కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎమ్ఐఎస్) అర్హత ప్రమాణాలను విస్తరించిన ఎమ్‌సీఏ


గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం విద్యార్థులకూ అవకాశం

18-25 సంవత్సరాల వయస్సు కలిగి, గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అగ్రశ్రేణి కంపెనీల్లో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లకు పీఎమ్ఐఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

విద్యార్థుల ఉపాధి యోగ్యతను, నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడం సహా విద్య నుంచి ఉద్యోగంలోకి సులభ పరివర్తనను నిర్ధారించడం వంటి భారత జాతీయ విద్యా విధాన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లనున్న పీఎమ్ఐఎస్‌ సవరణలు

నాడు పోస్టు చేయడమైనది: 22 APR 2026 4:02PM by PIB Hyderabad

యువత కోసం ఉపాధి అవకాశాలను, ఆయా పరిశ్రమల కోసం వారి సంసిద్ధతను బలోపేతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు వేస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌సీఏ)... ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎమ్ఐఎస్) పైలట్ దశ అర్హత ప్రమాణాలను విస్తరించింది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీనివల్ల విద్యార్థులు తమ అధికారిక విద్యను పూర్తిచేయకముందే దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో వ్యవస్థీకృత ఇంటర్న్‌షిప్ అవకాశాలను ముందుగానే పొందేందుకు వీలవుతుంది. తద్వారా వారు పరిశ్రమలో ప్రత్యక్ష అనుభవాన్ని సంపాదించుకోగలరని భావిస్తున్నారు. విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగంతో సంప్రదించి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేశారు.

కొత్త మార్పులు

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు పీఎమ్ఐఎస్ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తుదారులు ఈ పథకం కింద గల ప్రస్తుత అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.

దరఖాస్తు ప్రక్రియ సమయంలో విద్యార్థులు తమ సంబంధిత విద్యా సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించాలి.

ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనడం విద్యాపరమైన అవసరాలకు ఆటంకం కలిగించదని ఎన్‌వోసీ ధృవీకరించాలి.

ఎన్‌వోసీలో ఆయా విభాగాధిపతులు, డీన్‌లు, ప్రిన్సిపాల్‌లు, శిక్షణ - ప్లేస్‌మెంట్ అధికారుల్లో ఎవరైనా సంతకం చేయాలి.

ఉన్నత విద్యలో కీలక భాగంగా... ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమలతో భాగస్వామ్యం, ప్రత్యక్ష అనుభవం వంటి అనుభవపూర్వక అభ్యాసానికి భారత జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అధిక ప్రాధాన్యమిస్తుంది. విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో ఉండగానే క్రమబద్ధమైన, వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లలో పాల్గొనేలా చేయడం ద్వారా పీఎమ్ఐఎస్ వారి విద్యా ప్రయాణంలో వాస్తవ ప్రపంచ అభ్యాసాన్ని పొందుపరుస్తూ ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇది విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలనే ఎన్ఈపీ లక్ష్యానికి ఊతమిస్తూనే, విద్య నుంచి ఉద్యోగంలోకి మారే ప్రక్రియనూ సులభతరం చేస్తుంది.

వృత్తిపరమైన వాతావరణం గురించి ముందుగానే అవగాహన పొందడం ద్వారా... నేటి డైనమిక్ ఆర్థిక వ్యవస్థలో విజయానికి అత్యవసరమైన సమస్య పరిష్కారం, కమ్యూనికేషన్, జట్టుగా కలిసి పనిచేయడం, అనుకూలత వంటి కీలకమైన కార్యక్షేత్ర నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోగలుగుతారు. విద్యార్థులు తమ చదువు కొనసాగిస్తున్నప్పుడే ఇంటర్న్‌షిప్‌లలో పాల్గొనేలా చేయడం ద్వారా విద్యాభ్యాసానికి, పరిశ్రమ అంచనాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం... పట్టభద్రులయ్యేనాటికే విద్యార్థులను ఉద్యోగానికి సన్నద్ధం చేయడం... వ్యాపార వాతావరణాలు, కార్పొరేట్ ప్రక్రియలు, వృత్తిపరమైన సంస్కృతికి సంబంధించిన వాస్తవ ప్రపంచ అనుభవాన్ని వారికి అందించడం వంటి లక్ష్యాలను పీఎమ్ఐఎస్ కలిగి ఉంది.


ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎమ్ఐఎస్) గురించి

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన, వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రధాన కార్యక్రమం.

ఈ పథకంలో భాగంగా:

ఇంటర్న్‌లకు నెలకు కనీసం రూ. 9,000 ఆర్థిక సహాయం అందుతుంది.

అన్ని రంగాల్లోనూ దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి.

 

పలు ఉద్యోగ బాధ్యతలు, రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడానికి పీఎమ్ఐఎస్ పైలట్ దశలో 300 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం పైలట్ దశ మూడో రౌండ్ కొనసాగుతోంది. దీనిలో కంపెనీలు నిరంతరం ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిస్తున్నాయి. 18-25 సంవత్సరాల వయస్సు గల అర్హులైన యువత పీఎమ్ఐఎస్ అధికారిక పోర్టల్ (www.pminternship.mca.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వారి ఆసక్తులు, కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను అన్వేషించవచ్చు.


(రిలీజ్ ఐడి: 2254687) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi