సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఎన్‌ఎఫ్‌డీసీ’ ద్వారా చలనచిత్ర వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం


· ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) నమూనా సహా ఆధునిక చలనచిత్ర నిర్మాణ పద్ధతులకు ప్రోత్సాహం

· సాంకేతిక సహాయంతోపాటు స్థానిక చలనచిత్ర కంటెంట్‌ పరిరక్షణ కోసం రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ (‘ఎస్‌ఎఫ్‌డీసీ')లకు ‘ఎన్‌ఎఫ్‌డీసీ’ సహకారం

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 4:40PM by PIB Hyderabad

  దేశంలో చలనచిత్ర నిర్మాణ వ్యవస్థకు ప్రత్యక్ష మద్దతులో భాగంగా “డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ అండ్‌ డిసెమినేషన్ ఆఫ్ ఫిల్మిక్ కంటెంట్” (డీసీడీఎఫ్‌సీ) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరిస్తుంది.

ఈ కేంద్ర ప్రాయోజిత పథకం కింద 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. చలనచిత్ర రంగంలో నాణ్యత పెంపు దిశగా ఈ నిధుల నుంచి ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందజేస్తుంది.

ఈ విధంగా ‘డీసీడీఎఫ్‌సీ’ పథకం కింద జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) ద్వారా సినిమా నిర్మాణాన్ని ప్రభుత్వం సులభతరం చేస్తుంది. ఇందులో ప్రాంతీయ సినిమాలతోపాటు డాక్యుమెంటరీల నిర్మాణానికీ తోడ్పాటు లభిస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగాగల స్థానిక సాంకేతిక నిపుణులు, కళాకారులు, సేవా ప్రదాతలకు ఉపాధి లభిస్తుంది.

గత సంవత్సరం ముంబయిలో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025) (WAVES-2025)ను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో భాగంగా “క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్” కార్యక్రమం కింద పోటీలు ఏర్పాటు చేసింది. భారత్‌ను కంటెంట్ సృష్టికి ప్రపంచ కూడలిగా మార్చాలన్న ప్రభుత్వ దార్శనికత మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100కు పైగా దేశాల నుంచి వచ్చిన కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, ఓటీటీ వేదికల నిర్వాహకులు సాంకేతిక అగ్రగాములు పాల్గొన్నారు. వీరందరితో మమేకం కావడం ద్వారా భారత  కంటెంట్‌ సృష్టికర్తలు, నిర్మాతలు, అంకుర సంస్థలు తమ ప్రతిభకు పదును పెట్టుకునే వేదికగా ఇది నిలిచింది.

దీంతోపాటు ఆడియో-విజువల్ సహ నిర్మాణ ఒప్పందాలతో జాతీయ, అంతర్జాతీయ సంయుక్త కృషిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాజెక్టులలో ప్రభుత్వ మద్దతుతోపాటు ప్రైవేట్ నిర్మాతల భాగస్వామ్యం కూడా ఉంటుంది. భారతీయ ఆడియో-విజువల్ వ్యవస్థకు పెట్టుబడులు సహా ఆధునిక చలనచిత్ర నిర్మాణ పద్ధతులను పరిచయం చేస్తూ ‘పీపీపీ’ అనుగుణ నమూనాలో ఇవి పనిచేస్తాయి.

దేశీయ చలనచిత్రోత్సవాల నిర్వహణకు సహాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేసే ఉత్సవాలకు కేంద్రం నుంచి గ్రాంట్‌ లభిస్తుంది. ‘క్యూరేటెడ్ ఫిల్మ్ ప్యాకేజీ’లు, మాస్టర్‌క్లాసులు, వర్క్‌షాప్‌ల నిర్వహణ ద్వారా కూడా అలాంటి ఉత్సవాలకు చేయూతనిస్తుంది. చలనచిత్ర పరిశ్రమ వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞాన ప్రదానం ద్వారా వివిధ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థలకు ‘ఎన్‌ఎఫ్‌డీసీ’ సహకరిస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక చలనచిత్ర కంటెంట్ పరిరక్షణకూ  మద్దతిస్తుంది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే తమ పారిశ్రామికాభివృద్ధి విధానాల కింద  ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా సహా సినిమా నిర్మాణ స్టూడియోల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయి.

కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌ ఈ రోజు పార్లమెంటులో డాక్టర్ శ్రీ తిరుమావళవన్ తొల్కాప్పియన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటనను సభ ముందుంచారు.

***


(రిలీజ్ ఐడి: 2247979) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam