వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ రంగ స్థిరత్వానికి ఐసీఏఆర్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
జాతీయ ఆహార, ఉత్పాదక భద్రత కోసం సమగ్ర ప్రణాళికపై
డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డీజీ అధ్యక్షతన తొలి సమావేశం
प्रविष्टि तिथि:
07 APR 2026 3:44PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ముందుగానే ఎదుర్కోవడానికి, వ్యవసాయ రంగానికి నష్టం కలగకుండా రక్షణ వ్యూహాలను రూపొందించడానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో జాతీయ ఆహార, ఉత్పాదక భద్రతను నిర్ధారించడానికి ఈ కింది సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
మేరా గావ్ మేరా గౌరవ్ (ఎంజీఎంజీ) కార్యక్రమ విస్తరణ: రైతులకు చేరువయ్యే లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేరా గావ్ మేరా గౌరవ్ కార్యక్రమ పరిధిని పెంచాలని నిర్ణయించారు. దీని కింద ప్రాధాన్యత ప్రాతిపదికన 100 ఆకాంక్షిత జిల్లాలను ఎంచుకుంటారు. ఇప్పటికే ఉన్న సంస్థాగత వ్యవస్థలను ఉపయోగించుకుంటూ.. సాగు పద్ధతులపై పూర్తి అవగాహన కల్పించడం క్షేత్రస్థాయిలో రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంపై ఇది దృష్టి సారిస్తుంది.
నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగం క్రమబద్ధీకరణ: ఎరువులు, జీవ ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వారీగా అంచనాలు రూపొందించి.. వరి, గోధుమ వంటి ప్రధాన పంటల్లో ఎరువులను అవసరానికి తగినట్లుగా వాడతారు. దీనివల్ల వనరుల వృధా తగ్గి, గరిష్ట సామర్థ్యం చేకూరుతుంది.
వైవిధ్యీకరణ, ప్రాంతీయ గుర్తింపు: భూ వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి చిరుధాన్యాలు పండే ప్రాంతాలను క్షుణ్ణంగా గుర్తిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా తక్కువ దిగుబడి వచ్చే వరి సాగు భూముల్లో, అధిక లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించనున్నారు. ఉదాహరణకు ఖరీఫ్ సీజన్‌లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి వరి పొలాల్లోనే పర్యావరణ హిత చేపల పెంపకం వంటి సమగ్ర పద్ధతులను ప్రవేశపెట్టనున్నారు.
సాంకేతిక, యాంత్రిక చర్యలు: వరిని నేరుగా విత్తే పద్దతి (డీఎస్ఆర్) యంత్ర ఆధారిత పరిష్కారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించడం కోసం వాతావరణ శాస్త్రానికి సంబంధించిన ఏఐసీఆర్‌పీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు.
పాలన, పర్యవేక్షణ: నిర్ణయాలను వేగంగా అమలు చేయడానికి, ప్రతి విభాగంలోనూ నోడల్ అధికారులను నియమించారు. వీరు ప్రతీ వారం పురోగతిని సమీక్షిస్తూ, కీలక రంగాల్లో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను సమన్వయం చేస్తారు.
పరిస్థితుల ఆధారంగా ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు సమావేశమవుతుంది. సంస్థాగత అభిప్రాయ సేకరణ, నిపుణుల సలహాలను ఉపయోగించుకుంటూ.. సమగ్ర, డేటా ఆధారిత సలహాలను ప్రభుత్వానికి అందిస్తుంది.
(रिलीज़ आईडी: 2249902)
आगंतुक पटल : 92