ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై లోక్‌సభలో చేసిన తన ప్రసంగంలోని విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 9:05PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా భారతీయుల సౌకర్యానికి, భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, పూర్తి సున్నితత్వం, అప్రమత్తత, సంసిద్ధతతో అవసరమైన ప్రతి చర్య తీసుకుంటోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ‍ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం భారత్‌కు అనూహ్యమైన సవాళ్లను విసిరింది. అందువల్ల ఈ సంక్షోభంపై దేశ పార్లమెంటు నుంచి వెలువడే ఏకగ్రీవ, ఐక్య స్వరంతో కూడిన సందేశం ప్రపంచవ్యాప్తంగా వినిపించడం అత్యవసరం.’’

‘‘యుద్ధం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం భారతీయుల సౌకర్యానికి, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. మేం అత్యంత సున్నితత్వంతో, అప్రమత్తతతో, తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’’

‘‘ఇలాంటి సంక్షోభాల నుంచి దేశంలోని మన రైతులను రక్షించడానికి గత కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వారి ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.’’

‘‘పశ్చిమ ఆసియాలోని సంబంధిత నేతలందరితో సంభాషించి, ఉద్రిక్తతలను తగ్గించాలని ఈ సంఘర్షణను ముగించాలని నేను కోరాను. ఈ ప్రాంతంలో భారతీయ నౌకల భద్రత, వాటి సురక్షిత రాకపోకలను నిర్ధారించడానికి మా దౌత్య ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి.’’

‘‘దేశంలోని సామాన్య కుటుంబాలకు కనీస ఇబ్బందులు కూడా కలగకూడదనేదే మా ప్రధాన లక్ష్యం. అందుకే దేశీయ వినియోగదారుల కోసం ఎల్‌పీజీ లభ్యతకు మేం ప్రాధాన్యతనిచ్చాం’’

 

***


(రిలీజ్ ఐడి: 2244258) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam