|
ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు ప్రపంచ నేతలను స్వాగతించిన ప్రధానమంత్రి
“దేశంలోని 140 కోట్ల పౌరుల బలంతో వర్ధిల్లుతున్న భారత్- కృత్రిమ మేధ రూపాంతరీకరణలో అగ్రస్థానాన నిలుస్తోంది”
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 10:27AM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ప్రారంభమైన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొంటున్న ప్రపంచ నాయకులు, పరిశ్రమ అగ్రగాములు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.
“సర్వజన హితాయ-సర్వజన సుఖాయ” (సకల జన సంక్షేమం-సర్వజన ఆనందం) ఇతివృత్తంగా నేటినుంచి 20వ తేదీవరకూ ఈ సదస్సు నిర్వహణ ద్వారా మానవ కేంద్రక ప్రగతి, సార్వజనీన పురోగమనం దిశగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో భారత్ నిబద్ధతను చాటిచెబుతుంది.
ఈ నేపథ్యంలో పౌరుల ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పరిపాలన వ్యవస్థ సహా విభిన్న రంగాల్లో ‘ఏఐ’ పరిణామశీల పాత్రను ప్రధానమంత్రి ప్రస్ఫుటం చేశారు. ఆవిష్కరణ, సంయుక్త కృషి, కృత్రిమ మేధ బాధ్యతాయుత వినియోగం తదితరాలపై ఈ సదస్సులో సాగే చర్చలు ప్రపంచ దృక్పథాన్ని సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రగతిశీల, వినూత్న, అవకాశాల చోదిత భవిష్యత్తుకు రూపమివ్వగలవని విశ్వాసం వెలిబుచ్చారు.
దేశంలోని 140 కోట్ల పౌరుల బలంతో వర్ధిల్లుతున్న భారత్ అంతర్జాతీయంగా ఏఐ రూపాంతరీకరణకు చోదకశక్తి కాగలదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఇందుకు తగిన శక్తియుత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు, బలమైన అంకురావరణ వ్యవస్థ, అత్యాధునిక పరిశోధనల దన్నుతో ప్రపంచానికి సారథ్యం వహిస్తుందని పేర్కొన్నారు. ‘ఏఐ’ రంగంలో భారత్ సాధించిన ప్రగతి ఆశయం-బాధ్యత రెండింటినీ ప్రతిబింబిస్తూ, సాంకేతిక పురోగమనంలో దేశాన్ని అగ్రభాగాన నిలుపుతుందని చెప్పారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“కృత్రిమ మేధపై సంయుక్త సమాలోచనకు ప్రపంచం ఒకే వేదికపైకి వచ్చింది!
ఈ మేరకు నేటి నుంచి ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు శ్రీకారం చుట్టింది. ఈ సమాలోచన సదస్సుకు ప్రపంచ నాయకులు, పరిశ్రమ అగ్రగాములు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. “సర్వజన హితాయ-సర్వజన సుఖాయ” (సకల జన సంక్షేమం-సర్వజన ఆనందం) ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు మానవాళి కేంద్రక పురోగమనం దిశగా కృత్రిమ మేధ వినియోగంలో మన సమష్టి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని వ్యాఖ్యానించారు.
“ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పరిపాలన వ్యవస్థ సహా విభిన్న రంగాల్లో ‘ఏఐ’ నేడు పరిణామశీల పాత్రను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆవిష్కరణ, సంయుక్త కృషి, కృత్రిమ మేధ బాధ్యతాయుత వినియోగం తదితరాలపై ఈ సదస్సులో సాగే చర్చలు ప్రపంచ దృక్పథాన్ని సుసంపన్నం చేస్తాయి. అంతిమంగా ప్రగతిశీల, వినూత్న, అవకాశాల చోదిత భవిష్యత్తుకు ఈ చర్చలు రూపమివ్వగలవని విశ్వసిస్తున్నాను” అని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా...
“దేశంలోని 140 కోట్లమంది ప్రజలే భారత్ బలం... కృత్రిమ మేధ రూపాంతరీకరణలో మన దేశం ఎంతో ముందంజ వేసింది. సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల నుంచి శక్తియుత అంకురావరణ వ్యవస్థ సహా అత్యాధునిక పరిశోధనల దాకా ఈ రంగంలో పురోగమనం మన ఆశయం, బాధ్యత రెండింటినీ ప్రస్ఫుటం చేస్తుంది” అని ప్రధానమంత్రి హర్షం వెలిబుచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2254255)
|