాన క్రమంలో మహత్వా కాంక్షతో తపించిపోతున్న భారత్ ప్రధాన భూమికను పోషించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతను గుర్తిస్తూ భారత్ ప్రస్తుతం పెద్ద నిర్ణయాన్ని తీసుకొంటోంది. మా ఏఐ మిషన్ ద్వారా, భారత్‌లో ప్రస్తుతం 38,000 జీపీయూలు ఉండగా వచ్చే 6 నెలల్లో మేం 24,000 జీపీయూలను ఏర్పాటు చేయనున్నాం. మేం మా అంకుర సంస్థలను ఎంతో చౌక ధరలకు ప్రపంచ శ్రేణి కంప్యూటింగ్ శక్తిని సమకూర్చుతున్నాం. మేం ఒక ఏఐ కోస్ట్ (AI Co-STE)ని కూడా రూపొందించాం. దీని ద్వారా 7,500 కన్నా ఎక్కువ డేటా సెట్స్‌నీ, 270 ఏఐ మాడల్స్‌నీ జాతీయ వనరుల మాదిరిగా పంచుకున్నాం.
మిత్రులారా,
ఏఐ విషయంలో భారత్ అనుసరిస్తున్న మార్గం స్పష్టంగా ఉంది. భారత్ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. ఏఐ పూర్తి మానవ జాతి సంక్షేమానికి ఉద్దేశించిన ఒక ఉమ్మడి వనరు. మనం కలిసికట్టుగా నూతన ఆవిష్కరణను ముందుకు తీసుకుపోయే, సమ్మిళితత్వాన్ని పటిష్ఠపరిచే, మానవతా విలువలను ఏకీకరిస్తూ ముందుకు సాగే ఏఐ భవితను తప్పక తీర్చిదిద్దాలి. సాంకేతికత, మానవ విశ్వాసం చెట్టపట్టాల్ వేసుకు ముందుకు సాగాయంటే, అప్పుడు ఏఐ తాలూకు నిజ ప్రభావాన్ని ప్రపంచం తెలుసుకోగలుగుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2254693)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam