|
ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని వావ్-థరద్‌లో ₹20,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం... శంకుస్థాపన.. దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
“ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంతంలో అనుసంధానం మెరుగుదలతోపాటు సామాజిక-ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడతాయి” “మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఇస్తాయి, గ్రామాలకు మార్కెట్లను.. రైతుకు కొత్త అవకాశాలను.. యువతకు ఉపాధిని సృష్టిస్తాయి” “గుజరాత్‌లో సౌరశక్తి ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తుంటే, ఈ రాష్ట్రం ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన కీలక కూడలిగా ఆవిర్భవించే రోజు ఎంతో దూరంలో లేదు” “ప్రపంచం ఇవాళ భారత్ ప్రగతి.. వృద్ధి గాథ గురించి మాట్లాడే సందర్భంలో ‘గుజరాత్ నమూనా’ను ప్రశంసిస్తున్నారు.. సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా ముఖ్యమని గుజరాత్ నిరూపించింది” “పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా విశ్వాసం ఉన్నంత కాలం ప్రగతి అనే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇదే వేగంతో దూసుకెళ్తూనే ఉంటుంది” “అనేక దేశాలు నేడు యుద్ధం.. అశాంతి.. అస్థిరతను ఎదుర్కొంటుండగా భారత్ తన స్థిరత్వం కాపాడుకోవడమేగాక నానాటికీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది”
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 7:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా వావ్-థరద్‌లో ఉత్తర గుజరాత్ కోసం సుమారు ₹20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవిత్ర నవరాత్రి వేడుక ఇప్పుడే ముగియగా, ఇవాళ భగవాన్ మహావీర్ జయంతి కూడానని గుర్తుచేశారు. అలాగే, అంబాజీ మాత, భగవాన్ శ్రీ ధరణీధర్‌లకు నివాళి అర్పించారు.
రాష్ట్ర పర్యటనలో భాగంగా తొలిసారి డీసా విమాన స్థావరంలో దిగడం తనకెంతో ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల దానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినప్పటికీ, డీసా విమానాశ్రయ విస్తరణ దశాబ్దాలుగా స్తంభించిందని పేర్కొన్నారు. అయితే, “మా ప్రభుత్వం వచ్చాకే అగ్ర ప్రాథమ్యంతో ఈ పనిని పూర్తి చేసింది” అని మోదీ చెప్పారు. ఈ విమానాశ్రయం దేశాభివృద్ధిలో ఓ కీలక మలుపు మాత్రమేగాక ఓ ప్రధాన వ్యూహాత్మక సంపద అని ఆయన వ్యాఖ్యానించారు.
వావ్-థరద్ సహా బనస్కాంత ప్రాంతంతో తనకుగల ప్రగాఢ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తానొక సంస్థాగత కార్యకర్తగా పనిచేసిన రోజుల్లో ఈ ప్రాంత గ్రామాలలో ఎక్కువ కాలం గడిపేవాడినని ప్రధానమంత్రి చెప్పారు. ఇక్కడి తల్లులు, అక్కచెల్లెళ్లు ప్రేమతో తయారుచేసిన బజ్రా రోట్లా, నెయ్యి, గౌడ్, షీరాల రుచిని ఈ సందర్భంగా ఆయన ఎంతో ఆప్యాయంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
ఈ ప్రాంత ప్రగతితో తనకుగల 25 ఏళ్ల అనుబంధాన్ని ప్రస్తావిస్తూ- ముఖ్యమంత్రిగా తాను శ్రీకారం చుట్టిన అభివృద్ధి పరంపర నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. తాను కేంద్రానికి వెళ్లాక 2014 నుంచి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంధనం, రోడ్లు, రైల్వేలు, గృహనిర్మాణం వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. “మొత్తం ₹20,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంత స్వరూపాన్ని సమూల రీతిలో మార్చి, ఇక్కడి ప్రజల జీవనానికి నవ్యోత్తేజం ఇస్తాయి” అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు.
రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి వివరిస్తూ- ఇదర్ నుంచి వడాలి బైపాస్ దాకా 4 వరుసల జాతీయ రహదారి, ధోలవీరా-సంథాల్‌పూర్ జాతీయ రహదారి ఉన్నతీకరణ, అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్ ప్రెస్‌వే కారిడార్ జాతికి అంకితం చేయడం తదితరాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇటువంటి అనుసంధానం పరిశ్రమలను, పెట్టుబడులనే కాకుండా అపార అవకాశాలను సృష్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక రైల్వే అనుసంధానంపై మాట్లాడుతూ- ఉత్తర గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాలను జాతీయ బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే హిమ్మత్‌నగర్-ఖేడ్‌బ్రహ్మ మార్గం గేజ్ మార్పిడితోపాటు ఖేడ్‌బ్రహ్మ-హిమ్మత్‌నగర్-అసర్వాలను కలిపే కొత్త రైలుకు ప్రారంభోత్సవాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “మార్కెట్లతో, రైతులకు అవకాశాలతో, యువతకు ఉపాధితో గ్రామాల అనుసంధానం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పారిశ్రామిక వృద్ధితోపాటు కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఇంధన రంగం కీలక పాత్రను వివరిస్తూ- 4.5 గిగావాట్ల విద్యుదుత్పాదన చేయగల ఖవడా పునరుత్పాదక ఇంధన పార్కుకు అనుసంధానించిన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను 2010లో చారంకా ప్రాంతంలో దేశంలోనే తొలి సౌర విద్యుత్ పార్కును ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ ప్రస్తుత అగ్రస్థానానికి ఆ తొలి ప్రయత్నమే పునాది వేసిందని పేర్కొన్నారు. “పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ ఒక ప్రధాన ప్రపంచ కూడలిగా ఆవిర్భవించే రోజు ఎంతో దూరంలో లేదు” అని ఈ సందర్భంగా ప్రగాఢ విశ్వాసం ప్రకటించారు.
భారత ప్రగతి ప్రస్థానంపై ప్రపంచంలో చర్చ వచ్చినపుడు ‘గుజరాత్ నమూనా’ విస్తృత ప్రశంసలు పొందుతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమం రెండూ చెట్టాపట్టాలు వేసుకుని సాగాల్సిన అవసరాన్ని ఈ నమూనా రుజువు చేయడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇక ఇవాళ్టి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన సుమారు 40,000 పక్కా ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని ఆయన చెప్పారు. “ఒక పక్కా ఇల్లు ఓ కుటుంబ జీవనంలో తెచ్చే ఆశావహ మార్పు లబ్ధిదారుల వదనాల్లో చిరునవ్వు రూపేణా ప్రస్ఫుటమవుతుంది. రోడ్లు, హైవేలు నిర్మించడం అవసరమే... అదే సమయంలో సామాన్యుడి జీవన ప్రమానాలు కూడా మెరుగుపడాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఉత్తర గుజరాత్ ఒకనాడు అనుభవించిన కరువు, తీవ్ర నీటి కొరత వంటి దశాబ్దాల కష్టాలను గుర్తు చేసుకుంటూ, మహిళలు నీటికోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రైతులు తమ శ్రమకు సరైన విలువ పొందలేకపోయేవారని, తమ విధిరాతను మార్చుకోవాలని సంకల్పించిన గుజరాత్ ప్రజల స్ఫూర్తిని ఆయన ప్రశంసించారు. సుజలాం.. సుఫలాం పథకం, నర్మదా జలాల విస్తరణ వంటివి పరివర్తనాత్మక చర్యలని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఇవాళ ఇక్కడి రైతు కేవలం ఒకే పంటపై ఆధారపడటం లేదు. బనస్కాంత ప్రాంతం బంగాళాదుంపల ఉత్పత్తిదారుగా అగ్రస్థానానికి ఎదగడమే ఇందుకు ఒక ఉదాహరణ” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
గుజరాత్ పాతికేళ్ల అవిచ్ఛిన్న ప్రగతి ప్రస్థానాన్ని ఈ రాష్ట్రం సంబరం చేసుకుంటున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఈ రాష్ట్రం సదా తన సొంత రికార్డులను నెలకొల్పడమేగాక ఎలా అధిగమించిందో గమనించాలని సూచించారు. తాను 2005లో ₹650 కోట్ల బడ్జెట్‌తో ‘పట్టణాభివృద్ధి సంవత్సరం’ కార్యక్రమాన్ని ప్రారంభించగా అది ఇప్పుడు ₹33,000 కోట్లకు పైగా పెరిగిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని 9 కొత్త మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ₹2,300 కోట్ల విలువైన దాదాపు 300 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. అలాగే, 72 మున్సిపాలిటీల ఉన్నతీకరణ సహా ₹4 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపును ప్రస్తావించారు. ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికీ ఇవాళ అభివృద్ధి ఫలితాలు చేరుతున్నాయని, భవిష్యత్తులోనూ చేరుతాయని ఆయన హామీ ఇచ్చారు. “పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మీ నమ్మకం ఉన్నంత కాలం, అభివృద్ధి అనే సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఇదే వేగంతో దూసుకెళ్తూనే ఉంటుంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.
ప్రపంచంలో నేటి పరిస్థితులను ప్రస్తావిస్తూ- అనేక దేశాలు యుద్ధం, అస్థిరత, ఆకాశాన్నంటే ఇంధన ధరలతో సతమతం అవుతున్నాయని చెప్పారు. అగ్రరాజ్యాలలో సైతం డీజిల్, పెట్రోల్ ధరలు 10 నుంచి 25 శాతం దాకా పెరిగాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, భారత్ తన సఫల విదేశాంగ విధానంతోపాటు ప్రజల ఐక్యత ద్వారా సంక్షోభాన్ని అదుపులో ఉంచగలిగిందని ఆయన తెలిపారు.
కోవిడ్ మహమ్మారి సమయాన దేశం ఐక్యంగా స్పందించిన తీరును గుర్తుచేస్తూ- ప్రస్తుత క్లిష్ట సమయంలోనూ పౌరులు ఒకేతాటిపై నిలవాలని ప్రధానమంత్రి కోరారు. “ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ తన స్థిరత్వాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా ప్రగతి ప్రస్థానంలో నిరంతరం దూసుకుపోతోంది. ఈ దృఢ సంకల్పానికి నేటి ప్రాజెక్టుల ప్రారంభమే మరో నిదర్శనం” అని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2247446)
|