వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతుల ప్రయోజనాలే పరమావధి: శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో నాసిరకం విత్తనాలపై నున్హెమ్స్ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు
మోసాలను సహించేది లేదు: నకిలీ విత్తనాల కేసులో శివరాజ్ సింగ్ కఠిన ఆదేశాలు, కేసు నమోదు
రైతుల ప్రయోజనాల కోసం కీలక చర్య: శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ జోక్యంతో విత్తన కంపెనీపై ఎఫ్ఐఆర్
నాసిరకం విత్తనాలపై శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ ఉక్కుపాదం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశం
ప్రభుత్వం సత్వర చర్యలు: రైతులకు కలిగిన నష్టాలపై శివరాజ్ సింగ్ చౌహన్‌కు నివేదించిన వెంటనే నున్హెమ్స్ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 4:05PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్, ఖర్గోన్ జిల్లాలకు చెందిన రైతులు, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్‌ను న్యూఢిల్లీలో కలిశారు. కాకర సాగులో నాసిరకం విత్తనాలు, మొక్కల వల్ల భారీగా నష్టపోయినట్లు మంత్రికి వివరించారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇది రైతుల జీవనోపాధిపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. బాధిత రైతులకు తగిన పరిహారం అందేలా చూడాలని, బాధ్యులైన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు తక్షణమే పరిపాలనా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని నున్హెమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ధార్ జిల్లాలోని మనవార్ పోలీసుస్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యత అని కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. నాసిరకం కాకర విత్తనాలు, మొక్కల వల్ల పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన మధ్యప్రదేశ్‌లోని ధార్, ఖర్గోన్ జిల్లాల రైతుల ఆవేదనను తెలుసుకున్న అనంతరం.. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, వీలైనంత త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు కారణమైన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ఆదేశాల మేరకు పరిపాలనాపరమైన చర్యల్లో వేగం పెరిగింది. ధార్ జిల్లాలోని మనవార్ పోలీసుస్టేషన్‌లో 266 సంఖ్యతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీఎన్ఎస్-2023లోని సెక్షన్లు 318(4), 324(5), నిత్యావసర వస్తువుల చట్టం-1955లోని సెక్షన్లు 3, 7.. విత్తనాల చట్టం-1966లోని సెక్షన్ 19 ప్రకారం కేసును నమోదు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన నున్హెమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిందితుడిగా పేర్కొన్నారు.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 2025లో వివిధ నర్సరీలు, వ్యవసాయ సేవా కేంద్రాల నుంచి సదరు కంపెనీకి చెందిన విత్తనాలను, మొక్కలను కొనుగోలు చేశారు. విత్తనాలు, మొక్కలను నాటిన తర్వాత ఆశించిన స్థాయిలో కాకర పంట దిగుబడి రాలేదు. కాయలు చిన్నవిగా ఉండి, పసుపు రంగులోకి మారి, కోత సమయానికన్నా ముందుగానే రాలిపోయాయి. పంట దిగుబడి భారీగా తగ్గటంతో ఫిబ్రవరి 17, 2026న రైతులు ఫిర్యాదు చేశారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. ధ్రువీకరించిన విత్తనాల పేరుతో నాసిరకం విత్తనాలను, నాణ్యత లేని మొక్కలను రైతులకు విక్రయించారని, దీనివల్ల రైతులు ఆర్థికంగా భారీగా నష్టపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
న్యూఢిల్లీలో విషయం తెలుసుకున్న శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణమే స్పందించారు. ఇది కేవలం పంట నష్టానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని.. రైతుల నమ్మకం, శ్రమ, పెట్టుబడిని దెబ్బతీయటమని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన.. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. వీటితో పాటు నాసిరకం కాకర విత్తన రకం "రుబాస్టా"పై నిషేధం విధించాలని స్పష్టం చేశారు.
రైతుల విషయంలో జరిగే అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని, మోసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు నేరుగా కేంద్రమంత్రి దృష్టికి వెళ్లినప్పుడు అవి లాంఛనప్రాయంగా కాకుండా రైతులకు నష్టపరిహారం, బాధ్యులపై కఠిన చర్యల వంటి నిర్ణయాత్మక పరిష్కారం లభిస్తుందని.. ధార్, ఖర్గోన్ రైతుల సమస్య స్పష్టం చేసింది.
రైతు సమస్యల తక్షణ పరిష్కారం, నాసిరకం, నకిలీ విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవటం, రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించటంపై శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్లప్పుడూ చెబుతుంటారు. విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత విషయంలో రాజీపడి.. రైతుల కష్టాన్ని, పంటలను, వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2253185)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7