ఆర్థిక మంత్రిత్వ శాఖ
పోషకాహార భద్రత, స్వావలంబన, సుస్థిర వ్యవసాయ లక్ష్యాలకు అనుగుణంగా పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు తమ బోనస్ విధానాలను మార్చాలంటూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వ్యయ విభాగం జారీ చేసిన డీవో లేఖ సూచన మాత్రమే, ఆదేశం కాదు
రాష్ట్రాలకు కేంద్రం అందించిన ఈ సమాచారం భారత్‌లో దీర్ఘకాల ఆహార, పంట భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా అనుసరిస్తున్న నిర్మాణాత్మకమైన, సానుకూలమైన విధానాన్ని ప్రతిబింబిస్తోంది
నాడు పోస్టు చేయడమైనది:
12 APR 2026 6:10PM by PIB Hyderabad
రాష్ట్రాలు ఇచ్చే బోనస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన లేఖను తమిళనాడు ముఖ్యమంత్రి ఈ మధ్య చేసిన ఓ ప్రసంగంలో ప్రస్తావించారు.
ఈ సందర్భంలో పోషకాహార భద్రత, ఆత్మనిర్భరత (స్వయం సమృద్ధి), సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలను ప్రోత్సహించేలా బోనస్ విధానాలను మార్చాలని పేర్కొంటూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు 09.01.2026న ఓ డీవో లేఖ జారీ చేశారని చెప్పారు. అయితే ఈ లేఖ రాష్ట్రాలకు ఆదేశం కాదు. సూచన మాత్రమే.
భారత దీర్ఘకాల ఆహార, పంట భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మాణాత్మకమైన, సానుకూల విధానాన్ని రాష్ట్రాలకు అందించిన ఈ సమాచారం ప్రతిబింబిస్తుంది:
-
రైతులకు తోడ్పాటునిచ్చేలా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను వివిధ పంటలకు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలల్లో ముఖ్యంగా ఉత్తర భారతంలో గోధుమ, వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్‌పీకి అదనంగా బోనస్ ప్రకటిస్తే.. అది ఈ పంటల సాగును మరింత ప్రోత్సహిస్తుంది. దీనివల్ల పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గుతుంది. వ్యవసాయంలో అధిక నీరు-ఎరువుల వినియోగం వల్ల పర్యావరణంపై అధిక ప్రభావం పడుతుంది. పప్పులు, వంట నూనె గింజల వంటి అవసరమైన పంటలకు సంబంధించి దిగుమతులపై అధికంగా ఆధారపడాల్సి వస్తుంది.
-
అందుకే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పంటల విస్తృత వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు బాధ్యతాయుతమైన, దూరదృష్టితో కూడిన వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గోధుమను మాత్రమే సాగు చేసే, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరిని మాత్రమే పండించే విధానాన్ని నిరుత్సాహపరచడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది రైతుల ప్రయోజనాలను, జాతీయ ఆహార భద్రతా అవసరాలను రెండింటినీ పరిరక్షించేలా సుస్థిర వ్యవసాయ విధానాలను అవలంబించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది.
వ్యూహాత్మకమైన, ఆర్థిక పరమైన కారణాల కోసం మాత్రమే కాకుండా.. రైతు సంక్షేమం కోసం కూడా దేశీయంగా పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజల ఉత్పత్తిని విస్తరించాలి. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ అనిశ్చితులు, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు, ధరల అస్థిరత్వ ప్రభావాలకు గురయ్యే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. అదే సమయంలో పోషకాహార భద్రత బలోపేతమవుతుంది. దేశంలో మరింత సమతౌల్యమైన, స్థిరమైన సాగు విధానం విస్తరిస్తుంది.
-
దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, రైతులకు పప్పులు, నూనె గింజలను సాగు చేయడంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఈ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఈ లేఖ ఉద్దేశం.
ప్రధాన ఆహార పంటల్లో స్వావలంబన అత్యంత ముఖ్యమైనదిగా మారిన ఈ సమయంలో పప్పులు, నూనె గింజల సాగు విషయంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే దిశగా కేంద్ర రాష్ట్రాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
-
పప్పులు, నూనె గింజలు, వంట నూనెల దేశీయోత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పటిష్టమైన చర్యలు చేపట్టింది. వీటిలో పప్పు ధాన్యాల కోసం ఆత్మనిర్భరత మిషన్, వంటనూనెలు-నూనెగింజల కోసం జాతీయ కార్యక్రమం, వంటనూనెలు-ఆయిల్ పామ్ కోసం జాతీయ కార్యక్రమం ఉన్నాయి.
కొన్ని పంటల సాగుకే రైతులు పరిమితం కాకుండా.. పప్పులు, నూనె గింజల వైపు మళ్లేలా వాటికి అందించే ఎంఎస్‌పీ ధరల పెంపును ప్రభుత్వం స్థిరంగా నిర్ణయిస్తోంది. వంట నూనెల దిగుమతులపై ఆధారపడటం 2015-16లో 63.2 శాతం నుంచి 2023-24 నాటికి 56.25 శాతానికి తగ్గిందని ఆర్థిక సర్వే 2025-26 వెల్లడించింది. ఇది సరైన దిశలో సాధిస్తున్న పురోగతిని సూచిస్తుంది. 2014–15, 2024–25 మధ్య కాలంలో నూనె గింజల సాగు విస్తీర్ణం 18 శాతానికి పైగా, ఉత్పత్తి దాదాపు 55 శాతం, ఉత్పాదకత 31 శాతం పెరిగింది.
-
రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పీఎం-కిసాన్ పరిధిలో 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. 1.75 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు, 8,270కి పైగా పరీక్షా కేంద్రాలు శాస్త్రీయ ఆధారిత సాగు జరిగేలా భరోసా ఇస్తున్నాయి. పర్యావరణ ముప్పుల నుంచి 4 కోట్ల మంది రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన రక్షణ అందిస్తోంది. వ్యవసాయపరంగా వెనకబడి ఉన్న 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన మార్పులు తీసుకొస్తోంది. ఈ కార్యక్రమం ఉత్పాదకతను పెంచుతూ, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తోంది. కోతల అనంతరం నిల్వ సౌకర్యాలను, నీటి పారుదలను విస్తరిస్తోంది. వ్యవసాయ రుణాలను సులభతరం చేస్తూ.. నేరుగా 1.7 కోట్ల రైతులకు లబ్ధి కలిగిస్తూ.. వెనకబడిన రైతులకే తొలి ప్రాధాన్యం దక్కేలా చూస్తోంది. మెగా ఫుడ్ పార్కుల సంఖ్య 2014లో 2 నుంచి 2025లో 41కు పెరిగింది. వాటిలో 24 కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి కోతల అనంతర, ఆహార శుద్ధి మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నాయి.
ఈ విధంగా, పరిశోధన, మెరుగైన విత్తన సరఫరా, ఎంఎస్‌పీ సహకారంతో సేకరణ మద్దతు, ఆహార శుద్ధి మౌలిక వసతులు, విలువ ఆధారిత వ్యవస్థ అభివృద్ధితో కూడిన ఏకీకృత విధానాన్ని భారత ప్రభుత్వం అనుసరిస్తోంది. తద్వారా రైతుకు లాభం చేకూరేలా చూస్తోంది. పంట వైవిధ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా, రైతుల ఆదాయం మరింత పెరుగుతుంది.
విస్తృతమైన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా తమ వ్యవసాయ విధానాలను మార్చుకొని రాష్ట్రాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈ లేఖను రాశారు. ఇలాంటి లక్ష్యాలకు అనుగుణంగా మారడం రాష్ట్రాలకు భారం కాదు. ఇది రైతులకు, వినియోగదారులకు, మొత్తంగా దేశానికి సేవ చేసే ఉమ్మడి బాధ్యత.
దీనిని బలవంతపు చర్యగా లేదా దీని ప్రయోజనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తప్పదోవ పట్టించేదిగా చిత్రీకరించే ప్రయత్నమేదైనా.. నిజాన్ని వక్రీకరించడమే అవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2251575)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7