సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

18వ సివిల్ సర్వీసుల దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రధానమంత్రి అత్యుత్తమ సేవా పురస్కారాలపై పెరిగిన ఆసక్తి... 2023లో 1216గా ఉన్న దరఖాస్తుల సంఖ్య 2025లో 2035కు పెరిగిందన్న జితేంద్ర సింగ్

2,000కి పైగా శిక్షణా కోర్సులతో 88 లక్షల మంది వినియోగదారులను నమోదు చేసిన ఐజీఓటీ కర్మయోగి: మంత్రి

సీపీజీఆర్ఏఎంఎస్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో ప్రగతి...

2014లో సంవత్సరానికి సుమారు 2 లక్షల ఫిర్యాదుల నుంచి ప్రస్తుతం 25–30 లక్షలకు విస్తరణ.

మొత్తం ఫిర్యాదుల్లో95 శాతానికి పైగా కేసుల పరిష్కారం... సగటు పరిష్కార సమయం 60 రోజుల నుంచి దాదాపు 12 రోజులకు తగ్గుదల: కేంద్రమంత్రి వెల్లడి

ఒక్క 2024 ఏడాదిలోనే ముఖ గుర్తింపు ఆధారిత డిజిటల్ లైఫ్ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించిన 40 లక్షలకు పైగా పెన్షనర్లు.. అన్ని డీఎల్‌సీ వ్యవస్థల ద్వారా 10 కోట్లు దాటిన వినియోగం: డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రధాన కార్యక్రమాల ఫలితాల ఆధారంగా సివిల్ అధికారుల మూల్యాంకనాన్ని పునర్వ్యవస్థీకరించాలి: డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 21 APR 2026 3:50PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 750కి పైగా జిల్లాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ సేవా పురస్కారాల పట్ల ఆదరణ గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా పోటీల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా పెరిగింది. ఇందుకు అవార్డుల కోసం వచ్చే దరఖాస్తులే నిదర్శనం. 2023లో దరఖాస్తులు 1,216 ఉండగా, 2024లో 1,588కి.. 2025లో 2,035కి పెరిగాయి. ప్రభుత్వ అధికారుల నైపుణ్యాన్ని పెంచే ఐజీఓటీ కర్మయోగి వేదికలో ఇప్పటివరకు 88 లక్షల మందికి పైగా అధికారులు చేరారు. వారు 2,000 కంటే ఎక్కువ శిక్షణ కోర్సులను వినియోగించుకున్నారు. అలాగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అయిన సీపీజీఆర్ఏఎంఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదుల సంఖ్య 2014లో ఏడాదికి 2 లక్షలు ఉండగా, ప్రస్తుతం అది 25,30 లక్షలకు పెరిగింది. వీటిలో 95 శాతానికి పైగా కేసులను పరిష్కరించారు. సగటు పరిష్కార సమయాన్ని 60 రోజుల నుంచి కేవలం 12 రోజులకు తగ్గించగలిగారు. ఇక పెన్షన్ సంస్కరణల విషయానికి వస్తే 2024 ఒక్క సంవత్సరంలోనే 40 లక్షల మంది పెన్షనర్లు ముఖ గుర్తింపు ఆధారిత డిజిటల్ లైఫ్ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించుకోగా, మొత్తం మీద ఈ డిజిటల్ ధ్రువీకరణ పత్రాల వినియోగం భారీ స్థాయికి చేరుకుంది.

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 18వ సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం పాలన ‘ప్రజలే కేంద్రంగా, వ్యవస్థాగత పద్ధతుల్లో’ సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఆయన వివరించారు. మిషన్ కర్మయోగి వంటి సామర్థ్య పెంపుదల కార్యక్రమాల విస్తరణను, అందులోని కొత్త విభాగాలను ప్రకటించారు. ఇకపై అధికారుల పనితీరును వారి వ్యక్తిగత ప్రొఫైల్ ఆధారంగా కాకుండా, ప్రభుత్వ పథకాల అమలులో వారు సాధించిన ఫలితాలు, పోటీతత్వ ప్రాతిపదికన మూల్యాంకనం చేస్తామని స్పష్టం చేశారు. 

పాలనలో వస్తున్న కీలక మార్పులను కేంద్రమంత్రి వివరించారు. వ్యక్తులపై ఆధారపడే విధానం నుంచి ప్రభుత్వం వ్యవస్థాగతమైన పనితీరు వైపు, అలాగే కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చే రూల్ బేస్డ్ (హోదా ఆధారంగా) పరిపాలన వైపు మళ్లుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 2,000 పాత నిబంధనలను రద్దు చేయడం, కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను తొలగించడం, సివిల్ సర్వీసుల దినోత్సవాన్ని జ్ఞానాన్ని పంచుకునే వేదికగా మార్చడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ అవార్డుల ఎంపికలో అధికారుల వ్యక్తిగత ప్రొఫైల్ కంటే పథకాల అమలు తీరుకే ప్రాధాన్యత ఇస్తున్నామని, సహాయ కార్యదర్శి కార్యక్రమం వంటి సంస్థాగత ఆష్కరణలు, దాదాపు 90 శాతం ప్రభుత్వ కార్యాక్రమాలను నిర్వహించే డిజిటల్ పాలన వ్యవస్థలు, అంతర్జాతీయ పరిపాలనా వేదికలకు ఆతిథ్యం ఇవ్వడం వంటి అంతర్జాతీయ సహకారాల గురించి ప్రస్తావించారు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మిషన్ కర్మయోగి,  “కర్మయోగి ప్రారంభ్” వంటి కార్యక్రమాల ద్వారా శిక్షణ, పాలనా సంస్కరణలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా సివిల్‌ అధికారులను సిద్ధం చేయడమే దీని లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం దేశ పాలనా నమూనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని, ముఖ్యంగా మాల్దీవులు, మారిషస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు మన సీపీజీఆర్‌ఏఎంఎస్‌ వంటి వ్యవస్థలను అధ్యయనం చేస్తున్నాయని  వివరించారు. ఈ ప్రయత్నాలన్నీ “వికసిత్ భారత్: పౌర-కేంద్రీకృత పాలన, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి” అనే నినాదంతో సాగుతున్నాయని, 2047 దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి భావి తరాల అధికారులను అన్ని రకాలుగా సన్నద్ధం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పాలన  ప్రభుత్వ కేంద్రితంగా లేదని  పౌర కేంద్రితంగా మారుతోందని కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని అన్నారు. అలాగే ఫిర్యాదుల సంఖ్య పెరగడంపై స్పందిస్తూ.. ఇది ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతం కాదని, అది ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి నిదర్శనమని తెలిపారు.

డేటా ఆధారిత మూల్యాంకనం, డిజిటల్ పాలన, భారీ స్థాయిలో సామర్థ్య పెంపువంటి అంశాలు ప్రభుత్వ సేవా సంస్కరణలకు కీలకంగా మారుతూ.. దేశ పరిపాలనా వ్యవస్థలో వస్తున్న మార్పులను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రభుత్వ ఉన్నత స్థాయి పరిపాలనా నాయకత్వానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి  పీకే. మిశ్రా, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి శక్తికాంత దాస్, మంత్రివర్గ కార్యదర్శి టీవీ సోమనాథన్, డీఏఆర్‌పీజీ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ వంటి ఉన్నతాధికారులందరూ హాజరవ్వడం ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను చాటిచెప్పింది.

 

***


(రిలీజ్ ఐడి: 2254339) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Kannada , English , Urdu , Punjabi , Gujarati , Tamil