రక్షణ మంత్రిత్వ శాఖ
కెన్యాలోని మొంబాసా తీరానికి చేరిన భారత నావికా దళ నౌక త్రికంద్
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 12:30PM by PIB Hyderabad
నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరింపుల్లో భాగంగా.. భారత నావికా దళ ఉన్నత స్థాయి గైడెడ్ క్షిపణి యుద్ధ నౌక ఐఎన్ఎస్ త్రికంద్ 2026 ఏప్రిల్ 7న కెన్యాలోని మొంబాసాకు చేరుకుంది. భారత్, కెన్యా మధ్య నావికా సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు.. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం.
పశ్చిమ నావికా దళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ కెన్యా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ నౌక అక్కడకు చేరుకుంది.
ఈ పర్యటన సందర్భంగా వృత్తిపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే కెన్యా రక్షణ దళాలకు అవసరమైన సామగ్రిని అందజేస్తారు. అంతేకాకుండా ఈ నౌక కమాండింగ్ ఆఫీసర్ అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు.
మొంబాసా నుంచి తిరుగు పయనమయ్యే సమయంలో.. కెన్యా నావికా దళ విభాగాలతో కలిసి నిర్గమన విన్యాసాల్లో (పాసేజ్ ఎక్సర్‌సైజ్) ఐఎన్ఎస్ త్రికంద్ పాల్గొంటుంది. ఈ విన్యాసం ఇరు దేశాల మధ్య అత్యుత్తమ పద్ధతులపై పరస్పర అవగాహనకు దోహదపడడమే కాకుండా.. నావికాపరమైన ద్వైపాక్షిక పరస్పర సమన్వయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ ఐఎన్ఎస్ త్రికంద్ పర్యటన.. భారత మహాసాగర్ (మహాసముద్ర ప్రాంతాల్లో భద్రత, వృద్ధి దిశగా పరస్పర, సంపూర్ణ పురోగతి) దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2250098)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31