ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘ఏబీ పీఎం-జేఏవై ఆటో-అడ్జుడికేషన్ హ్యాకథాన్-2026’లో పాల్గొనేందుకు ఆవిష్కర్తలకు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆహ్వానం
ప్రస్తుత వ్యవస్థలతో పనిచేస్తూ, క్లెయిమ్స్ పరిష్కారం వేగవంతం చేసేందుకు మనుషుల పని భారాన్ని తగ్గించేలా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా పటిష్టమైన డిజిటల్ పరిష్కారాన్ని రూపొందించటమే ఏబీ పీఎం-జేఏవై ఆటో-అడ్జుడికేషన్ హ్యాకథాన్ ఉద్దేశం
ఇప్పటివరకు 2,600 రిజిస్ట్రేషన్లు.. ఏప్రిల్ 13 చివరి తేదీ.. మాస్టర్ క్లాస్ సిరీస్ ఇవాళే ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 11:32AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక ఆరోగ్య భరోసా పథకం ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై), భారతదేశంలో డిజిటల్ ఆరోగ్య విప్లవంలో పెనుమార్పు. ఈ పథకం ద్వారా 1,900 చికిత్స ప్యాకేజీల ద్వారా రోజూ దాదాపు 50,000 క్లెయిమ్స్ ప్రాసెస్ జరుగుతోంది. భారీ స్థాయిలో క్లెయిమ్స్ పరిష్కరించేటప్పుడు వేగం, ఖచ్చితత్వం, నిబంధనలు పాటించటం కీలకం. ప్రస్తుతం 15-20 శాతం క్లెయిమ్స్ ఆటోమేటిక్‌గా పరిష్కారమవుతున్నప్పటికీ, అన్ని రకాల చికిత్సా ప్యాకేజీలకు వర్తించేలా వేగంగా, సమర్థవంతంగా పనిచేసే వ్యవస్థ అవసరం ఉంది.
క్లెయిమ్‌ల పరిమాణం, సంక్లిష్టత పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రకాల చికిత్సలను, డాక్యుమెంట్ ఫార్మాట్లను నిర్వహించగల అధునాతన ఆటో-అడ్జుడికేషన్ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. ఆటోమేషన్, ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు, ప్రామాణీకరణ పత్రాలు, రియల్-టైమ్ వెరిఫికేషన్ వంటి సాంకేతికతల వినియోగంతో క్లెయిమ్స్ ప్రాసెసింగ్‌ను పూర్తిగా డిజిటలైజ్ చేయటంతో పాటు వేగవంతమైన, స్థిరమైన, పారదర్శకమైన ఫలితాలను అందించటానికి వీలవుతుంది.
ప్రస్తుత వ్యవస్థలతో పనిచేస్తూ, క్లెయిమ్స్ పరిష్కారం వేగవంతం చేసేందుకు మనుషుల పని భారాన్ని తగ్గించేలా, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండేలా పటిష్టమైన డిజిటల్ పరిష్కారాన్ని రూపొందించటమే ఏబీ పీఎం-జేఏవై ఆటో-అడ్జుడికేషన్ హ్యాకథాన్ ప్రధాన లక్ష్యం.
జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) నిర్వహిస్తున్న ఏబీ పీఎం-జేఏవై ఆటో-అడ్జుడికేషన్ హ్యాకథాన్-2026కు విశేష స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,600 మందికిపైగా అభ్యర్థులు ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు.
నమోదు ప్రక్రియకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2026
ఆసక్తి గల విద్యార్థులు, పరిశోధకులు, రూపకర్తలు, నిపుణులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు ఏప్రిల్ 13, 2026 వరకు అధికారిక పోర్టల్ https://nha.gov.in/hackathon ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 13, 2026 నుంచి మూడు మాస్టర్ క్లాస్ సెషన్లు ప్రారంభం
సవాళ్లను అర్థం చేసుకోవటంలో, పరిష్కార మార్గాలను గుర్తించటంలో పాల్గొనేవారికి మద్దతుగా ఏప్రిల్ 13, 2026 నుంచి మూడు భాగాల ప్రత్యేక మాస్టర్ క్లాస్ సిరీస్‌ను ఎన్‌హెచ్ఏ నిర్వహించనుంది. క్లెయిమ్స్ అడ్జుడికేషన్ వ్యవస్థ, హ్యాకథాన్ నుంచి ఆశించే ప్రధానాంశాలు, డిజిటల్ ఆరోగ్య రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణల గురించి విలువైన అవగాహనను ఈ సెషన్లు కల్పిస్తాయి.
మాస్టర్ క్లాస్ సిరీస్ షెడ్యూల్:
సెషన్ 1: 13 ఏప్రిల్ 2026 | మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు
సెషన్ 2: 15 ఏప్రిల్ 2026 | మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు
సెషన్ 3: 16 ఏప్రిల్ 2026 | మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు
జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానెల్ @AyushmanNHAలో అన్ని సెషన్లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
ఐఐఎస్‌సీ బెంగళూరులో గ్రాండ్ ఫైనల్
ఈ హ్యాకథాన్ ముగింపు వేడుకలను 2026 మే 8, 9వ తేదీల్లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, ప్రభుత్వ విధాన రూపకల్పన రంగాలకు చెందిన ప్రముఖ నిపుణులతో ఉన్న జ్యూరీ ఎదుట విజేత జట్లు పరిష్కారాలను ప్రదర్శిస్తాయి. ప్రతి సమస్య పరిష్కారానికి విజేతలకు వరుసగా రూ. 5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల నగదు బహుమతులను అందిస్తారు. వీటితో పాటు ఎన్‌హెచ్ఏతో కలిసి పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది.
డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల భవిష్యత్తుకు సారథ్యం
లబ్దిదారులు, ఆరోగ్య సంరక్షకులకు మెరుగైన సేవలందించటానికి పారదర్శకతను పెంచి, సామర్థ్యాన్ని పటిష్టం చేసే, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల రూపకల్పనలో ఆవిష్కరణలు, సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఈ హ్యాకథాన్ ద్వారా ఎన్‌హెచ్ఏ నిబద్ధతను చాటుకుంటోంది.
మరిన్ని వివరాలు, నమోదు కోసం https://nha.gov.in/hackathonనుసంప్రదించండి.
***
(రిలీజ్ ఐడి: 2251524)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13