ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై).. 11 ఏళ్లుగా సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తల సాధికారత కల్పిస్తున్న పథకం
దేశంలోని ఎంఎస్ఎంఈలు, పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం కల్పించటంలో పీఎంఎంవైది కీలక పాత్ర: శ్రీమతి నిర్మలా సీతారామన్
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్ఐల నుంచి చిన్న తరహా పారిశ్రామికవేత్తలు రుణ సహాయం పొందేందుకు వేదిక పీఎంఎంవై.. ఆర్థిక సమ్మిళితత్వానికి సహకారం: సహాయమంత్రి శ్రీ పంకజ్ చౌదరి
ముద్రా యోజన ద్వారా కార్పొరేటేతర, వ్యవసాయేతర ఆదాయ ఉత్పాదక కార్యకలాపాలకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు పొందే అవకాశం
చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణ వ్యవస్థను బలోపేతం చేస్తూ.. పీఎంఎంవై ద్వారా 57.69 కోట్ల రుణాలు... రూ.40.07 లక్షల కోట్ల పంపిణీ
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 9:37AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 8, 2015న ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై), క్షేత్రస్థాయిలో పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయటంలో 11 ఏళ్ల విజయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఆర్థిక లభ్యతలోని అంతరాన్ని తొలగిస్తూ.. కార్పొరేటేతర, వ్యవసాయేతర ఆదాయ వనరులపై ఆధారపడే చిన్న తరహా వ్యాపార సంస్థలకు మద్దతుగా రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
పారిశ్రామిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలకం. ప్రధాన కార్పొరేట్ సంస్థలకు కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తూ.. సమాన ఆర్థికాభివృద్ధికి ఇవి దోహదపడుతున్నాయి. నూతన పరిశ్రమల్లోకి పరిధిని విస్తరించటం, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచుకోవటం ద్వారా ఈ సంస్థలు.. స్థానిక వినియోగదారుల అవసరాలను, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్లను సమర్థవంతంగా తీరుస్తున్నాయి.
వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార రంగంలో.. డిజిటల్ ఆవిష్కరణలు, డేటా విశ్లేషణల కారణంగా చిన్న సంస్థలు సులభంగా పెట్టుబడిని పొందగలుగుతున్నాయి. ఈ పురోగతిలో పీఎంఎంవై కీలక ఘట్టం. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు నిర్లక్ష్యం చేసిన వారికి రుణాలు అందేలా చూడటమే లక్ష్యంగా "నిధులు లేనివారికి ఆర్థిక చేయూత" నినాదంతో ఈ వ్యూహాత్మక ప్రభుత్వ పథకాన్ని రూపొందించారు.
పీఎంఎంవై 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గడచిన దశాబ్ద కాలంలో నిశ్శబ్ద పరివర్తనకు భారత్ సాక్ష్యంగా నిలిచింది. కోట్లాది మంది సామాన్య పౌరులు ఆత్మవిశ్వాసం, సాధికారతతో పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించారు. ఏప్రిల్ 8, 2015న గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ఇందుకు ప్రధాన కారణం. "నిధులు లేనివారికి ఆర్థిక చేయూత" ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీన్ని వ్యూహాత్మకంగా రూపొందించటం వల్లే ఈ విజయం సాధ్యమైంది.
“11 ఏళ్లుగా దేశంలోని ఎంఎస్ఎంఈలకు, పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం కల్పించటంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. వీరంతా ఇప్పటివరకు సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న పారిశ్రామికవేత్తలు. ఈ కార్యక్రమం ద్వారా రుణాలు పొందటంలో అడ్డంకులు తొలగిపోవటంతో పారిశ్రామిక రంగంలోకి చాలామంది రాగలుగుగతున్నారు" అని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కోట్లాది మందికి సాధికారత కల్పించటంలో, సమ్మిళిత వృద్ధి దార్శనికతను నెరవేర్చటంలో పీఎంఎంవై పాత్రను కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. "ఇప్పటివరకు రూ.57.79 కోట్లకు పైగా రుణాలు మంజూరవగా, రూ.40.07 లక్షల కోట్ల రుణాల పంపిణీ జరిగింది. మంజూరైన రుణాల్లో మూడింట రెండొంతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందించారు. మొత్తం రుణాల్లో దాదాపు ఐదోవంతు రుణాలను తొలిసారి వ్యాపారం ప్రారంభించిన వారికి ఇచ్చారు. నూతన పారిశ్రామికవేత్తలకు 12.15 కోట్ల రుణాల ద్వారా రూ.12 లక్షల కోట్లను మంజూరు చేశారు" అని తెలిపారు.
ఈ పథకాన్ని సామాన్యులకు చేరువయ్యేలా చేసి, విజయవంతం చేసినందుకు బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు, భాగస్వాములను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రశంసించారు.
“2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దేశ ప్రయాణంలో పారిశ్రామికవేత్తలు కీలక భాగస్వాములుగా మారేందుకు, వారికి పీఎం ముద్రా యోజన సాధికారిత కల్పిస్తూనే ఉంటుంది" అని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయమంత్రి (ఎంఓఎస్) శ్రీ పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. "చిన్న పరిశ్రమలను ప్రోత్సహించటమే లక్ష్యంగా చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ఒకటి. ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఆర్థిక సమ్మిళితత్వం ఉంది. సమగ్ర వృద్ధిని సాధించటంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్ఐల నుంచి చిన్న తరహా పారిశ్రామికవేత్తలు రుణ సహాయం పొందే అవకాశాన్ని పీఎంఎంవై కల్పిస్తుంది" అని అన్నారు.
"ఏప్రిల్ 8, 2015లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముద్రా యోజనను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటమే భారత ఆర్థిక వృద్ధి, సుసంపన్నతకు కీలకమని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు వ్యాపారాలను ప్రారంభించుకోవటానికి, నిర్వహించుకోవటానికి ఈ పథకం ద్వారా లభించిన ఆర్థిక సాయం దోహదపడింది. ఆర్థిక భద్రత పట్ల నమ్మకాన్ని కలిగించింది" అని సహాయమంత్రి అన్నారు.
"దేశవ్యాప్తంగా ఇది స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించింది. ప్రత్యేకించి సమాజంలో అణగారిన వర్గాలైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు (51 శాతం రుణ లబ్ధిదారులు), మహిళలకు (67 శాతం రుణ లబ్ధిదారులు) మేలు జరిగింది" అని సహాయమంత్రి పేర్కొన్నారు.
ముద్రా యోజన ప్రభావాన్ని ఎంఓఎస్ స్పష్టం చేశారు. "ముద్రా యోజన ప్రధాన లక్ష్యం.. 'నిధులు లేనివారికి ఆర్థిక చేయూతను అందించటం’. అసంఘటిత రుణదాతల బారి నుంచి భారత చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు విముక్తి కల్పించటంలో ఈ పథకం విజయం సాధించింది. 11 ఏళ్లలో ఈ పథకం ద్వారా 57.7 లక్షల రుణాల ద్వారా 40 లక్షల కోట్లకు పైగా రుణాల పంపిణీ జరిగింది. ఇది రుణ గ్రహీతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆర్థిక సమ్మిళితత్వం ద్వార సమగ్ర వృద్ధిని సాధిస్తూ.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ నిబద్ధతకు, నిరంతర కృషికి ఇది నిలువెత్తు నిదర్శనం" అని అన్నారు.
ముద్ర పథకంలోని ప్రధాన సూత్రాల ద్వారా ఆర్థిక సమ్మిళతత్వాన్ని పెంపొందించటంలో పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకం ప్రధాన లక్షణాలు, కీలక ఘట్టాలను పరిశీలిద్దాం:
దేశంలో ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం ఈ మూడు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేనివారికి బ్యాంకింగ్ సేవలను అందించటం
2. భద్రత లేనివారికి రక్షణ కల్పించటం
3. నిధులు లేనివారికి ఆర్థిక చేయూతనందించటం
సాంకేతికతను వినియోగించటం, వివిధ భాగస్వాములతో సహకార విధానాన్ని అవలంబించటం, సేవలు అందనివారికి, తగినంత సేవలు పొందనివారికి చేరువవటం ద్వారా ఈ మూడు ప్రధాన అంశాలు విజయవంతమయ్యాయి.
ఎఫ్ఐలోని మూడు అంశాల్లో ఒకటైన నిధులు లేనివారికి ఆర్థిక చేయూతనివ్వటమనే అంశం.. చిన్న, సూక్ష్మ తరహా పారిశ్రామికవేత్తలకు పూచీకత్తు లేని రుణ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో అమలవుతున్న పీఎంఎంవై, ఆర్థిక సమ్మిళిత వ్యవస్థను ప్రతిబింబిస్తుంది.
పీఎంఎంవైలోని కీలక అంశాలు:
1. నాలుగు దశల్లో ముద్రా రుణాలను అందిస్తారు. 'శిశు’, 'కిశోర’, 'తరుణ్’, 'తరుణ్‌ప్లస్' ద్వారా అందించే రుణాలు, వ్యాపార వృద్ధిని, స్థాయిని, రుణ గ్రహీతల ఆర్థిక అవసరాన్ని తెలియజేస్తాయి.
-
శిశు: రూ.50,000 వరకు రుణాలు
-
కిశోర: రూ. 50,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు
-
తరుణ్: రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు
-
తరుణ్‌ప్లస్: రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు
2. తయారీ, వాణిజ్యం, సేవా రంగాల్లో.. కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా నిర్ణీత కాలరుణాలు, పెట్టుబడి అవసరాలను ఈ రుణాలు తీరుస్తాయి.
3. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం వడ్డీ రేట్లు ఉంటాయి. తిరిగి చెల్లించే నిబంధనలు సరళంగా ఉంటాయి.
27.03.2026 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ద్వారా సాధించిన విజయాలు
మహిళా రుణ గ్రహీతలు: శిశు విభాగంలో రూ.9.02 లక్షల కోట్లు, కిశోర విభాగంలో రూ.6.22 లక్షల కోట్లు, తరుణ్ విభాగంలో రూ.1.09 లక్షల కోట్ల రుణాల పంపిణీ జరిగింది.

మైనారిటీ రుణగ్రహీతలు: శిశు విభాగంలో రూ.1.33 లక్షల కోట్లు, కిశోర విభాగంలో రూ.1.54 లక్షల కోట్లు, తరుణ్ విభాగంలో రూ.0.62 లక్షల కోట్ల రుణాల పంపిణీ జరిగింది.

నూతన పారిశ్రామికవేత్తలు, ఖాతాలు:
శిశు విభాగం: రూ. 2.47 లక్షల కోట్లు మంజూరవగా, 8.80 కోట్ల ఖాతాల్లోకి రూ.2.42 లక్షల కోట్ల నిధుల పంపిణీ చేశారు.
కిశోర విభాగం: రూ. 5.09 లక్షల కోట్లు మంజూరవగా, 2.79 కోట్ల ఖాతాల్లో రూ.4.87 లక్షల కోట్లు జమ అయ్యాయి.
తరుణ్ విభాగం: రూ. 4.82 లక్షల కోట్లు మంజూరవగా, 55 లక్షల ఖాతాల్లోకి రూ.4.67 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేశారు.

వర్గాల వారీగా వివరాలు: (రుణాల సంఖ్య, మంజూరు చేసిన మొత్తం)
|
విభాగం
|
రుణాల సంఖ్య ఆధారంగా శాతం
|
మంజూరు చేసిన మొత్తం ఆధారంగా శాతం
|
|
శిశు
|
74 శాతం
|
32 శాతం
|
|
కిశోర
|
24 శాతం
|
43 శాతం
|
|
తరుణ్
|
2 శాతం
|
25 శాతం
|
|
తరుణ్‌ప్లస్
|
0.004 శాతం
|
0.095 శాతం
|
|
మొత్తం
|
100 శాతం
|
100 శాతం
|

సంవత్సరాల వారీగా మంజూరు చేసిన రుణాల వివరాలు:
|
ఆర్థిక సంవత్సరం
|
మంజూరైన రుణాల సంఖ్య
(కోట్లలో)
|
మంజూరు చేసిన మొత్తం
(రూ. లక్షల కోట్లలో)
|
|
2015-16
|
3.49
|
1.37
|
|
2016-17
|
3.97
|
1.80
|
|
2017-18
|
4.81
|
2.54
|
|
2018-19
|
5.98
|
3.22
|
|
2019-20
|
6.23
|
3.37
|
|
2020-21
|
5.07
|
3.22
|
|
2021-22
|
5.38
|
3.39
|
|
2022-23
|
6.24
|
4.56
|
|
2023-24
|
6.67
|
5.41
|
|
2024-25
|
5.47
|
5.53
|
|
2025-26
(27.03.2026 నాటికి)
|
4.49
|
5.65
|
|
మొత్తం
|
57.79
|
40.07
|

పీఎంఎంవై పదేళ్లకు పైగా కొనసాగుతున్న సందర్భంగా అట్టడుగు వర్గాలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయాలన్న భారతదేశ లక్ష్యం స్పష్టమవుతోంది. "బ్యాంకింగ్ సేవలు లేని వారికి బ్యాంకింగ్," "భద్రత లేని వారికి భరోసా," "నిధులు లేని వారికి ఆర్థిక చేయూత" వంటి ప్రధాన సూత్రాలపై దృష్టి సారించటం ద్వారా ఆర్థిక అంతరాలను తొలగిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలను ప్రభుత్వం నిజం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2250112)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15