హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలో ‘జనగణన- 2027’పై విలేఖరుల సమావేశంలో మాట్లాడిన భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్


· ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన కార్యక్రమమిది.. రెండు దశల్లో నిర్వహణ: 2026 ఏప్రిల్ 1 నుంచి మొదటి దశ

· తొలిసారిగా డిజిటల్ పద్ధతితో జనగణన.. తొలిసారిగా స్వీయ గణనకూ అవకాశం

· అండమాన్ - నికోబార్ దీవులు, ఎన్ఎండీసీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిశా, సిక్కింలలో 2026 ఏప్రిల్ 1 నుంచి 15 వరకు స్వీయ గణన ప్రక్రియ.. ఆపై ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు గృహాల జాబితా, గృహ గణన

· సురక్షిత వెబ్ ఆధారిత సదుపాయంగా స్వీయ గణన... ఇంటింటి సర్వేకు ముందు 16 భాషల్లో ఆన్‌లైన్‌లో సమాచారాన్ని నమోదు చేసుకునే అవకాశం

· స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ యాప్‌ను ఉపయోగించి నేరుగా డేటా సేకరించి సమర్పించనున్న గణకులు

· డేటా భద్రత కోసం అవసరమైన ఏర్పాట్లు

· దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా గణకులు, పర్యవేక్షకులు, ఇతర అధికారులు

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 3:22PM by PIB Hyderabad

2027 జనగణనపై న్యూఢిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ప్రసంగించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఇందులో మొదటి దశ 2026 ఏప్రిల్ 1 నుంచి మొదలవనుంది. జనాభా లెక్కలను మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబోతున్నారు. అలాగే మొదటిసారి ‘స్వీయ గణన’ చేసుకునే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. అండమాన్ - నికోబార్ దీవులు, ఎన్ఎండీసీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిశా, సిక్కింలలో 2026 ఏప్రిల్ 1 నుంచి 15 వరకు స్వీయ గణన ప్రక్రియనూ, ఆపై ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు గృహాల జాబితా, గృహ గణనలనూ నిర్వహించనున్నారు.

జనగణన చట్టం-1948, జనగణన నియమాలు-1990 నిబంధనల ప్రకారం దేశంలో జనాభా లెక్కలను నిర్వహిస్తారు. కాలానుగుణంగా ఆ నిబంధనలకు సవరణలు చేశారు. భారత్‌లో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు. 2027 జనగణన వరుస క్రమంలో 16వది కాగా, స్వాతంత్ర్యానంతరం ఇవి 8వ జనాభా లెక్కలు.

2027 జనగణన నిర్వహించబోతున్నట్టు 2025 జూన్ 16న భారత గెజిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. 2027 మార్చి ఒకటో తేదీ 00:00 గంటలను దీనికి ప్రామాణిక తేదీగా నిర్ణయించింది (లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు.. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని మంచుతో నిండిన, సాధారణ సమయంతో అనుసంధానం లేని ప్రాంతాలకు మాత్రం ప్రామాణిక తేదీని 2026 అక్టోబర్ ఒకటో తేదీ 00:00 గంటలుగా ఖరారు చేసింది).

2027 జనాభా లెక్కలను రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశను ‘గృహాల జాబితా, గృహ గణన’గా పిలుస్తారు. సాధారణంగా దీన్ని హెచ్ఎల్‌వో అంటారు. దీనిని 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో.. ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సౌలభ్యం మేరకు నిర్ణీత 30 రోజుల వ్యవధిలో పూర్తి చేస్తారు. ఇంటింటికీ వెళ్లి చేసే గృహ జాబితా ప్రక్రియకు గల 30 రోజుల వ్యవధికి.. సరిగ్గా 15 రోజుల ముందు స్వీయ గణన వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ దశలో ఇళ్ల పరిస్థితి, కుటుంబానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వారి ఆస్తుల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మొదటి దశకు సంబంధించిన ప్రశ్నల వివరాలను 2026 జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది.

రెండో దశ – ‘జనాభా గణన’ను 2027 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు (లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మంచుతో నిండిన, సాధారణ సమయంతో అనుసంధానం లేని ప్రాంతాల్లో మాత్రం రెండో దశను 2026 సెప్టెంబరులోనే నిర్వహిస్తారు). సీసీపీఏ నిర్ణయం ప్రకారం.. ఈ రెండో దశలోనే కుల గణన కూడా చేపట్టనున్నారు. ఈ దశలో ప్రతి వ్యక్తి నుంచి జనాభా వివరాలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు, విద్య, వలసలు, సంతానోత్పత్తి వంటి అంశాలపై సమాచారాన్ని సేకరిస్తారు. ఈ జనగణన కచ్చితమైన తేదీలు, ఈ దశలో అడిగే ప్రశ్నల వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది.

అండమాన్ - నికోబార్ దీవులు, ఢిల్లీ (న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు), గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు గృహాల జాబితా, గృహ గణన నిర్వహిస్తారు. దీనికి ముందు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు.. 15 రోజుల పాటు స్వీయ గణనకు అవకాశం ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాల్లో మే 1 నుంచి 30 వరకు గృహజాబితా గణన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుంది. మొదటి దశకు సంబంధించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పూర్తి వివరాలు, స్వీయ గణన వివరాలు అనుబంధంలో ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం జనగణన-2027 కోసం రూ. 11,718.24 కోట్లను అందించేందుకు నిర్ణయించింది. ఈ నిధులతో జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి గౌరవ వేతనం, శిక్షణతోపాటు, ఐటీ మౌలిక సదుపాయాలు, రవాణా, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఏర్పాట్లు చేస్తారు.

2027 జనాభా లెక్కలను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తారు. గణకులు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించిమొబైల్ యాప్ ద్వారా నేరుగా డేటాను సేకరించి సమర్పిస్తారు. దీనితోపాటు రెండు దశల్లోనూ స్వీయ గణన కోసం ఆన్‌లైన్ సదుపాయం ఉంటుంది. హిందీఇంగ్లిష్ సహా 16 భాషల్లో మొబైల్ యాప్‌తోపాటు స్వీయ గణన పోర్టల్ అందుబాటులో ఉంటాయి. జనగణన సంబంధిత క్షేత్రస్థాయి కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణ కోంస ఒక ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. దీని ద్వారా గణకులు, పర్యవేక్షకులకు నియామక పత్రాలు, గుర్తింపు కార్డుల జారీ, వారికి పనుల కేటాయింపు వంటివి జరుగుతాయి. అలాగే జనగణన సిబ్బందికి శిక్షణ నిర్వహణ, హెచ్ఎల్బీ తయారీ, పనుల పురోగతిని డ్యాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, కొన్ని రకాల జనగణన రికార్డులు/సంగ్రహ వివరాలను స్వయంచాలకంగా రూపొందించడం వంటివి ఈ పోర్టల్ ద్వారా వీలవుతాయి. వెబ్ మ్యాపింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించి గృహ జాబితా బ్లాకులను (హెచ్ఎల్బీ) రూపొందిస్తారు. డేటా భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంది.

స్వీయ గణన కోసం.. పౌరులు మొబైల్ నంబర్, ఇతర ప్రాథమిక వివరాలను ఉపయోగించి స్వీయగణన (ఎస్ఈ) పోర్టల్‌లో లాగిన్ అవ్వొచ్చు. వారికి అనువైన సమయంలో జనగణన షెడ్యూలును పూర్తి చేయవచ్చు. వివరాలను సమర్పించిన అనంతరం.. ఒక ప్రత్యేక స్వీయ గణన ఐడీ (ఎస్ఈఐడీ) వస్తుంది. క్షేత్రస్థాయి సందర్శన సమయంలో గణకులకు ఈ ఐడీని తెలియజేయాల్సి ఉంటుంది. గణకులు రావడానికి ముందే.. తమకు వీలున్న సమయంలో సమాచారాన్ని నింపే వెసులుబాటును ఈ స్వీయ గణన కల్పిస్తుంది. మరోవైపు గత జనాభా లెక్కల మాదిరిగానే.. గణకులు తమకు కేటాయించిన బ్లాకుల్లో ఇంటింటికీ వెళ్లి గణనను కొనసాగిస్తారు. అయితే స్వీయ గణన అన్నది ఈ దఫా ప్రజలకు అందించిన అదనపు సదుపాయం.

(ఎస్ఈ పోర్టల్‌లోకి వెళ్లి (se.census.gov.in)  మొబైల్ నంబరు ద్వారా లాగిన్ అవ్వాలి  మ్యాపులో ప్రదేశాన్ని గుర్తించాలి  కుటుంబ వివరాలను నింపాలి  సమాచారాన్ని సమర్పించాలి  ఎస్ఈఐడీని పొందుతారు  ఎస్ఈఐడీని గణకులకు తెలియజేయాలి  డేటా నిర్ధారణ అవుతుంది, జనగణనలో చేరుతుంది)

జనగణన మొదటి దశ (హెచ్ఎల్‌వో) కోసం 2025 నవంబరులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని దాదాపు 5,000 బ్లాకుల్లో ముందస్తు పరీక్ష (ప్రీ టెస్ట్) నిర్వహించారు. మొత్తం జనగణన ప్రక్రియకు సంబంధించి ఇదొక పూర్తి స్థాయి రిహార్సల్ వంటిది. ఇందులో జనగణన క్షేత్రస్థాయి సిబ్బంది, రాష్ట్ర స్థాయి అధికారుల నియామకం, శిక్షణ, ప్రశ్నావళిని పరిశీలించడం, సంబంధిత యాప్‌లు - పోర్టళ్ల పనితీరును సరిచూడడం వంటి పనులన్నీ  చేపట్టారు. డేటా సేకరణ నుంచి డేటా ప్రాసెసింగ్ వరకు అన్ని అంశాలను ఇందులో క్షుణ్ణంగా పరిశీలించారు.

2026 జనవరి 1 నుండి 2027 మార్చి 31 వరకు అన్ని పరిపాలన విభాగాల్లో మార్పులు-చేర్పులపై నిషేధం విధించారు. 2026 జనవరి 1 నాటికి ఉన్న గణాంకాల ప్రకారం దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 7,092 ఉప-జిల్లాలు, 5,128 పట్టణాలు, జనసంఖ్య పరంగా పట్టణ లక్షణాలున్న 4,580 ప్రాంతాలు, దాదాపు 6,39,902 గ్రామాల్లో 2027 జనాభా లెక్కలను నిర్వహిస్తారు.

జనగణన సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. వంద మంది జాతీయ శిక్షకులకు విషయ నిపుణులు శిక్షణ ఇచ్చారు. వారు సుమారు 2,000 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ఆ మాస్టర్ ట్రైనర్లు దేశవ్యాప్తంగా దాదాపు 45,000 మంది క్షేత్ర స్థాయి శిక్షకులకు మెళకువలు నేర్పిస్తున్నారు. చివరిగా ఈ క్షేత్రస్థాయి శిక్షకులు దాదాపు 80 వేల బ్యాచ్‌లలో 31 లక్షల మంది వరకు గణకులు, పర్యవేక్షకులకు శిక్షణ ఇవ్వనున్నారు.

క్షేత్రస్థాయి సేనలైన గణకులు, పర్యవేక్షకులు నాణ్యమైన గణాంకాలను సకాలంలో సేకరించడంలో ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఉండేలా.. అవసరమైన అన్ని శిక్షణ సామగ్రిని ప్రాంతీయ భాషల్లో సిద్ధం చేశారు.

*****

అనుబంధం

 

*గుజరాత్ – మారే అవకాశముంది

**జార్ఖండ్ – జనగణన నిర్వహణకు ప్రకటన విడుదలైంది. హెచ్ఎల్‌వో వ్యవధికి సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది.

***


(రిలీజ్ ఐడి: 2247067) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam