ఆయుష్
ప్రపంచ హోమియోపతి దినోత్సవం- 2026 .. ఈ సందర్భంగా 2 రోజుల చర్చావేదికను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2026 11:39AM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 సంవత్సరం ఏప్రిల్ 10న ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’ సందర్భంగా ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో రెండు రోజుల పాటు సాగే చర్చావేదికను ఏర్పాటు చేయనుంది. విధాన రూపకర్తలు, పరిశోధకులు, అభ్యాసకులు, ప్రతినిధులు సుస్థిర ఆరోగ్యసంరక్షణ వ్యవస్థను తీర్చిదిద్దడంలో హోమియో వైద్యశాస్త్రం పోషిస్తున్న పాత్ర నానాటికీ విస్తరించడంపై తమ ఆలోచనలను ఈ కార్యక్రమంలో పంచుకొంటారు.
‘‘నిలకడైన ఆరోగ్యం కోసం హోమియోపతీ’’ ఇతివృత్తం ప్రధానంగా ఈ సంవత్సరంలో నిర్వహించబోయే ఉత్సవంలో, స్వాస్థ్య సేవల్ని అందించడానికి హోమియోపతీ సమగ్రమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణం పరంగా బాధ్యత కలిగిన దృష్టికోణంతో ముందుకు పోతోందని చాటిచెబుతారు. అలాగే, అందరికీ స్వాస్థ్య సంరక్షక సేవల్ని అందించడం, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) వంటి ప్రపంచ ప్రాధాన్యాలు, ప్రత్యేకించి చక్కని ఆరోగ్యం, సంక్షేమం అంశాలపై ఎస్‌డీజీ 3 ఏం చెబుతోందనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా, ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ హోమియోపతీ (సీసీఆర్‌హెచ్) నిర్వహించే ఈ కార్యక్రమంలో.. హోమియోపతీ రంగంలో విశేష పరిశోధనల రీత్యా చోటు చేసుకున్న ప్రగతి, ప్రజారోగ్య కార్యక్రమాలు, విధానపరమైన అభివృద్ధి వంటి వాటిని వివరిస్తారు. దీనిలో విజ్ఞానశాస్త్ర రీత్యా చెల్లుబాటునూ , నైతిక ప్రమాణాలనూ పటిష్ఠపరచడం, ప్రధానస్రవంతికి చెందిన ఆరోగ్యసంరక్షణ వ్యవస్థలతో హోమియోపతీని ఏకీకరించడంపైన కూడా చర్చిస్తారు.
ఆరోగ్యసంరక్షణకు సంబంధించిన ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతుండడం, పాత రోగాల తాలూకు భారం అధికమవడం, సూక్ష్మజీవినాశక మందులకు ఎదురొడ్డి నిలిచే వ్యవస్థ మనుషుల శరీరాల్లో బలపడుతుండడం (యాంటిమైక్రోబియల్ రెసిస్టెన్స్) తదితర ఆందోళనకారక పరిణామాల నేపథ్యంలో, హోమియోపతీని ఒక మన్నిక కలిగిన చికిత్స వ్యవస్థగా ఈ కార్యక్రమం వెలుగులోకి తీసుకురానుంది. కనీస స్థాయి పర్యావరణ పాదముద్ర, వనరులను హేతుబద్ధ రీతిలో ఉపయోగించడంతో పాటు మానవ దేహంలో స్వతస్సిద్ధంగా అమరి ఉన్న ఉపచార యంత్రాంగాన్ని ఉత్తేజితం చేయడం హోమియోపతీ వైద్య విధానంలో కొన్ని ప్రత్యేకతలన్న సంగతి తెలిసిందే.
ప్రత్యేక సమావేశాల్లో నివారక ప్రధాన, ప్రోత్సహపూర్వక ఆరోగ్యసంరక్షణలోనూ, జీవనశైలితో పాటు దీర్ఘకాలిక రోగాల నిర్వహణలోనూ హోమియోపతీ పోషిస్తున్న భూమిక, సాంప్రదాయిక ఔషధచికిత్సపై ఆధారపడడాన్ని తగ్గించడంలో హోమియోపతీ అందిస్తున్న తోడ్పాటునూ పరిశీలించనున్నారు. చర్చల్లో పర్యావరణానుకూల ఔషధ పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ, సాంప్రదాయిక జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్ర పరిశోధనతో ఏకీకరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం వంటి అంశాలపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తారు.
గత కొన్ని సంవత్సరాల్లో భారత్‌లోనూ, ప్రపంచ స్థాయిలోనూ విశేషించి సమాజ ఆరోగ్యసంరక్షణ, ప్రజారోగ్య సంబంధిత కార్యక్రమాల్లో హోమియోపతీ వైద్య విధానానికి గతం కన్న మరింత ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఫలితాలపై ఆధారపడ్డ పద్ధతులు, మెరుగైన లభ్యత, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో ఏకీకరణ.. ఈ మార్గాల్లో హోమియోపతీ పరిధిని విస్తరించడానికి ఆయుష్ శాఖ చురుకుగా పని చేస్తోంది.
సాంప్రదాయిక చికిత్స వ్యవస్థలను ప్రోత్సహించడంలో భారత్ నాయకత్వాన్ని మరింత బలపరచడంతో పాటు ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే, సమ్మిళిత, మన్నిక కలిగిన ఆరోగ్యసంరక్షక సేవల అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మించే దిశగా చేస్తున్న కృషికి ‘ప్రపంచ హోమియోపతీ దినోత్సవం-2026’ ఒక కొత్త వేగాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం ఆసక్తిదారు వర్గాల నడుమ చర్చలు, సహకారం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. దీంతో స్వాస్థ్య సేవ కేవలం ప్రభావవంతంగా మారడమే కాకుండా సమానావకాశాల్ని అందించే, పర్యావరణం పట్ల చైతన్యాన్ని కలిగి ఉండే మన్నికైన భవిష్యత్తు దిశగా సాగేందుకు కూడా ఈ కార్యక్రమం ఒక బాటను ఏర్పరుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2250419)
సందర్శకుల సూచీ సంఖ్య : : 35