రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రస్తుత భౌగోళిక, రాజకీయ అస్థిరత మధ్య భారత్ రాబోయే కొన్నేళ్లలో డ్రోన్ తయారీకి ప్రపంచ కూడలిగా తప్పక మారాలి: జాతీయ రక్షణ పరిశ్రమల సదస్సు-2026లో రక్షణ మంత్రి
‘‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, రక్షణ సన్నద్ధత, స్వయం సమృద్ధిల కోసం
స్వదేశీ డ్రోన్ ఉత్పత్తి వ్యవస్థను తీర్చిదిద్దుకోవడం ఎంతైనా అవసరం’’
‘డీఐఎస్‌సీ 14, అదితి చాలెంజెస్ 4.0’లో భాగంగా రక్షణ దళాలు, ఐసీజీ, డీఎస్ఏలతో పాటు డీపీఎస్‌యూలకు చెందిన 200కు పైగా సమస్య ప్రధాన స్టేట్‌మెంట్ల విడుదల
‘‘ఐడెక్స్ ద్వారా రక్షణ నవకల్పన వ్యవస్థలో చేరిన 676 అంకుర సంస్థలు/ఎమ్ఎస్ఎమ్‌ఈలు/నూతన ఆవిష్కర్తలు..
రూ.3,853 కోట్ల విలువైన 58 ప్రోటోటైపుల కొనుగోలుకు ఆమోదముద్ర..
రూ.2,326 కోట్ల విలువైన 45 కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు పూర్తి
‘‘ఆర్థిక వృద్ధికి వేగాన్ని సంతరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్ఎస్ఎమ్ఈలు..
‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో కొత్త సాంకేతికతను అనుసరించాల్సిన అవసరం ఉంది’’
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 2:04PM by PIB Hyderabad
‘‘రాబోయే కొన్ని సంవత్సరాల్లో దేశీయ డ్రోన్ తయారీకి ప్రపంచ కూడలిగా ఎదగడానికి భారత్ ఉద్యమ తరహాలో పని చేసి తీరాలి’’ అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాటుకోవడానికి, రక్షణ సన్నద్ధతను పెంపొందించుకొని వర్తమాన భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నడుమ దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకోవడానికి డ్రోన్ ఉత్పత్తి వ్యవస్థను నిర్మించుకోవాల్సిన తక్షణావసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ రక్షణ పరిశ్రమల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ( ఎమ్ఎస్ఎమ్ఈలు), అంకుర సంస్థలు, ఐడీఈఎక్స్ (ఇన్నొవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్) విజేతలు, రక్షణ సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు (డీపీఎస్‌యూలు), ప్రయివేటు రంగ రక్షణ కంపెనీలు, నూతన ఆవిష్కర్తలు, విధానరూపకర్తలు, విద్య రంగ ప్రముఖులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఈ సదస్సును ‘అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీస్’ అంశంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ (డీడీపీ) నిర్వహిస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వరకూ.. ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణలు... డ్రోన్, డ్రోన్ నిరోధక సాంకేతికతలు భావి యుద్ధతంత్రాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయనే స్పష్టమైన సంకేతాల్ని అందిస్తున్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో, డ్రోన్ తయారీలో స్వయం సమృద్ధి ఒక్క అంతిమ ఉత్పాదనకే పరిమితం కాకూడదని, దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో కూడా స్వయం సమృద్ధిని సాధించాలని ఆయన చెప్పారు. ‘‘డ్రోన్ మోల్డుల మొదలు సాఫ్ట్‌వేర్, ఇంజిన్లు, బ్యాటరీలు, ప్రతిదీ.. తప్పనిసరిగా భారత్‌లోనే తయారు చేయాలి. ఇది అంత సులభమైన పని ఏమీ కాదు. డ్రోన్లను తయారు చేస్తున్న చాలా దేశాల్లో కీలక భాగాలను ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నార’’ని ఆయన అన్నారు.
ఏ దేశ రక్షణ పారిశ్రామిక అనుబంధ విస్తారిత వ్యవస్థ అయినా పెద్ద పరిశ్రమలు, ఎమ్ఎస్ఎమ్ఈలు, అంకుర సంస్థలు, నూతన ఆవిష్కర్తల తోడ్పాటుపై ఆధారపడి ఉంటుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దీంతో పాటు, ప్రభుత్వాల సుస్పష్ట, దూరదర్శి విధానాలు పోషించే పాత్రా కీలకమేనని ఆయన చెప్పారు. ఈ విధానాల్ని దేశ నిర్దిష్ట రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారన్నారు. ప్రయివేటు రంగం క్రియాశీల తోడ్పాటును అందించడానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వదేశీ డ్రోన్ తయారీకి ప్రపంచ కూడలి (గ్లోబల్ హబ్)గా భారత్‌ను నిలిపేందుకు పూర్తి స్థాయిలో మద్దతును అందించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ప్రారంభ సదస్సులో ఒక భాగంగా, డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ (డీఐఎస్‌సీ-14)తో పాటు ఐడెక్స్ ప్రణాళికలో భాగంగా అదితి చాలెంజెస్ 4వ సంచికకు కూడా రక్షణ మంత్రి శుభారంభం చేశారు. రక్షణ దళాలూ, భారతీయ కోస్తాతీర రక్షకదళం, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ నుంచి అందిన మొత్తం 107 సమస్య ప్రధాన స్టేట్‌మెంట్లలో డీఐఎస్‌సీ-14 లోని 82తో పాటు అదితి చాలెంజెస్ 4.0కు చెందిన 25 కలిసివున్నాయి. ఇవి వివిధ రంగాల్లో ఇంతవరకూ ఎరుగని నవకల్పనల్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి.

డిజైన్ ఆధారిత నవకల్పనకు అంకుర సంస్థలూ, ఎమ్ఎస్ఎమ్ఈలూ ముందుకు ఉరికేటట్లు వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో రక్షణ సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థల (డీపీఎస్‌యూ) ద్వారా 101 నవకల్పన పరమైన సవాళ్లతో కూడిన ఓ కొత్త కార్యక్రమాన్ని రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ సవాళ్లకు డీపీఎస్‌యూలు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. దీనిలో భాగంగా ఎంపిక చేసిన అంకుర సంస్థలు మార్గదర్శకత్వాన్ని (మెంటర్‌షిప్)ను అందజేయడం తో పాటు, పరీక్షా ప్రధాన సదుపాయాలనీ, విజేతలుగా నిలిచే అంకుర సంస్థలతో తమ సరఫరా వ్యవస్థల్ని భవిష్యత్తులో ఏకీకరించుకొనేందుకు అవకాశాల్నీ కల్పిస్తాయి.
ఐడీఈఎక్స్, అదితి (యాక్టింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్నొవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్) .. ఈ రెండూ మేలిమలుపులను తీసుకువచ్చే కార్యక్రమాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారు. వీటి సాయంతో అంకుర సంస్థలు, నూతన ఆవిష్కర్తలు, ఎమ్ఎస్ఎమ్ఈలకు రక్షణ దళాల ప్రత్యేక అవసరాలను నెరవేర్చడానికి కొత్త పరిష్కారాలను అభివృద్ధిపరచాల్సిన అవకాశాలను అందిస్తున్నారని ఆయన తెలిపారు. ‘‘2026 ఫిబ్రవరి వరకూ, దాదాపు 676 అంకుర సంస్థలూ, ఎమ్ఎస్ఎమ్ఈలతో పాటు వ్యక్తిగత నూతన ఆవిష్కర్తలు రక్షణ సంబంధిత నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థలో భాగమయ్యారు. 548 ఒప్పందాలపై సంతకాలయ్యాయి. వీటిలో 58 మూలరూపాలను (ప్రోటోటైప్స్)ను కొనుగోలు చేయడానికి మంజూరు లభించింది. వీటి విలువ సుమారు రూ. 3,853 కోట్లు. దీనికి అదనంగా, సుమారు రూ. 2,326 కోట్ల విలువైన 45 కొనుగోలు ఒప్పందాలపై ఇప్పటికే సంతకాలు పూర్తి అయ్యాయి. ఈ గణాంకాలు నవకల్పన ఉత్పాదనలలోకి, సాంకేతికతల లోకి బదిలీ అవుతోందని, ఈ పరివర్తనలో మన అంకుర సంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలు పోషిస్తున్న పాత్ర నానాటికీ బలోపేతం అవుతోందని చాటిచెబుతున్నాయి’’ అని మంత్రి అన్నారు.
ఎమ్ఎస్ఎమ్ఈలు ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ), ఆటొమేషన్, రోబోటిక్స్, అనుబంధ తయారీ ప్రక్రియలు (యాడిటివ్ మాన్యుఫాక్చరింగ్) వంటి రంగాల్లో చురుకుగా పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇది గతంలో ఎన్నడూ ఎరుగని, సకారాత్మక మార్పును సూచిస్తోందని ఆయన అన్నారు. ఈ సాంకేతికతలను అనుసరించి, ఏకీకరించడం ఎమ్ఎస్ఎమ్ఈలూ, అంకుర సంస్థలకు అనివార్యం. ఇలా చేస్తే అవి వాటి వనరుల్ని, సామర్థ్యాన్ని వీలయినంత ఎక్కువ స్థాయిలో ఉపయోగంలోకి తీసుకురాగలుగుతాయని మంత్రి తెలిపారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆటొమేషన్, కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, యాడిటివ్ మాన్యుఫాక్చరింగ్ వంటి నవకల్పనలు ప్రపంచ తయారీ రంగానికి కొత్త ఆకారాన్ని ఇస్తున్నాయి. దీనికి అదనంగా, ‘డిజిటల్ ట్విన్’, పురోగామి సిమ్యులేషన్ వంటి సాంకేతికతలు అనేక అవకాశాలకు తలుపులను తెరుస్తున్నాయి. ‘డిజిటల్ ట్విన్’లో మౌలికంగా వాస్తవ ప్రపంచ వ్యవస్థ తాలూకు వర్చువల్ మోడల్‌ను రూపొందించడం ఒక భాగంగా ఉంటుంది. ఇలాంటి సాంకేతికతలు సంక్లిష్ట వ్యవస్థల్ని మెరుగైన విధంగా అర్థం చేసుకోవడంతో పాటు మరిన్ని విషయాలను తెలుసుకొన్న తరువాతనే తగిన నిర్ణయాలను తీసుకోవడంలో మనకు తోడ్పడుతాయి’’ అని మంత్రి అన్నారు.

ఎమ్ఎస్ఎమ్ఈల సామర్థ్యాలను పెంచడంలో ‘ఏకీకరణ’ మరో కీలకాంశమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘ఈ ఏకీకరణను రెండు విధాలుగా.. క్షితిజ సమాంతరంగానూ, క్షితిజ లంబంగానూ సాధించవచ్చు. మొదటి విధానంలో భిన్న రంగాలకు చెందిన ఎమ్ఎస్ఎమ్ఈలను ఒకదానితో మరొకదానిని సంధానించడం, ఒక సంస్థ అనుభవం నుంచి మరొక సంస్థ నేర్చుకొనేందుకూ, పరస్పరం సహకరించుకొనేందుకూ ఏర్పాటు చేయడం భాగంగా ఉంటుంది. రెండో విధానంలో పెద్ద పరిశ్రమలతో ఎమ్ఎస్ఎమ్ఈలు భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొని, కొత్తగా ఉనికి లోకి వస్తున్న సాంకేతిక రంగాల్లో కలసి పనిచేస్తూ, కృత్రిమ మేధ (ఏఐ), ఆటొమేషన్, రోబోటిక్స్, యాడిటివ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో నిపుణత్వాన్ని సాధించడం చోటుచేసుకొంటాయి. మన ఎమ్ఎస్ఎమ్ఈలు ‘ఇండస్ట్రీ 4.0’ దిశగా శరవేగంగా దూసుకుపోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఇది.. పైన ప్రస్తావించిన ప్రకారం క్షితిజ సమాంతర ఏకీకరణ, క్షితిజ లంబ ఏకీకరణలు ఏక కాలంలో చోటుచేసుకుని, తద్వారా ఒక పటిష్ఠ నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థను సాకారం చేసినప్పుడు సాధ్యపడుతుందని మంత్రి అన్నారు.
ఎమ్ఎస్ఎమ్ఈలను పటిష్ఠపరచడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని రక్షణ మంత్రి చెబుతూ, ఎమ్ఎస్ఎమ్ఈలకు ఈక్విటీ, లిక్విడిటీ, వృత్తిపరమైన సహాయాన్ని అందించడం కోసం మూడు విధాలైన దృష్టికోణాన్ని అనుసరించారన్నారు. ఎమ్ఎస్ఎమ్‌ఈల వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు దేశీయ మార్కెట్లోనూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎమ్ఎస్ఎమ్ఈల పోటీపడే తత్వాన్ని ఇప్పటితో పోలిస్తే మరింత పెంచడమే ధ్యేయమని ఆయన వివరించారు.
ఈ ‘‘కీలక’’ రంగానికి ప్రభుత్వం 2014 నుంచీ నిరంతర ప్రాధాన్యాన్నిస్తూ, దీనిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఎమ్ఎస్ఎమ్ఈల నమోదును, గుర్తింపును సులభతరం చేయడం కోసం ఉద్యమ్ పోర్టల్, ఉద్యమ్ అసిస్ట్ పోర్టల్ వంటి డిజిటల్ వేదికలను ప్రారంభించినట్లు చెప్పారు. ‘‘చిన్న పరిశ్రమలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థలో ఏకీకరించి, ఆయా సంస్థలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని అందుకొనేటట్లు చూడడం ఈ కార్యక్రమాల లక్ష్యమ’’ని ఆయన అన్నారు. దేశంలో ఎమ్ఎస్ఎమ్ఈల సంఖ్య 2012-13లో దాదాపు 4.67 కోట్లుగా ఉందనీ, ఇటీవలి సమాచారం ప్రకారం ఈ సంఖ్య సుమారు 8 కోట్లకు చేరువైందని ఆయన తెలిపారు. ఈ వృద్ధి దేశంలో ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతోందని, చిన్న పరిశ్రమలు ప్రస్తుతం ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా మహత్తర పాత్ర పోషణను చాటిచెబుతోందని ఆయన అన్నారు.

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, అంకుర సంస్థలు వాటి సిసలైన అద్వితీయ ఆలోచనల ద్వారా సామాజిక పరివర్తనను తీసుకురావడంలో ఉత్ప్రేరక పాత్రను నిర్వహిస్తున్నాయని, అనేక సంస్థలు చాలా తక్కువ సమయంలోనే ‘యూనికార్న్’గా ప్రతిష్ఠాత్మక హోదాను కూడా సాధిస్తున్నాయని అన్నారు. రాబోయే కొద్ది కాలంలో మరిన్ని సంస్థలు తదుపరి తరానికి చెందిన ‘యూనికార్న్’లుగా ఎదుగుతాయని ఆయన అన్నారు. కావలసిందల్లా నిరంతర కృషి, దృఢ సంకల్పంతో పాటు తిరుగులేని అంకిత భావమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఎమ్ఎస్ఎమ్ఈలూ, అంకుర సంస్థలూ కొత్త ఉత్పాదనలను ఆవిష్కరించాలన్న ఉత్సాహంతో, మక్కువతో ముందుకు ఉరకాలని, ఆత్మనిర్భర్ భారత్‌తో పాటు వికసిత్ భారత్ దృష్టికోణాలను సాకారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రక్షణ ఉత్పత్తి కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఆధునిక తయారీ సాంకేతికతలను ప్రోత్సహించడంతో పాటు ఉత్పాదన అనుబంధ విస్తారిత వ్యవస్థతోనూ, డిజైన్, అభివృద్ధి, తయారీ సహా పూర్తి వేల్యూ చైన్లోనూ ఎమ్ఎస్ఎమ్ఈలను ఏకీకరించడం ఈ సదస్సు ముఖ్యోద్దేశాలని తెలిపారు. 200 సమస్యప్రధాన స్టేట్‌మెంట్లు ఎమ్ఎస్ఎమ్ఈలకూ, పరిశ్రమలకూ, అంకుర సంస్థలకూ, యువ నూతన ఆవిష్కర్తలకూ తమ నైపుణ్యాలను పెంపొందింప చేసుకోవడానికి, అత్యాధునిక ఉత్పాదనలకు రూపురేఖలను తీర్చిదిద్దడానికి అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన అన్నారు.
కార్యదర్శి (డీపీ) ‘సంస్కరణల సంవత్సరం-2025’లో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ చర్యలను వివరించారు. ‘‘వేర్వేరు ఆమోదాలను, అనుమతులను క్రమబద్ధం, సరళతరం చేయడం సహా నాణ్యత ప్రక్రియలను పటిష్ఠపరచడం, పరీక్షా ప్రధాన ప్రయోగశాలలను డీపీఎస్‌యూలు, డీఆర్‌డీఓ అధీనంలోకి తీసుకురావడం వంటి ముఖ్య సంస్కరణలను డీడీపీ అమలు చేసింది. రక్షణ రంగంలో పనిచేస్తున్న పరిశ్రమలతో ఒక డిజిటల్ డేటాబేస్‌ను ‘సృజన్ దీప్’ పేరిట రూపొందించారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి వనరులను విస్తృతంగా సమకూర్చడానికి 40,000 కన్నా ఎక్కువ పరిశ్రమల వివరాలను ఈ డిజిటల్ డేటాబేస్‌లో పొందుపరిచార’’ని ఆయన అన్నారు.
రక్షణ ఉత్పత్తి విభాగానికి సంబంధించిన 5 ప్రచురణలను కూడా ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి విడుదల చేశారు. విధానపరమైన కార్యక్రమాల పట్ల చైతన్యాన్ని పెంచడం, రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు పరిశ్రమతో ముడిపడి ఉన్న ఆసక్తిదారుల కోసం వాణిజ్య నిర్వహణలో సౌలభ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ అయిదు ప్రచురణలూ ఈ కింది విధంగా ఉన్నాయి:
సామర్థ్య 2026 - రక్షణ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా మరో యాత్ర: రక్షణ తయారీలో స్వయం సమృద్ధి ప్రోత్సహించడానికి మార్గసూచీతో పాటు కీలక కార్యక్రమాల రూపురేఖలను వివరించే పత్రం ఇది.
భారతీయ రక్షణ పరిశ్రమ - ప్రపంచ స్థాయికి విస్తరించడం: ఈ నివేదిక భారత్‌లో వృద్ధి చెందుతున్న రక్షణ ఎగుమతులతో పాటు ప్రపంచ మార్కెట్టులో భారతీయ కంపెనీలకు ఇప్పుడున్న అవకాశాలను ప్రస్తావిస్తుంది.


సంకలన్: రక్షణ రంగ కంపెనీలూ, ఎమ్ఎస్ఎమ్ఈల సామాన్య ప్రశ్నలకు జవాబులు అందించే ఒక ఉపయోగకర కరదీపిక ఇది.
రక్షణ పీఎస్‌యూ అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఎమ్ఎస్ఎమ్ఈలను ఏకీకరించడానికి అనువైన సర్దుబాట్లు చేయడం: ఇది డీపీఎస్‌యూ అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఎమ్ఎస్ఎమ్ఈలను ఏకీకరించడానికి చేపట్టాల్సిన కొత్త చర్యల రూపురేఖలను వివరించే ఒక చిన్న పుస్తకం.
ఏఐ మెచ్యూరిటీ అసెస్‌మెంట్ మోడల్: ఇది ఒక ప్రణాళిక (ఫ్రేంవర్క్). కృత్రిమ మేధ ప్రధాన సాంకేతికతలను రక్షణ సంస్థలు ఎంతవరకు అనుసరిస్తోందో అంచనా వేయడంతో పాటు దీనికి సంబంధించిన విధివిధానాలను మెరుగుపరుచుకోవడంలో ఇది సాయపడుతుంది.
ఒక ప్రదర్శనను కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 20 ప్రధాన రక్షణ కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ ప్రధాన రక్షణ కంపెనీలు.. ఎమ్ఎస్ఎమ్ఈలను భాగస్వాములుగాను, సరఫరాదారులుగాను, నూతన ఆవిష్కర్తలుగాను జతపరుచుకోవడానికి సంబంధించిన తమ కార్యకలాపాలను, కార్యక్రమాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించాయి. దీనికి అదనంగా, 24 భారతీయ, విదేశీ కంపెనీలు కూడా ఈ ప్రదర్శనలో పాలుపంచుకుంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, యాడిటివ్ మాన్యుఫాక్చరింగ్‌లతో పాటు స్మార్ట్ మెటీరియల్స్ వంటి ఆధునిక తయారీ సాంకేతికతలను ప్రదర్శిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి, సైన్య ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ (ఆర్ అండ్ డీ) కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్‌లతో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
(రిలీజ్ ఐడి: 2243011)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9